ఉదయించే సూర్యుణ్ణి ఎవరూ ఆపలేరు

రాజానగరం, 07 జూన్ 2013:

'జగనన్న వస్తాడు.. మీ కష్టాలు తీరుస్తాడం'టూ దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ప్రసంగిస్తుంటే జనం గుండెల్లో జగన్‌పై ఉన్న అభిమానం వెల్లువలా పెల్లుబికింది. జిల్లాలో ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మూడో రోజు గురువారం రాజానగరం నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా రాత్రి 7.15 గంటల రాజానగరం మెయిన్ రోడ్లోని గాంధీబొమ్మ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ‘సింహం బోనులో ఉన్నా సింహమే. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. ఏదో ఒక రోజు ఆ రోజు వస్తుంది. జగనన్న మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్రంలో రాజన్న రాజ్యం స్థాపిస్తాడు. మీరందరూ జగనన్నకు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలు అందించండి’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో ఉత్తేజితులైన జనం ‘జగన్ సీఎం కావాలి’ అంటూ నినాదాలు చేశారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ తెలుగింటి ఆడపడుచు శ్రీమతి షర్మిలకు జనం నీరాజనాలు పలుకుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కుర్చీలాట ఆడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రానికి దివంగత నేత రాజశేఖరరెడ్డి తల్లిలాంటి పాలన అందిస్తే టీడీపీ, కాంగ్రెస్‌లు మాత్రం వ్యాపారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

కోట్ల బాణాలుగా మారాలి..
రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నాయకుడు బొడ్డు అనంత వెంకట రమణ చౌదరి మాట్లాడుతూ ‘జగనన్న వదిలిన బాణం మీ ముందుకు వచ్చింది. మీరందరూ కోట్లాది బాణాలై జగనన్నకు తోడు నిలవాలి’ అని పిలుపునిచ్చారు. సృష్టిలో పంచేంద్రియాలను జయించే శక్తి ప్రేమించే గుణానికి ఉందని, ఆ గుణం కేవలం రాజశేఖరరెడ్డి గారికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. ప్రజలను ప్రేమించారు కాబట్టే వారి కోసం ఇన్ని పథకాలు ప్రవేశ పెట్టగలిగారన్నారు. రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు నాయడు ప్రజలను ‘యూజ్ అండ్ త్రో’ వస్తువులుగా వాడుకుంటున్నారన్నారు.

శ్రీమతి షర్మిల ప్రసంగించేందుకు ప్రచారరథం పైకి చేరుకున్న వెంటనే మహిళలు ఆనందంతో చేతులు ఊపుతూ ప్రసంగం ఆసాంతం శ్రద్ధగా విన్నారు. ‘మా కోసం.. మాకు మద్దతు పలికేందుకు మీ పనులు మానుకుని వచ్చిన వారికి పేరు పేరునా నమస్కరిస్తున్నా’నని శ్రీమతి షర్మిల అభివాదం చేస్తుంటే జనం కూడా ఉద్వేగానికి గురయ్యారు. సభా వేదికపై ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడి, సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ నాయకుడు చలమలశెట్టి సునీల్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ బుచ్చిమేహ శ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తదితరులు ఉన్నారు.

Back to Top