ఆ ఇద్దరూ ఏపీని సర్వనాశనం చేస్తున్నారు

  • బాబు, వెంకయ్యలు అవిభక్త కవలలు
  • హోదా కంటే ప్యాకేజీ మేల‌ని పీఎంతో ప్ర‌క‌టించ‌గ‌ల‌రా?
  • నాడు హోదా కావాల‌న్న వీరు..ఇప్పుడెందుకు వ‌ద్దంటున్నారు
  • కేంద్ర బ‌డ్జెట్లో వేరే రాష్ట్రాల కంటే ఒక్క రూపాయి అద‌నంగా ప్ర‌క‌టించారా?
  • హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం కొన‌సాగుతోంది
  • వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి
హైద‌రాబాద్‌: ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్ర‌త్యేక హోదా అంశాన్ని ఏపీ సీఎం చంద్ర‌బాబు కేంద్రానికి తాక‌ట్టు పెట్టార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి మండిప‌డ్డారు. హోదా కంటే ప్యాకేజీ మేల‌ని చెబుతున్న ఈ ఇద్ద‌రు ఇదే విష‌యాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో చెప్పించ‌గ‌ల‌రా అని నిల‌దీశారు. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో అస్తిపంజ‌రంలా త‌యారైన రాష్ట్రాన్ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సిక్స్‌ప్యాక్‌లా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. తన పోరాటం దేశంతో కాదు.. ఐదు అగ్ర‌దేశాల‌తో అని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల జీవితాల‌తో చెల‌గాట‌మాడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఇప్ప‌టికే ఏపీకి రూ.10.50 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని, ఆ పెట్టుబ‌డులు ప్ర‌జ‌ల‌కే అంకిత‌మ‌ని ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు
వాల‌కం చూస్తుంటే రేపొద్దున చంద్ర‌మండ‌లం, అంగార‌క గ్ర‌హం, సూర్య మండ‌లాల వెలుగంతా మీకే అంకిత‌మ‌ని బాబు ప్ర‌క‌టించినా ఆశ్చర్య‌పోక త‌ప్ప‌ద‌ని ఎద్దేవా చేశారు. 

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో రాజ్య‌స‌భ‌లో వెంక‌య్య నాయుడు ఐదేళ్ల ప్ర‌త్యేక హోదా స‌రిపోదు..ప‌దేళ్లు కావాల‌ని డిమాండ్ చేశార‌ని, ఇప్పుడు హోదాతో ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని మాట మార్చ‌డం ఆయ‌న  దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. చంద్ర‌బాబు తిరుప‌తి వేదిక‌గా ప‌దిహేనేళ్లు ప్ర‌త్యేక హోదా కావాల‌ని ప్ర‌ధానిని కోరార‌ని, ఇప్పుడేమో హోదా వ‌ద్దు..ప్యాకేజీనే ముద్దు అంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఇద్ద‌రు వ్య‌క్తులు అవిభ‌క్త క‌వ‌ల‌ల‌ని, వీరు హోదా ఎందుకు వ‌ద్దంటున్నారో, ప్యాకేజీలో ఇంత‌కంటే అద‌నంగా ఎంత తీసుకొచ్చారో చెప్పాల‌ని నిల‌దీశారు. ఇటీవ‌ల వెంక‌య్య ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో చంద్ర‌బాబును విప‌క్షాలు ఇబ్బంది పెడుతున్నాయ‌ని, తాను లేక‌పోతే ఆయ‌న‌కు క‌ష్ట‌మ‌వుతుంద‌ని వెనుకెసుకొని రావ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. 

చంద్ర‌బాబు ఓటుకు కోట్లు కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్నార‌ని, ఆ కేసు నుంచి త‌ప్పించుకునేందుకు, పోల‌వ‌రం కాంట్రాక్టులు పొంది వాటి ద్వారా క‌మీష‌న్లు కొట్టేయాల‌ని బాబు ప్లాన్ వేశార‌న్నారు. సెప్టెంబ‌ర్ 8, 2016 అర్థ‌రాత్రి అరుణ్‌జైట్లీ ప్ర‌క‌టించే వ‌ర‌కు ప్యాకేజీ ప్ర‌స్తావ‌నే లేద‌ని, ఇందులో ఏమీ లేక పోయినా చంద్ర‌బాబు స్వాగ‌తించ‌డం సిగ్గుచేట‌న్నారు. నాటి నుంచి హోదాపై వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తూ ప్ర‌జ‌ల్లో విష బీజాలు నాటుతున్నార‌ని, హోదాను స‌మాది చేశార‌ని భూమ‌న ఫైర్ అయ్యారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నార‌ని, ఇందులో వెనుక‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.
Back to Top