బీజేపీ- టీడీపీ పొత్తు అనైతికం, అపవిత్రం

హైదరాబాద్, 6 ఏప్రిల్ 2014:

బీజేపీ - టీడీపీల మధ్య పొత్తు అనైతికం అని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. రాష్ట్ర విభజనకు ఈ రెండు పార్టీలూ భాగస్వాములే అన్నారు. బీజేపీతో పొత్తు చారిత్రక తప్పిదం అన్న చంద్రబాబు ఇప్పుడదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం చరిత్రాత్మకమా లేక చరిత్రహీనమో గమనించాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పొత్తుపై ప్రజలకు ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ పార్టీలది అపవిత్ర కలయిక అని విమర్శించారు. ఈ రెండు పార్టీల పొత్తు విభజన కూటమి అని అభివర్ణించారు. బీజేపీఈ పొత్తు టీడీపీ బలహీనతనే ప్రదర్శిస్తున్నదని వ్యాఖ్యానించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమ్మారెడ్డి మాట్లాడారు. ‌జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ కూడా ఈ విభజన పార్టీలకే మద్దతు ప్రకటించడాన్ని ఉమ్మారెడ్డి తప్పుపట్టారు.

శ్రీ వైయస్‌ జగన్‌కు ఎదురు నిలిచి గెలిచే పరిస్థితి టీడీపీకి లేదన్నారు. అందుకే బీజేపీ నాయకుల కాళ్ళా వేళ్ళా పడి చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారని తూర్పారపట్టారు. నరేంద్రమోడి నరహంతకుడని, ఆయనకు సీఎం అయ్యే అర్హత లేదని, మోడి హైదరాబాద్‌ వస్తే అడ్డుకుంటానంటూ గతంలో విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనతో చేతులు కలపడం ఏమిటని, అన్ని విమర్శలు చేసిన చంద్రబాబుతో బీజేపీ వాటిని మరిచిపోయిందా? లేక ఏమి ఆశించి ఈ పొత్తుకు అంగీకరించిందని ఆయన నిలదీశారు. చంద్రబాబు పాలనపై గతంలో నూరు తప్పులతో పుస్తకాన్ని విడుదల చేసిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రాన్ని నిలువునా, అడ్డగోలుగా ముక్కలు చేసిన విభజన వాదుల కూటమి ఇది అని ఉమ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ - టీడీపీ పొత్తు వల్ల దేశానికి గాని, రాష్ట్రానికి గాని ఎలాంటి ప్రయోజనమూ లేదన్నారు.

Back to Top