హైదరాబాద్, 25 సెప్టెంబర్ 2012: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిని ఎంతగా కాపీ కొట్టి పాదయాత్ర చేసినా ఇక ఎన్నటికీ సీఎం కాలేరని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ధ్వజమెత్తారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో శివాజీ మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖరరెడ్డి తరహాలో పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నారని విమర్శించారు.<br/>ఎస్సీ వర్గీకరణ పేరిట దళితుల మధ్య విభజన రేఖ గీయాలని చూడటం ఒక పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడికి తగదని శివాజీ అన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని కులాలవారు తెలంగాణ వాదానికి ఓటేస్తారే తప్ప తెలుగుదేశం పార్టీ ప్రకటించే తాయిలాలు చూసి మోసపోరని ఆయన చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశన్న, అధ్యక్షుడు బండి శ్రీను, హైదరాబాద్ కార్యదర్శి ఎం.మల్లేష్, అధ్యక్షుడు వెన్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.