మడకశిర: ఈ నెల 20లోగా తనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శిని అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి కోరారు. ఈ మేరకు ఫ్యాక్స్, ఈ–మెయిల్ చేసినట్లు తెలిపారు. తనను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను కూడా పంపానన్నారు. స్పీకర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నానని, కోర్టు ఉత్తర్వులను గౌరవించి తనతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీలో శుక్రవారం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని తిప్పేస్వామి కలిసి కోర్టులు ఇచ్చిన తీర్పు ప్రతులను కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు. అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఈరన్న అనర్హతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు శనివారం అసెంబ్లీ కార్యదర్శికి అందచేయనున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఈరన్న.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తనపై ఉన్న క్రిమినల్ కేసులతోపాటు కుటుంబసభ్యుల ప్రభుత్వ ఉద్యోగాల గురించి ప్రస్తావించలేదని వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి తిప్పేస్వామి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన హైకోర్టు తిప్పేస్వామి వాదనను సమర్థిస్తూ.. ఈరన్న ఎన్నిక చెల్లదని ఇటీవల తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఈరన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. <br/>ఈరన్న తన ఎన్నికల అఫిడవిట్లో వ్యక్తిగత వివరాలు దాచిపెట్టారని సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ధారించడమేగాక.. ఆయన ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పును సమర్థించింది. ఆ స్థానంలో వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి తిప్పేస్వామి ఎమ్మెల్యేగా కొనసాగుతారని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో శనివారం వెలగపూడి అసెంబ్లీ కార్యాలయంలో కార్యదర్శిని వ్యక్తిగతంగా కూడా కలసి పార్టీ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు తీర్పు కాపీని అందచేయనున్నారు. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఆదిమూలపు సురేష్, కోన రఘుపతి, తిప్పేస్వామిలతోపాటు పలువురు పార్టీ నేతలు అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్నారు.<br/> <br/><br/>