నెల్లూరు జిల్లాలో ఒక్క మండ‌లం కూడా లేదా?  

రైతులు దుర్భిక్ష పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది

మాజీ మంత్రి కాకాణి ఫైర్‌

 నెల్లూరు: ఎల్‌నీనో ప్రభావంతో రైతాంగం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నా ప్రభుత్వం కరువు మండలాల ప్రకటనలో జాప్యం చేస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం విజయ్‌కుమార్‌, గురవయ్యతో కలిసి కలిసిన అనంతరం ఆయన మాట్లాడారు.

నెల్లూరు జిల్లాలో 35 మండలాలు ఉన్నప్పటికీ ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించలేదని కాకాణి అన్నారు. వెంటనే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. శ్రీశైలం జలాశయం నుంచి సోమశిలకు నీటిని తరలించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కేసులు పెట్టడం సరికాదన్నారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఉచిత పంటల బీమా అమలు చేయడంతో రైతులకు భరోసా కల్పించామని కాకాణి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కరువు పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమైందని ఆరోపించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లను, విడుదల చేసిన నిధులను కూడా ప్రస్తుత ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటోందని విమర్శించారు. కేసులను ఎదుర్కొని రూ.10 వేల కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను ప్రజలకు ఉచితంగా అందించామని కాకాణి తెలిపారు. ప్రజలకు చేసిన పనులకు ప్రభుత్వం క్రెడిట్‌ తీసుకోవడం కాకుండా రైతులు, పేదల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు.

Back to Top