సమైక్య వాదుల జోలికి వస్తే సహించం

హైదరాబాద్‌ :

సమైక్యవాదులపై కాంగ్రెస్‌, టిడిపి నాయకులు చేస్తున్న దాడులను వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ‌ తీవ్రంగా ఖండించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని సమైక్య ఉద్యమంలో పాల్గొంటున్న వారిపై ఆ పార్టీల నాయకులు దాడులకు తెగబడుతుంటే తాము చూస్తూ ఊరుకోబోమని ఆమె హెచ్చరించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి దీక్ష శిబిరం సమీపంలో వాసిరెడ్డి పద్మ శనివారంనాడు మీడియాతో మాట్లాడారు.

దగా పడిన సీమాంధ్ర ప్రజలు ఆవేదనతో శాంతియుతంగా సమైక్య ఉద్యమం చేస్తుంటే.. కొన్ని సంఘటనలను బూచిగా చూపి వారిపై పోలీసులతో దాడులు చేయించడం సమంజసం కాదని పద్మ వ్యాఖ్యానించారు. కేంద్ర బలగాలను మొహరించి కొంతమంది ఆందోళనకారులను కావాలనే లక్ష్యంగా చేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సమైక్యవాదుల జోలికి వస్తే తమ పార్టీ చూస్తూ ఊరుకోబోదని ఆమె హెచ్చరించారు. త్వరలోనే వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తుందని, సమైక్య వాదులపై ఇప్పుడు పెట్టే కేసులను ఎత్తేస్తుందని పద్మ తెలిపారు.

గాపడిన సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్‌, టిడిపి నాయకులను నిలదీస్తున్న క్రమంలో వారికి సమాధానం చెప్పాల్సిన నాయకులు గూండాల మాదిరిగా ప్రవర్తిస్తూ దాడులకు దిగడం ఆక్షేపణీయమని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఏ రాజకీయ పార్టీల అండ లేకపోయినప్పటికీ లక్షలాది మంది ప్రజలు, ఉద్యోగులు ఉద్యమిస్తుంటే పోలీసులతో హింసించడం సరైంది కాదన్నారు. ప్రజా ఉద్యమాలకు తలవంచాల్సిందిపోయి, అధికారం చేతిలో ఉంది కదా అని ప్రజలపై దాడులకు దిగడం సమంజసం కాదని కాంగ్రెస్‌ పార్టీ నాయకులకు పద్మ హితవు చెప్పారు.

Back to Top