తెలంగాణ తీర్మానంపై తొలగని ప్రతిష్టంభన

హైదరాబాద్,‌ 18 సెప్టెంబర్ ‌2012: అసెంబ్లీలో తెలంగాణ తీర్మానంపై ప్రతిష్టంభన తొలగలేదు. మంగళవారం ఉదయం అసెంబ్లీ అరగంట సేపు వాయిదా పడిన నేపథ్యంలో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లతో సమావేశమయ్యారు. శాసనసభ సమావేశాలు సజావుగా కొనసాగడానికి అన్ని పార్టీల సభ్యులూ సహకరించేలా చేయాలని స్పీకర్‌ ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లకు సూచించారు. అయితే, తెలంగాణ తీర్మానం విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని టిఆర్‌ఎస్‌ పార్టీ తెగేసి చెప్పింది. విద్యుత్ సమస్యపై చ‌ర్చించేందుకు టీడీపీ, తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని టీఆర్‌ఎస్ పట్టుపడటంతో ఏకాభిప్రాయం కుదరకుండా‌నే భేటీ ముగిసింది.
అసెంబ్లీ అరగంట వాయిదా :
అంతకు ముందు తెలంగాణ నినాదాలతో అసెంబ్లీ మంగళవారం కూడా దద్దరిల్లింది. రెండోరోజు సమావేశాలు ప్రారంభంకాగానే తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలంటూ టీఆర్ఎ‌స్ ‌సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన తెలిపారు. టిఆర్‌ఎస్‌ సభ్యుల అరుపులు, నినాదాలతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది.  దీనితో తెలంగాణపై అన్ని పార్టీల అభిప్రాయాలు వెల్లడించేందుకు స్పీకర్ మనోహర్ అవకాశం ఇచ్చారు. 

టీఆ‌ర్ఎ‌స్ ‌శానససభా పక్ష నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ‌, తెలంగాణకు అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నాయన్నారు. తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని, తెలంగాణ కోసం ఇప్పటికే 950 మంది ఆత్మబలిదానాలు చేశారన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామని చిదంబరం చెప్పారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కాగా, తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని బీజేపీ, సిపిఐ, సిపిఎం పార్టీలు కోరాయి.

ఇదే అంశంపై మాట్లాడుతున్న లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ్‌ను టీఆర్ఎ‌స్ ‌సభ్యుడు హరీష్‌రావు అడ్డుకున్నారు. హైదరాబాద్‌లో బంద్‌ కారణంగా 80 మంది ఐబిఎం ఉద్యోగులు విమానాల్లో వెళ్ళాల్సి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ తాత్సారం వల్లే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల వారు నష్టపోయారని ఆరోపించారు. తెలంగాణ కోసం 950 మంది ఆత్మహత్య చేసుకుంటే సమస్య కాదు కాని, ఐబీఎం ఉద్యోగులు విమానాల్లో వెళ్తే సమస్యా అని జేపీపై హరీష్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. జేపీ మాట్లాడుతున్న సమయంలో హరీష్‌రావు మైక్‌ను విరగగొట్టడటంతో సభలో గందరగోళం నెలకొంది. 

మరోవైపు హరీష్‌రావుకు నాగం జనార్దన్‌రెడ్డి మద్దతు తెలిపారు. దీనితో నాగంతో మంత్రి దానం నాగేందర్ వాగ్వాదానికి దిగారు. నాగంపై సీడీలు విసిరేయడానికి యత్నించారు. నాగం, దానం సవాళ్లు విసురుకున్నారు. సభలో పరిస్థితి అదుపు తప్పడంతో స్పీకర్ నాదెండ్ల మనోహ‌ర్‌ సభను అరగంట పాటు వాయిదా వేశారు.

తాజా వీడియోలు

Back to Top