'బుర్రిపాలెం'లో బాబు బుర్రకథలు! 

గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ పథకాన్ని భ్రష్టు పట్టించారని నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు 

31 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలు, 21 లక్షలకు పైగా గృహాలను మంజూరు చేసింది వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వమే 

అక్క చెల్లెమ్మల పేరిటే ఇళ్లు, ఇళ్ల పట్టాలిచ్చి మహిళా సాధికారతకు జగన్‌ తోడ్పాటు 

పేదలకు గజం స్థలం ఇచ్చిన పాపాన పోని చంద్రబాబు సర్కారు 

5.5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చేశామని అవాస్తవాల ప్రచారం 

గత ప్రభుత్వంలో మంజూరైనవి, నిర్మించిన ఇళ్లను తన ఖాతాలో వేసుకుంటున్న చంద్రబాబు 

‘సూపర్‌ సిక్స్‌’ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పచ్చి అబద్ధాలు

అమరావతి: అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లె వేశారు. సూపర్‌ సిక్స్‌లు, ఇతర హామీలు అమలు చేయకుండా తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పచ్చి అబద్ధాలను నిత్యం ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా బుర్రిపాలెం వేదికగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ పథకాన్ని భ్రషు్టపట్టించారంటూ విమర్శలు చేశారు. ఈ క్రమంలో వాస్తవాలను ఓసారి పరిశీలిస్తే చంద్రబాబు చెప్పిన మాటలన్నీ అవాస్తవాలేనని స్పష్టం అవుతుంది.  

బాబు:  వైయ‌స్సార్‌సీపీ హయాంలో 2019–24 మధ్య గృహ నిర్మాణ పథకాన్ని భ్రష్టుపట్టించారు. 
వాస్తవం: రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడం కోసం వైఎస్సార్‌సీపీ హయాంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఏకంగా 31 లక్షల మందికిపైగా మహిళల పేరిట ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. నాడు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాల మార్కెట్‌ విలువే రూ.76 వేల కోట్లకు పైగా ఉంటుంది. ఇలా రాష్ట్రంలోనే కాకుండా దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా గృహ నిర్మాణ పథకంలో నూతన శకాన్ని వైయ‌స్‌ జగన్‌ ఆవిష్కరించారు.  

బాబు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 5.5 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చాం. 
వాస్తవం:  గత ప్రభుత్వంలో పేదలకు 31 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో పాటు 21 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేశారు. 2024 ఎన్నికల నాటికే 9 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు ఇచ్చేశారు. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. కాగా, ఆ ఇళ్లనే తాను నిర్మించి పేదలకు ఇచ్చినట్టుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. 


బాబు: 2029 నాటికి పేదలందరికీ ఇళ్లు సమకూరుస్తాం 
వాస్తవం: పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాలు ఇచ్చి, ఇళ్లు కూడా నిర్మిస్తామని చంద్రబాబు 2024 ఎన్నికల్లో మేనిఫెస్టో ద్వారా హామీ ఇచ్చారు. గద్దెనెక్కి రెండున్నరేళ్లు కావస్తున్నా నేటికీ పేదలకు గజం స్థలం కూడా మంజూరు చేయలేదు. గజం స్థలం సేకరించి పేదలకు పంపిణీ చేయకుండానే ఏకంగా రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలను పేదలకు ఇచ్చేశామంటూ చంద్రబాబు నమ్మబలుకుతున్నారు. విశాఖ, విజయవాడ, మంగళగిరి మరికొన్ని ప్రాంతాలలో కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించి దాన్నే గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు.  

Back to Top