<strong>హైదరాబాద్: :</strong> హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాల్లోని వివిధ సంఘాలకు చెందిన 200 మంది టీచర్లు మంగళవారం వైయస్‌ఆర్ కాంగ్రెస్ టీచర్సు ఫెడరేషన్‌లో చేరారు. టీచర్సు విభాగంలో కొత్తగా చేరిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ఆర్‌సిపి కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవి సుబ్బారెడ్డి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. సమాజంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తారని సుబ్బారెడ్డి అన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఉపాధ్యాయుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.<br/>బహుజన టీచర్సు అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రామసుబ్బారావు ఆధ్వర్యంలో ఈ టీచర్లంతా ఊరేగింపుగా వచ్చి వైయస్‌ఆర్ టీచర్సు ఫెడరేషన్ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్, ప్రముఖ న్యాయవాది వై.నాగిరెడ్డి, టీచర్సు ఫెడరేషన్ నాయకుడు కె.ఓబుళపతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.<br/>ఉపాధ్యాయుల అభ్యున్నతికి దివంగత మహానేత డాక్టర్ వైయస్ చేసిన సేవలు శ్లాఘనీయం అని రామసుబ్బారావు అన్నారు. పీఆర్సీ విషయంలో చొరవ చూపారన్నారు. ఉపాధ్యాయులకు ఆరోగ్యకార్డులు ఇవ్వాలని వైయస్ భావించారని ఆ పని పూర్తికాక ముందే ఆయన మృతి చెందడం వల్ల అమలుకు నోచుకోలేదన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమాన్ని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పరిరక్షిస్తుందని తామంతా ప్రగాఢంగా విశ్వసిస్తున్నామన్నారు.