చంద్రబాబు ఢిల్లీ దీక్ష కుమ్మక్కు డ్రామా

హైదరాబాద్, 8 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనకుండా ఢిల్లీలో దీక్ష పేరుతో డ్రామా ఆడుతున్న చంద్రబాబు తీరును వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తప్పుపట్టింది. గుడ్డికన్ను ఉంటే ఎంత.. ఊడితే ఎంత? అనే విధంగా ఆయన ఎన్ని దీక్షలు చేస్తే ఏమిటి? ఎన్ని డ్రామాలాడితే ఏంటని విమర్శించింది. సీమాంధ్రుల ఉద్యమాలు, వారి కష్టాల పునాదుల మీద చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో మరోసారి పందిరి వేసుకునేందుకు సిద్ధమయ్యారని నిప్పులు చెరిగింది. సీమాంధ్ర మొత్తం సంక్షోభంలో పడిపోయిన సమయంలో కూడా స్వార్థ ప్రయోజనాల కోసమే చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు లోటస్‌పాండ్‌లోని తన క్యాంపు కార్యాలయం వద్ద శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నాలుగు రోజులుగా సమైక్య దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షా శిబిరం వద్ద మంగళవారంనాడు పార్టీ అధికార ప్రతినిధి మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ చంద్రబాబు దీక్షపై విమర్శనాస్త్రాలు సంధించారు.

రాష్ట్రాన్ని విభజించడం తనకు ఇష్టమే అని ఇప్పటి వరకూ మాట్లాడుతూనే ఉన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి దీక్ష ఎందుకు చేస్తున్నారంటే.. స్పష్టంగా సమాధానం చెప్పడంలేదని పద్మ తూర్పారపట్టారు. చంద్రబాబు దీక్ష సీమాంధ్రుల కష్టాలను చూసి చలించి వారి క్షేమం కోసం చేస్తున్న దీక్ష కాదని విమర్శించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ సీమాంధ్రలోని ప్రజలు ఎన్నో ఇబ్బందులకు ఓర్చి ఉద్యమం చేస్తున్నారని, కనీసం రవాణా, వైద్య సౌకర్యాలు కూడా లేక నానా పాట్లూ పడుతున్నారని పద్మ ఆవేదన వ్యక్తంచేశారు.

ఢిల్లీలోని ఎ.పి.భవన్‌లో చంద్రబాబు దీక్షకు అనుమతి లేనప్పుడు నిన్నంతా అధికారులు ఏం చేశారని పద్మ నిలదీశారు. అవగాహన మేరకే చంద్రబాబు దీక్షకు కాంగ్రెస్‌ పార్టీ ప్రోత్సహించిందని ఆమె ఆరోపించారు. నిన్నటిదాకా అనుమతి ఇచ్చి ఈవాళ లేదని చెప్పడం అంటే.. చంద్రబాబు ఏదో పెద్ద పోరాటం చేయడానికి ఢిల్లీ వెళ్ళారని, దానిని కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేసిందనేలా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఆ పార్టీలు రెండూ చేసిన కుమ్మక్కు రాజకీయాలు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ విభజనకు నిర్ణయిస్తే.. దానిని చంద్రబాబు వ్యతిరేకించకపోవడమే వాటి కుమ్మక్కు రాజకీయాలకు నిదర్శనం అన్నారు.

రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలు కలిసి ఉండాలని.. సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి నాలుగైదు లక్షల కోట్ల ప్యాకేజ్‌ ఇస్తే చాలంటూ రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించిన వెంటనే చంద్రబాబు మాట్లాడిన తీరును వాసిరెడ్డి విమర్శించారు. సీమాంధ్రలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నప్పటికీ కూడా విభజనను ఆపాలి అని ఒక్క రోజున కూడా చంద్రబాబు మాట్లాడలేదని గుర్తుచేశారు.

కేబినెట్‌ నోట్‌కు ముందే అసెంబ్లీని సమావేశపరిచి సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి స్పష్టంగా చెప్పిన వైనాన్ని పద్మ ప్రస్తావించారు. అయితే ఆ ప్రతిపాదనపై చంద్రబాబు స్పందించలేదన్నారు. అసెంబ్లీని సమావేశపరచాలని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గవర్నర్‌కైనా ఒక విజ్ఞప్తి అందచేయలేదని దుయ్యబట్టారు. సీమాంధ్రలో ఓట్లు, సీట్లు పోతాయనే కాంగ్రెస్, టిడిపిలు కలిసి ఒక డ్రామా నడిపిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర విభజన ఆగిపోకూడదు కానీ సీమాంధ్ర ప్రజల తరఫున తానేదో మాట్లాడుతున్నట్లు కనిపించాలన్నదే చంద్రబాబు నాటకం అని ఎద్దేవా చేశారు. ఈ యావతోనే సీమాంధ్రులను వదిలేసి ఢిల్లీ మీడియా మీద చంద్రబాబు పడ్డారన్నారు. అయితే.. సీమాంధ్రుల వైపు తానున్నానంటూ ఒక్క మాట కూడా చంద్రబాబు జాతీయ మీడియా ముందు చెప్పని వైనాన్ని ఆమె ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎలాగూ స్థానం పోయింది కనుక జాతీయ రాజకీయాల్లో అయిన కాలుపెట్టడానికి కర్చీఫ్‌ వేసుకునేందుకే చంద్రబాబు ఢిల్లీ డ్రామాకు తెరలేపారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

చంద్రబాబు దీక్ష పట్ల తెలుగు ప్రజలకు విశ్వాసం లేదు కనుకే స్పందన లేక శిబిరం వెలవెలబోయిందని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. ఆత్మగౌరవం పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చేసిన చంద్రబాబు యాత్రకే జనం స్పందన లేదని, తాను విభజన వాదో లేక సమైక్యవాదో చెప్పలేని అయోమయంలో దీక్ష చేస్తున్న ఆయన దీక్షకు ఇక ఢిల్లీలో స్పందన ఏ విధంగా వస్తుందని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ వచ్చిన చంద్రబాబు ఇప్పటికైనా సీమాంధ్రుల తరఫున నోరు విప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.

నాలుగు రోజులుగా సమైక్య దీక్ష చేస్తున్న శ్రీ జగన్‌ దీక్షా శిబిరం వద్దకు అనేక మంది తెలంగాణ ప్రాంతం వారు తరలి వచ్చి సంఘీభావం తెలుపుతున్నారని పద్మ తెలిపారు. సమైక్యాంధ్ర వైపు రమ్మని, సీమాంధ్రులకు మద్దతుగా ఉండమని చంద్రబాబుకు శ్రీ జగన్‌ పలుమార్లు విజ్ఞప్తి చేశారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో కుమ్మక్కు కావడం ఇకనైనా మానుకోవాలని చంద్రబాబు నాయుడికి పద్మ విజ్ఞప్తిచేశారు.

Back to Top