విద్యుత్తు భారం ఉపసంహరించకుంటే పెను ఉద్యమం

హైదరాబాద్, 29 జనవరి 2013:

యూపీఏ ప్రభుత్వం ప్రజలను అవమానిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ చెప్పారు.  బ్యూరోక్రాట్లా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రలో ప్రత్యేక పరిస్థితి నెలకొందనీ ఇందుకు రెండు కారణాలున్నాయనీ తెలిపారు. యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిందన్నారు. దీనికి ఉదాహరణ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యవహారశైలిని ఆయన ఉదహరించారు. కిందటి నెల 28న తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో నిర్ణయాన్ని నెలలో చెపుతామన్న షిండే.. ఈనెల 28న మరింత సమయం కావాలని కోరడం ఉభయ ప్రాంతాల వారినీ అవమానించడమేనన్నారు. 'వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో డిమాండ్ చేసేది ఒకటే. మూడేళ్ళుగా సాగుతున్న ఉద్యమంలో వందలాదిమంది విద్యార్థులు ప్రాణాలు వదిలారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సమస్యను త్వరగా తేల్చాలి' అని జనక్ ప్రసాద్ కోరారు.

విద్యుత్తు చార్జీలతో పేదల నడ్డి విరుస్తున్న కిరణ్

     రాష్ట్రంలోని ప్రభుత్వం మహానేత రెక్కల కష్టం మీద ఏర్పడింది. ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా ఆయన చూసుకున్నారని చెప్పారు. 'ఆయన విద్యుత్తు చార్జీలు పెంచలేదు. గ్యాస్ దర పెంచితే రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకున్నారు. ఆయన మరణానంతరం పరిస్థితులు తిరగబడ్డాయి. ప్రజల బాధలు పట్టించుకునే నాధుడు లేకపోయారు. విద్యుత్తు ఛార్జీలను పదేపదే పెంచుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తోంది' అని తెలిపారు. మూడునెలలకోసారి ఫ్యూయల్ సర్చార్జి వేస్తూ ఇప్పటికి 32వేల కోట్ల రూపాయలు వసూలు చేసిందన్నారు. ఆరువేల కోట్ల రూపాయలు సర్దుబాటు చార్జీలు వసూలు చేసిందన్నారు. 'ప్రస్తుతం 12400 కోట్ల రూపాయలు కరెంటు చార్జీలు పెంచాలనుకుంటున్నారు. ఈ త్రైమాసికానికి 968 కోట్ల రూపాయలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఉంది' అని చెప్పారు.  కరెంటు చార్జీలు పెంచడం వల్ల, వేలాది పరిశ్రమలు మూతపడ్డాయనీ,  లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారనీ,  పారిశ్రామిక ప్రగతి నిలిచిపోయిందనీ వివరించారు. రైతుల నుంచి 2004 సంవత్సరం నుంచి సర్ ఛార్జీల వసూలుకు సిద్ధపడటం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యున్నియంత్రణ మండలికి నాలుగు సార్లు అభ్యంతరాన్ని తెలిపిందన్నారు. 'స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఆర్ఈసీ ప్రభుత్వ తొత్తుగా మారడం వల్ల ప్రజలు కరెంటు చార్జీలు భరించలేక తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ విషయాలను ఆర్ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రంలో విద్యుదుత్పత్తికి సరిపడా ఉపయోగించిన తరవాత మాత్రమే ఇతర రాష్ట్రాలకు గ్యాస్ ఇవ్వాలని దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ సూచించారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అందుకు భిన్నంగా చేస్తోంది' అని జనక్ ప్రసాద్ ధ్వజమెత్తారు.  జీఎమ్ఆర్, తదితర సంస్థలకు గ్యాస్ ఇచ్చి యూనిట్ 5.20రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్త్తోందనీ, ఇలా చెల్లించిన కోట్లాది రూపాయలను తిరిగి వసూలు చేయాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. బొగ్గు ధర  పెరిగినపుడు చట్ట విరుద్ధంగా ఎఫ్ఎస్ఏ మోపినపుడు ఆ డబ్బును ప్రైవేటు సంస్థల నుంచి ఎందుకు రాబట్టరని ఆయన ప్రశ్నించారు. 2008 నుంచి అద్దెకున్న వారి దగ్గర ఎఫ్ఎస్ఏ రూపంలో అదనపు చార్జీలను వసూలు చేస్తున్న ప్రభుత్వం ప్రైవేటు విద్యుత్తు సంస్థల నుంచి రాబట్టాలని తమ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. పవన విద్యుత్తు ధర యూనిట్ మూడు రూపాయలైతే.. దానిమీద కూడా రూపాయి పెంచారు. ఇలా చేస్తోంటే ఈ ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లయినా లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంపోర్టెడ్ బొగ్గు టన్ను 3200రూపాయలకు లభిస్తుంటే జెన్‌కో 5300రూపాయలకు కొంటున్నా ప్రభుత్వం నోరుమెదపడం లేదన్నారు. అందువల్ల ఉత్పత్తి వ్యయం పెరిగినందున ప్రజలపై ఎఫ్ఎస్ఏ భారం మోపుతోందన్నారు. ఇదో పెద్ద కుంభకోణమనీ, దీనిపై న్యాయవిచారణ చేయాలనీ జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు.     ఈ మూడేళ్ళలో జెన్‌కో ఎన్ని వేల కోట్ల రూపాయల విదేశీ బొగ్గును కొనుగోలు చేసిందీ.. అందులో ఎంత దుర్వినియోగమైందీ, ప్రభుత్వం వాటా ఎంత తేలాలన్నారు. ఈ అంశం వల్లే ఇవాళ విద్యుత్తు చార్జీలు పెరిగాయన్నారు. విద్యుత్తు వినియోగదారులపై 968 కోట్ల రూపాయల భారాన్ని మోపాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే తమ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని జనక్ ప్రసాద్ హెచ్చరించారు.

కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాటనవే బాబూ!
  

      కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి ఒక్కనాడు కూడా ఆ పార్టీని గానీ, చార్జీల పెంపుదలను కానీ ప్రశ్నించడంలేదన్నారు. ఆ పార్టీతో అంటకాగుతున్నారన్నారు. తన పార్టీ నాశనమైనా, ఎమ్మెల్యేలు పోయినా ఆయనకు పట్టదు. ఆయన ఆశయం ఒక్కటే. ఐఎంజీ భూముల కుంభకోణంలో  అరెస్టు కాకుండా చూసుకునేందుకే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  సొసైటీల ఎన్నికలలో ప్రభుత్వం అక్రమాలకు దారితీస్తోందన్నారు. కాంగ్రెస్ ఓడిపోయే చోట ఎన్నికలు రద్దు చేయడమో, పోటీ చేయకపోవడమో చేస్తోందని ఎద్దేవా చేశారు. దీనిమీదకూడా చంద్రబాబు గానీ, సంబంధిత మంత్రి గానీ నోరెత్తలేదని జనక్ ప్రసాద్ చెప్పారు.

Back to Top