వంగవీటి రంగాను అంతమొందించింది చంద్రబాబే..!

చంద్రబాబు ప్రోద్బలంతోనే హత్య..!
హరిరామ జోగయ్య సంచలన వ్యాఖ్యలు..!
60 వంసతాలు నా రాజకీయ ప్రస్థానం పుస్తకంలో వెల్లడి..
 
విజయవాడః చంద్రబాబు వెన్నుపోటు, హత్యా రాజకీయాల గురించి మాజీ మంత్రి, సీనియర్ నేత హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండున్నర దశాబ్దాల క్రితం రాష్ట్ర రాజకీయాల్ని ఓ కుదుపు కుదిపేసిన విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా దారుణహత్యకు చంద్రబాబే కారణమని ..హరిరామజోగయ్య"అరవైవసంతాల నా రాజకీయ ప్రస్థానం" పుస్తకంలో ప్రచురించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే రంగా హత్యకు గురయ్యారని ప్రకటించారు. 

మనగడ ఉండదనే హత్య..!
మోహన రంగాకు నాడు భద్రత పునరుద్ధరించకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని హరిరామజోగయ్య తెలిపారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న తనకు వంగవీటి రంగా హత్య గురించి ముందుగానే తెలిసిందన్నారు. రంగాను బతకనిస్తే పార్టీకి మనుగడ ఉండదన్న కారణంతో  అంతమొదించేందుకు అనుమతివ్వాలని... నాడు విజయవాడకు చెందిన ఒక శాసనసభ్యుడు, రైల్వే కార్మిక సంఘ నేత ప్రభాకరరాజు పార్టీ నేతలతో కలసి చంద్రబాబు నాయుడును ఆశ్రయించారని తెలిపారు. అందుకు చంద్రబాబు పచ్చజెండా ఊపినట్లు తనకు సన్నిహితుడైన అత్తిలి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తనకు ఈవిషయం చెప్పారన్నారు. ఆతర్వాత వారం రోజులకే రంగా దారుణహత్య వార్తను వినాల్సి వచ్చిందన్నారు.

భద్రత ఉపసంహరించడం వల్లే..!
'అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం'పేరిట జోగయ్య 150 పేజీల పుస్తకం రచించారు. అందులో 71,72,73 పేజీల్లో కాపునాడు కలతలు శీర్షికన రంగా హత్యోదంతాన్ని ప్రస్థావించారు. విజయవాడలో'మహానాడు'విజయవంతంగా ముగిసిన కొద్దినెలలకే అదే ప్రాంగణంలో కాపు సామాజికవర్గ నేతలు కాపునాడు నిర్వహించారు. లక్షమందికిపైగా కాపు కులస్తులు హాజరైన ఆ సభలో కాపు నాయకులు ఎన్టీఆర్‌ను తీవ్రస్థాయిలో దుయ్యబట్టినట్లు హరిరామ జోగయ్య తెలిపారు.

దీంతో,కలత చెందిన ఎన్టీఆర్ తనను పిలిచి.. ఎందుకు మీ వాళ్లంతా(కాపుకులస్తులు) నన్ను వ్యతిరేకిస్తున్నారు? కారణమేమిటీ? అని అడిగారు. దానికి సమాధానంగా మోహనరంగారావుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన భద్రతను ఉపసంహరించడమేనని చెప్పాను. రంగాకు భద్రతను పునరుద్ధరిస్తే అసంతృప్తి తగ్గుతుందన్నాను. ఆ సూచనను ఆయన  ఆమోదించి అలానే చేస్తానన్నారు. కానీ మరునాటి ఉదయం కలసినప్పుడు 'సారీ జోగయ్యగారు.. మీ సలహా ప్రకారం చేయలేకపోతున్నాను. చంద్రబాబు తదితరులు ఇప్పుడే మార్పులు చేయొద్దు.. పరిస్థితి యథాతథంగా కొనసాగించడమే మంచిదంటున్నారు'అని ఎన్టీఆర్ చెప్పినట్లు జోగయ్య తెలిపారు. 

శిబిరంలోనే కిరాతకంగా హతమార్చారు..!
రంగా హత్య కుట్ర వెనుక చంద్రబాబు, ఉపేంద్ర, సిరీస్ సుబ్బరాజు హస్తాలు ఉన్నాయని శివరామరాజు తనతో చెప్పారన్నారు హరిరామజోగయ్య. నిరాహారదీక్ష చేస్తున్న వంగవీటి మోహనరంగాను శిబిరంలోనే అతి కిరాతకంగా హతమార్చారని ఇది తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ వివరాలను తానిప్పుడే కొత్తగా చెప్పడం లేదని...ఆ రోజులలోనే అనేక పబ్లిక్ మీటింగులలో, పత్రికా సమావేశాలలోనూ ప్రకటించానన్నారు. తాను రాసిన వాస్తవాలకు కట్టుబడి ఉన్నట్లు హరిరామజోగయ్య సాక్షితో మాట్లాడుతూ ప్రకటించారు. 
 

తాజా వీడియోలు

Back to Top