ఏం ఆశించి టీడీపీలో చేరారు? ప్రాణం ఉండే వెళ్లారా?

  • రాజ్యాంగంపై బాబుకు గౌరవమే లేదు
  • వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చూసి నేర్చుకో బాబూ!
  • ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్న ఘనత జననేతది
  • టీడీపీ ఛాలెంజ్‌కు వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధం
  • విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో బహిరంగ చర్చకు సిద్ధమా?
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి
విజయవాడ: ఏం ఆశించి ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి  ప్రశ్నించారు.  ప్రాణం ఉన్నంత వరకు వైయస్‌ఆర్‌ సీపీలోనే ఉంటానని చెప్పిన ఎంపీ ఈ రోజు టీడీపీకి ప్రాణంతో వెళ్తున్నారా.. లేక మరే విధంగానైనా వెళ్తున్నారా చెప్పాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళగా పేద ప్రజల బాగుకై పోరాడాల్సిన పార్లమెంట్‌ సభ్యురాలు సొంత ప్రయోజనాల కోసం పార్టీలు మారడం సబబు కాదని పార్థసారధి మండిపడ్డారు.  విజయవాడలో పార్టీ కార్యాలయంలో సీనియర్‌ నేత జోగి రమేష్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఏమి చూసి, ఆశించి టీడీపీలో చేరారో బుట్టా రేణుక కర్నూలు, రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా బలహీనవర్గాలకు వివరణ ఇచ్చుకోవాలని డిమాండ్‌ చేశారు. మూడున్నర సంవత్సరాల్లో రాష్ట్రంలో ఘనంగా అభివృద్ధి చెందిందని భావిస్తున్నారా.. లేక కర్నూలులో జాతీయ జెండా సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చారనా.. లేక మిమ్మల్ని ఎన్నికల్లో ఓడించడానికి ప్రత్యర్థిని దింపి ఇచ్చిన హామీలను నెరవేర్చారని టీడీపీలో చేరారా? అని ప్రశ్నించారు. 

రూ.70 కోట్లకు ఆశించి వెళ్తున్నారా?
బలహీనవర్గానికి చెందిన వనితకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టికెట్‌ ఇచ్చి గెలిపించారని గుర్తు చేశారు. కొంతైనా విశ్వాసం అనేది లేకుండా పార్టీ మారడం సమంజసం కాదన్నారు. పార్టీ మారితే చంద్రబాబు మీకు ఏమి తాయిళాలు ఇస్తామన్నారో చెప్పాలన్నారు. దాదాపు రూ. 70 కోట్ల ఒప్పందాలు జరిగినట్లు ప్రజలంతా చెప్పుకుంటున్నారని, దాన్ని ఆశించి వెళ్తున్నారా అని నిలదీశారు. 

అసలు రంగు బయటపడుతుందనే ఫిరాయింపు
ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారత రాజ్యాంగంపై గౌరవం లేదని పార్థసారధి మండిపడ్డారు. ప్రజాస్వామ్యవాదులు, పత్రికలు చంద్రబాబు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడని గోషిస్తున్నా పట్టించుకోకుండా నియంతలా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో ఉన్నత విలువలు నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టీడీపీ శాసనమండలి సభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డిని రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నారని గుర్తు చేశారు. అది చూసిన తరువాతైనా చంద్రబాబుకుఇంగిత జ్ఞానం కలగలేదని ఆరోపించారు. వైయస్‌ జగన్‌ నవంబర్‌ 2వ తేదీ నుంచి చేపట్టబోయే పాదయాత్రతో చంద్రబాబు అసలు రంగు బట్టబయలు అవుతాయని గమనించి ప్రజల దృష్టి మరల్చేందుకు ఫిరాయింపులకు తెగబడ్డాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంత్రి కాల్వకు మతిభ్రమించింది
ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన బీసీ సమావేశం విజయవంతమైందని పార్థసారధి స్పష్టం చేశారు. టీడీసీ సర్కార్‌ కులవృత్తులను తొక్కేస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని బీసీ నేతలంతా సమస్యలు వెల్లడించారని చెప్పారు. దానికి సమాధానం చెప్పుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీపై ఛాలెంజ్‌ చేయడం సిగ్గుచేటన్నారు. మంత్రి కాల్వ శ్రీనివాసులు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కాదు టీడీపీలోనే బడుగులు అభివృద్ధి చెందారనడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు 12 ఏళ్ల పరిపాలనలో చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం పేరు ఒక్కటైనా ఉందా అని మంత్రిని ప్రశ్నించారు. కాల్వ శ్రీనివాసులు మతిభ్రమించి మాట్లాడుతున్నాడన్నారు. టీడీపీ విసిరిన ఛాలెంజ్‌కు వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధంగా ఉందని, కెబినెట్‌ మంత్రులంతా బహిరంగ చర్చకు వచ్చి అభివృద్ధి నిరూపించుకోవాలని ప్రతిసవాల్‌ విసిరారు. టీడీపీ మంత్రులకు దమ్మూ, ధైర్యం, చావ ఉంటే విజయవాడ పిడబ్ల్యూడీ గ్రౌండ్‌కు రావాలని ధ్వజమెత్తారు. బడుగు, బలహీనవర్గాలు అభివృద్ధి చెందాలని అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టిన ఘనత వైయస్‌ఆర్‌దన్నారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇల్లు, ఫీజురియంబర్స్‌మెంట్, పెన్షన్లు వంటి ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు వ్యవసాయం దండగ, కౌలుదారి రైతులపై కాల్పులు, ఇసుక, మట్టి మాఫియా, పార్టీ ఫిరాయింపులు తప్పితే ప్రజలకు చేసిన మంచి ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. 
 
Back to Top