ఇంకా ఎన్నాళ్లీ మోసం చంద్రబాబూగత నాలుగు జన్మభూమి కార్యక్రమాల్లో 21 లక్షల అర్జీలు
ప్రస్తుతం మూడు రోజుల్లో 3 లక్షలు
లక్షల అర్జీలు వస్తుంటే మీరు ప్రజలకు ఏం చేసినట్లు
80 శాతం ప్రజానికం సంతృప్తి కాదు వ్యతిరేకం
ఇప్పటికీ రుణమాఫీ చేసింది రూ. 11600 కోట్లు మాత్రమే
చంద్రబాబు డైరెక్షన్‌లోనే అరాచకాలు
ప్రతిపక్షం ప్రశ్నిస్తే గృహ నిర్బంధం చేస్తారా

హైదరాబాద్‌: జన్మభూమి కార్యక్రమం అధికారికమంటూ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ చంద్రబాబు తన పార్టీ కార్యకర్తల ప్రయోజనాలను కాపాడుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. జన్మభూమి–మాఊరు కార్యక్రమ ముఖ్య ఉద్దేశం పూర్తిగా విస్మరించారన్నారు. ఖర్చు ప్రభుత్వానిది.. సోకులు మాత్రం పార్టీవి అన్నట్లుగా ఇంకా ఎన్నాళ్లు ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు తిరగబడే రోజులు ఇంకెంతో కాలం లేవన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 4 జన్మభూమి కార్యక్రమాలు అయిపోయాయని, ఇప్పుడు 5వ కార్యక్రమం జరుగుతుందన్నారు. సహజంగా జన్మభూమి కార్యక్రమం జరిగినప్పుడు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. ఇంకా ఏం కావాలని అడిగి తెలుసుకోవాలని, ఆ తరువాత జరిగిన కార్యక్రమాల్లో ప్రజలడిన దరఖాస్తుల్లో ఏం నెరవేర్చారో చెప్పాలన్నారు. కానీ అవేవీ జరగడం లేదన్నారు. చేసిన వాగ్ధానాల్లో ఏమీ నెరవేర్చలేదు కాబట్టే తూతూ మంత్రంగా ఏదో జరిగినట్లుగా చెప్పుకుంటున్నారు కాబట్టే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయన్నారు. 

ఐదో విడుత జన్మభూమి కార్యక్రమం మొదలుపెట్టిన 3 రోజులకే మూడు లక్షల అర్జీలు వచ్చాయని ప్రభుత్వ మీడియా సలహాదారు పరికాల ప్రభాకర్‌ నివేదిక అందించారని, చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పారని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. గతంలో జరిగిన నాలుగు జన్మభూమి కార్యక్రమాల్లో సుమారు 21 లక్షల అర్జీలు వచ్చినట్లుగా తెలుస్తుందని, గతంలో 21, 5వ విడత జరగబోయే 10 రోజులు మరో 10 లక్షలు అంటే మొత్తం దాదాపు 30 లక్షల అర్జీలు వస్తున్నాయంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలను ఏమేరకు నెరవేర్చారో అర్థం అవుతుందన్నారు. ప్రభుత్వం కేవలం స్వార్థపరమైన పార్టీ కార్యక్రమాలకే పరిమితం అవుతుందని, ప్రజల సంక్షేమానికి, గ్రామాల అభివృద్ధికి పనిచేయడం లేదని అర్జీల ద్వారా ప్రజలే చెబుతున్నారన్నారు. నాలుగు జన్మభూమి కార్యక్రమాల్లో వచ్చిన అర్జీలలో ఏ మేరకు నెరవేర్చారో యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడం లేదని ప్రజలే టీడీపీ నేతల మొహం మీదే చెబుతున్నారన్నారు. 

ప్రభుత్వం కార్యక్రమం అంటే జవాబుదారి తనం ఉండాలని, ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని ఉమ్మారెడ్డి సూచించారు. రైతుల రుణమాఫీ రూ.87.612 కోట్లు ఉంటే దానిలో మొదటి విడతగా రూ. 11 వేల కోట్లు, తరువాత బడ్జెట్‌లో రూ. 3600 కోట్లు కేటాయించి ఇచ్చామని చెప్పారు. కానీ వాస్తవంగా ప్రజలకు ఇచ్చింది రూ. 11600 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఇంకా ఒక బడ్జెట్‌ మాత్రమే ఉంది చంద్రబాబు చెప్పుకుంటున్నట్లుగా రూ. 24 వేల కోట్లలో రూ. 11600 కోట్లు తీసేసి మిగిలిన డబ్బును ఈ బడ్జెట్‌లో కేటాయిస్తారా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడ మాట్లాడిన 80 శాతం ప్రజానికం టీడీపీకి మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారని, బహుశా ముఖ్యమంత్రికి ఎవరైనా తప్పుడు రిపోర్టు ఇచ్చారేమోనని, 80 శాతం వ్యతిరేకత, 20 శాతం సంతృప్తి ఉండొచ్చు ఒకసారి రిపోర్టు మళ్లీ చూసుకోవాలని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో జరుగుతున్న జన్మభూమి కార్యక్రమాలు ఎక్కడ చూసినా రసాభాసగా జరుగుతున్నాయని, ప్రశ్నించే వారిని సభల్లో ఉండనివ్వడం లేదని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. పక్కన పోలీసులను పెట్టుకొని సభలు నిర్వహించే దౌర్భాగ్య పరిస్థితికి ప్రభుత్వం దిగజారిందన్నారు. సొమ్ము ఒకడిది.. సోకు ఒకడిది అన్నట్లుగా ప్రభుత్వ కార్యక్రమాన్ని పార్టీ కార్యక్రమంగా చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలకు స్థానం లేకుండా ప్రజాస్వామ్యంలో చుకలన భావం ఏర్పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత కలెక్టర్‌ల మీటింగ్‌లో మావాళ్లు వస్తుంటారు. వాళ్లకు సహాయం చేయాలని చెప్పినట్లుగా.. జన్మభూమి కమిటీలకు చెప్పివుండకపోతే ఈ అరాచకాలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు. 

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జన్మభూమి కార్యక్రమాలకు వెళ్తున్న ప్రతిపక్షనేతలను హౌస్‌ అరెస్టులు చేయడం, అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని ఉమ్మారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో జన్మభూమి సమావేశానికి వెళ్తున్న వైయస్‌ఆర్‌ సీపీ నేత పార్థసారధిని ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు. ఆయన ఇంటి చుట్టూ 50 మంది పోలీసు బందోబస్తు పెట్టి ఇంట్లో నుంచి కదలనివ్వకుండా చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షనేతలు అధికార పార్టీని ప్రశ్నించకూడదా.. ఇంకా ఎంత కాలం మీ అబద్ధాలు ప్రజలు నమ్మిమోసపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా సత్తెనపల్లిలో ప్రజలకు ఏమేర సంక్షేమ ఫలాలు అందుతున్నాయో నిరూపించేందుకు వెళ్తున్న పార్టీ నేత అంబటి రాంబాబును హౌస్‌ అరెస్ట్‌ చేయడం మంచిపద్దతి కాదన్నారు. వాస్తవాలు నిరూపించేందుకు ప్రజల చెంతకు వెళ్తే అరెస్టు, బెదిరింపులు ఇంకా ఇలా ఎంత కాలం పరిపాలన సాగిస్తారని ప్రశ్నించారు. త్వరలోనే చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 
Back to Top