వివరణ ఇచ్చా.. మళ్లీ వస్తా

 • తల్లి విజయమ్మ ఆశీస్సులతో దిల్‌కుశకు జగన్మోహన్‌రెడ్డి
 • శనివారం కూడా సీబీఐ ఆఫీసుకు వస్తానని వెల్లడి
 • ఆయన వెంట వెళ్లిన ఆళ్ల నాని, సబ్బం హరి, భూమా నాగిరెడ్డి
 • లోటస్‌పాండ్, దిల్‌కుశ వద్ద ఆద్యంతం పోలీసుల వీరంగం
 • రోడ్లన్నీ అష్టదిగ్బంధం చేసి ఉదయం నుంచే ఓవరాక్షన్­
 • భారీగా ట్రాఫిక్‌ జామ్
 • మండుటెండలో జనం విలవిల
 • వైయస్సార్‌సీపీ నేతలనూ అనుమతించని పోలీసులు
 • ఖైరతాబాద్ వద్దే జగన్ కాన్వాయ్ నిలిపివేత
 • లేక్‌వ్యూ వరకు వెళ్తామన్నా అనుమతి నిరాకరణ
 • జగన్ అభిమానులను అదుపులోకి తీసుకున్న వైనం

హైదరాబాద్, 2012 మే 23 : ' సీబీఐ అధికారులు వివరణ అడిగారు. వారడిగిన వాటికి పూర్తిగా వివరణ ఇచ్చాను ' అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. సీబీఐ క్యాంపు కార్యాలయమైన దిల్‌కుశ అతిథి గృహంలో ఆయన శుక్రవారం విచారణకు హాజరయ్యారు. అనంతరం తిరిగి వెళ్తూ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ఇంకా మరికొన్ని అంశాలకు వివరణ ఇవ్వాల్సి ఉందని, అందుకోసం శనివారం కూడా వస్తానని తెలిపారు.

విచారణ ప్రశాంత వాతావరణంలో జరిగిందని విలేకరుల ప్రశ్నకు బదులుగా ఆయన చెప్పారు. విచారణ నిమిత్తం దిల్‌కుశ అతిథి గృహంలోకి వెళ్లేప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో, బయటికి వచ్చేప్పుడు కూడా జగన్ అదే ఉత్సాహంతో కనిపించారు. దిల్‌కుశ ప్రధాన ద్వారం వద్దకు రాగానే, మాట్లాడాల్సిందిగా మీడియా ప్రతినిధులు కోరడంతో వాహనం ఆపాలని డ్రైవర్‌ను ఆదేశించారు. అందరికీ కనిపించేలా కారు డోర్ దగ్గర నిలబడి వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అనంతరం బై.. బై... అంటూ తనదైన శైలిలో చేయి ఊపుతూ వెళ్లిపోయారు.

సుదీర్ఘంగా విచారణ :

విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10.30కు జగన్ దిల్‌కుశ అతిథి గృహానికి వచ్చారు. అనకాపల్లి ఎంపీ సబ్బం హరి, ఏలూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల నాని, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి ఆయన వెంటవచ్చారు. తరవాత కొద్దిసేపటికి సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ జగన్‌ను విచారించారు. ఆ సందర్భంగా హరి, భూమా, నాని వేరే గదిలో ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హరి బయటికి వెళ్లిపోయారు. జగన్మోహన్­రెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన వారికి జగన్ నివాసం నుంచి భోజనం వచ్చింది. మధ్యాహ్నం 1.30 సమయంలో వారికి భోజనం తీసుకుని వస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకుని కిలోమీటర్ దూరంలోనే నిలిపేయడంతో భోజనం తెచ్చినవారు కాలినడకనే దిల్­కుశ అతిథిగృహానికి రావాల్సివచ్చింది. భోజన విరామ సమయం మినహా విచారణ సుదీర్ఘంగా కొనసాగింది. సాయంత్రం 6.30 గంటలకు విచారణ ముగిసిన తరువాత భూమా, నానిలతో కలిసి ఒకే వాహనంలో జగన్మోహన్­రెడ్డి తిరిగి వెళ్లిపోయారు.

వాన్‌పిక్ ఉదంతంలో అరెస్టయిన మంత్రి మోపిదేవి వెంకటరమణ, మ్యాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌టీఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిలను కూడా సీబీఐ అధికారులు విచారించారు. సాయంత్రం 4.30కు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఈ సమయంలో విచారణ కుట్రే: సబ్బం

ఉప ఎన్నికలు జరుగుతున్న తరుణంలో జగన్మోహన్­రెడ్డిని విచారణకు పిలవడం కచ్చితంగా కుట్రేనని సబ్బం స్పష్టం చేశారు. దిల్‌కుశ నుంచి తిరిగి వెళ్తూ ఆయన మీడియాతో మాట్లాడారు. ' కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని జగన్ కూడా చెప్పారు. నేనూ అలాగే భావిస్తున్నాను. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం మేరకు 26 జీవోలిచ్చారు. జగన్ నిందితుడిగా నిర్ధారణ కావాలంటే ఆ జీవోలు రైటో, రాంగో ముందుగా తేలాల్సి ఉంది. ఆ జీవోలపై నిర్ధారణ రానంత వరకూ జగన్‌పై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమే ' అని ఆయన అన్నారు. జగన్ అరెస్టు వార్తలపై స్పందించాలని కోరగా, అది సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను అడగాలని సబ్బం సూచించారు. వైయస్ రాజశేఖరరెడ్డికి, జగన్మోహన్‌రెడ్డికి తాను అభిమానినని ఒక ప్రశ్నకు సమాధానంగా పునరుద్ఘాటించారు.

పోలీసుల వీరంగం :

సీబీఐ విచారణ సందర్భంగా జగన్మోహన్­రెడ్డి నివాసం లోటస్‌పాండ్‌తో పాటు దిల్‌కుశ అతిథి గృహం సమీపంలో పోలీసులు శుక్రవారం వీరంగం చేశారు. జగన్ నివాసానికి వెళ్లే దారిలో బారికేడ్లు పెట్టి, ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. జగన్మోహన్­రెడ్డిని కలిసేందుకు వెళ్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా నిలిపేయడంతో పోలీసులతో వారికి వాగ్వాదం జరిగింది. పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులను దరిదాపుల్లోకి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. జగన్మోహన్­­రెడ్డి దిల్‌కుశకు వస్తున్న సమయంలోనూ ఖైరతాబాద్ వద్ద పోలీసులు అతిగా వ్యవహరించారు. జగన్­­ వెన్నంటి వస్తున్న కాన్వాయ్‌లోని వాహనాలను ఖైరతాబాద్ వద్ద నిలిపేశారు. లేక్‌వ్యూ వరకు తాము వెళ్తామన్నా అనుమతించలేదు.

ఇక దిల్‌కుశకు దారి తీసే మార్గాలన్నింటినీ ఉదయం నుంచే దిగ్బంధించారు. బారికేడ్లు, ఇనుప కంచెలు వేశారు. అయినప్పటికీ పలువురు జగన్మోహన్­­రెడ్డి అభిమానులు దిల్‌కుశ అతిథిగృహం వద్దకు చేరుకున్నారు. ఉదయం 11.30 సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నేత వెల్లాల రామ్మోహన్ దిల్‌కుశ వద్దకు చేరుకుని ‘జై జగన్ ’ అంటూ నినాదాలు చేశారు. దాంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం నాలుగు గంటల లోపు జగన్మోహన్­­రెడ్డి అభిమానులు పలుమార్లు దిల్‌కుశకు చేరుకుని నినాదాలు చేశారు. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజా వీడియోలు

Back to Top