వైయస్ విమర్శకుల నోటికి తాళం


న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిర్వహించిన 'వైయస్ఆర్ పాదయత్ర' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం దీనికి వేదికైంది.   మహానేత వైయస్ఆర్ తన ఆత్మబంధువుగా అభివర్ణించిన రాజ్యసభ సభ్యుడు కె.వి.పి. రామచంద్రరావు ఈ పుస్తకాన్ని రచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్థి అని చెప్పడానికి తెగ తాపత్రయపడ్డారు. ప్రతిపక్ష నాయకునిగా వైయస్ఆర్ చేపట్టిన పాదయత్రకు కాంగ్రెస్ పూర్తిగా సహకరించిందని తెలిపారు. ఆయన కరడుగట్టిన కాంగ్రెస్ వాదనీ, గాంధీ,నెహ్రూల కుటుంబానికి నమ్మిన బంటనీ ప్రశంసించారు. 
ఈ తాపత్రయం వెనుక అసలు లక్ష్యం సామాన్యుడికి సైతం అర్థంకాకపోలేదు. ఉప ఎన్నికల సందర్భంలోనూ, ఇతర అంశాలలోనూ మహానేతపై నిందలేయడానికి కాంగ్రెస్ నేతలు పోటీ పడిన వైనాలు ఎవరి స్మృతిపథం నుంచి చెరిగిపోలేదు. కొద్దికాలం క్రితం గాంధీభవన్‌లో ఏర్పాటైన కార్యకర్తల సమావేశంలో కేవీపీ వైయస్ఆర్ అంశాన్ని ప్రస్తావిస్తూ కంటనీరు పెట్టుకున్నారు. మహానేత విషయంలో ఎందుకిలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. ఆ సందర్భంలో కార్యకర్తలు పెద్దపెట్టున వైయస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.
ఈ సంఘటనను కొందరు కాంగ్రెస్ నేతలు తప్పు పట్టారు. ముఖ్యంగా వి. హనుమంతరావు వంటి వారు అస్సలు సహించలేకపోయారు. ఇప్పుడాయన ప్రస్తావన ఎందుకని విరుచుకుపడ్డారు.  తన వాగ్ధాటితో ఆ కార్యక్రమానికి హాజరుకాకుండా చూడాలనుకున్న ఆయన యత్నం విఫలమైంది. ఆరోగ్యశ్రీ కార్యాలయ భవనానికి ఆయన పేరును తొలగించినప్పడు గానీ, 108 వాహనాలపై మహానేత చిత్రాన్ని తొలగించినప్పడూ లేవని నోళ్ళు కాంగ్రెస్ నేతలెవరైనా పొగిడితే అమాంతం లేస్తున్నాయి.  ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేసినప్పుడు సమావేశమైన కొందరు మంత్రులు వైయస్ఆర్ అపార శక్తిమంతుడనీ, ఆయన సంతకం పెట్టమంటే ధైర్యం తమకు లేదనీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించడం అందరికీ తెలిసిందే. అంటే తాము చేసిన తప్పును మహానేత మీదకి నెట్టేందుకు ప్రయత్నించారన్నది స్పష్టమైంది. 
మహానేతను ద్వేషించేవారందరికీ, పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నవారు చేసిన ప్రశంసలు ఒంటికి కారం పూసినట్లయ్యింది.  ఇప్పుడీ కార్యక్రమం పెట్టాల్సిన అవసరమేముందని వి. హనుమంతరావు నెత్తీనోరు బాదుకున్నారు. వైయస్ఆర్ జ్ఙాపకాలను తుడిచేయాలనుకున్న వారికి ఇదో శరాఘాతమైంది.  ఏఐసీసీ కోశాధికారి మోతీలాల్ ఓరా పుస్తకాన్ని ఆవిష్కరించారు. గులాం నబీ ఆజాద్, ఆస్కార్ ఫెర్నాండెజ్, టి. సుబ్బిరామిరెడ్డి, వాయలార్ రవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన చిరంజీవి, ఆర్.కె. ధావన్, పొన్నం ప్రభాకర్, ఉండవల్లి అరుణకుమార్, పలువురు రాష్ట్రమంత్రలు, ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నాలుగుసార్లు ఎంపీగా వ్యవహరించిన  డాక్టర్ వైయస్ఆర్‌తో కలిసి పనిచేసిన  పలువురు నాయకులు ఇందులో పాల్గొన్నారు.
కార్యక్రమ విజయాన్ని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పంపిన లేఖను టి. సుబ్బిరామిరెడ్డి చదివి వినిపించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డితో సంబంధాలను మెరుగుపరచుకునేందుకు చేసిన యత్నంగా పలువురు దీనిపై వ్యాఖ్యానించడం విశేషం. పుస్తకావిష్కరణ కార్యక్రమంతో మహానేతను గౌరవించినట్లుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని ఆ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు పేర్కొన్నారు. 
Back to Top