మ‌త్స్య‌కారులకు చంద్ర‌బాబు తీర‌ని ద్రోహం 

జువ్వ‌ల‌దిన్నె ఫిషింగ్ హార్బ‌ర్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా గ‌ళమెత్తాలి

వైయ‌స్ జ‌గ‌న్ జువ్వ‌ల‌దిన్నె ప‌ర్య‌ట‌న‌కు మ‌ద్ధ‌తు తెలపాలి

పిలుపునిచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ డాక్ట‌ర్స్ వింగ్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు

తాడేప‌ల్లి పార్టీ కేంద్ర‌ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్‌సీపీ డాక్ట‌ర్స్ వింగ్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, 
మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు

చంద్ర‌బాబు జీవితంలో ఒక్క ఫిషింగ్ హార్బ‌ర్  కూడా క‌ట్ట‌లేదు 

పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీ మేర‌కు వైయ‌స్ జ‌గ‌న్ 10 ఫిషింగ్ హార్బ‌ర్ల‌కు శ్రీకారం 

జ‌గ‌న్ క‌ట్టిన జువ్వ‌ల‌దిన్నె హార్బ‌ర్‌ని ప్రైవేటీక‌రించే హ‌క్కు ఆయ‌న‌కు లేదు

మ‌త్స్య‌కారుల బాగోగుల గురించి ఆలోచించే వాడైతే ఇలా చేస్తాడా?  

మ‌త్స్య‌కారులు ఇంకెత‌కాలం ఇత‌ర దేశాల జైళ్ల‌లో మ‌గ్గుతుండాలి?   

చంద్ర‌బాబుని సూటిగా ప్ర‌శ్నించిన మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు  

తాడేప‌ల్లి: జువ్వల‌దిన్నె ఫిషింగ్ హార్బ‌ర్ ప్రైవేటీక‌ర‌ణతో మ‌త్స్య‌కారుల జీవితాల‌తో సీఎం చంద్ర‌బాబు చెల‌గాటం ఆడుతూ తీవని ద్రోహం చేస్తున్నాడ‌ని వైయ‌స్ఆర్‌సీపీ డాక్ట‌ర్స్ వింగ్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు ధ్వ‌జ‌మెత్తారు. తాడేప‌ల్లి పార్టీ కేంద్ర‌ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ హార్బ‌ర్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా నెల్లూరు జిల్లా జువ్వ‌ల‌దిన్నెకి వ‌స్తున్న మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు భారీగా త‌ర‌లివ‌చ్చి మ‌త్స్య‌కారులు మ‌ద్ధ‌తు తెలపాల‌ని పిలుపునిచ్చారు. మ‌త్స్య‌కారులు ప‌ట్టించుకోక‌పోతే ప్రైవేటీక‌ర‌ణ‌కు మ‌నం వ్య‌తిరేక‌మ‌నే సందేశాన్ని చంద్ర‌బాబు అండ్ కో ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తార‌ని వివ‌రించారు. నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేస్తున్న చంద్ర‌బాబు, త‌న పాల‌న‌లో ఇంత‌వ‌ర‌కు ఒక్క పోర్టు, ఫిషింగ్ హార్బ‌ర్ నిర్మించ‌క‌పోగా వైయ‌స్ జ‌గ‌న్ గారు పూర్తి చేసిన హార్బ‌ర్‌ను ప్రైవేటీక‌రించే హ‌క్కు ఎవ‌రిచ్చార‌ని నిల‌దీశారు. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్లుగా మ‌చిలీప‌ట్నం, నిజాంప‌ట్నం, ఉప్పాడ‌.. మూడు ఫిషింగ్ హార్బ‌ర్ పెండింగ్ ప‌నులు పూర్తి చేయ‌క‌పోగా వాటిలోకి మ‌త్స్య‌కారుల‌ను కూడా అనుమ‌తించ‌క‌పోవ‌డంపై సీదిరి అప్ప‌ల‌రాజు మండిప‌డ్డారు. మ‌త్స్య‌కారుల జీవితాల‌ను ప్రైవేటు వ్య‌క్తుల కాళ్ల ద‌గ్గ‌ర ప‌ణంగా పెడుతున్న చంద్రబాబుకి బుద్ధి చెప్పాల‌ని పిలుపునిచ్చారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే...

మ‌త్స్య‌కారుల బాగోగులు చంద్ర‌బాబుకి ప‌ట్ట‌డం లేదు
దేశంలో గుజరాత్‌ తర్వాత అత్యధిక సముద్ర తీరం 974 కి.మీ ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్‌. ల‌క్ష‌లాది మంది మ‌త్స్య‌కారులు సముద్రంపై ఆధార‌ప‌డి జీవిస్తున్నారు. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరిచి, వలసలను అరికట్టే లక్ష్యంతో వైయ‌స్ జ‌గ‌న్ గారు ఐదేళ్ల‌లోనే రూ. 3,793 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ లాండింగ్‌ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్య‌మంత్రిగా ప‌నిచేస్తున్న చంద్ర‌బాబు, త‌న హాయాంలో ఇప్పటివ‌ర‌కు ఒక్కటంటే ఒక్క హార్బ‌ర్ నిర్మాణం చేయ‌లేదు. క‌నీసం వైయ‌స్ జ‌గ‌న్ గారు ప్రారంభించి పోర్టులు, హార్బ‌ర్‌ల‌ను రెండేళ్లుగా పూర్తి చేయ‌కుండా ప‌క్క‌న‌పెట్టేశాడు. మ‌న‌కంటే వెనుక ప‌నులు మొద‌లుపెట్టిన క‌ర్నాట‌క‌, ఒడిశా, గుజ‌రాత్ రాష్ట్రాలు శ‌ర‌వేగంగా తీర‌ప్రాంత అభివృద్దిపై దృష్టిపెట్టాయి. కానీ విజ‌న‌రీన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు మాత్రం మ‌త్స్య‌కారుల బాగోగులు ప‌ట్టించుకున్న పాపాన పోవ‌డం లేదు. ముంబై, గుజ‌రాత్‌, గోవా, మంగ‌ళూరు, కొచ్చిన్‌, చెన్నైలో చూస్తే మ‌న మ‌త్స్య‌కారులు ప‌నిచేస్తున్నారు. చేప‌లు ప‌ట్టే క్ర‌మంలో పొర‌పాటున బంగ్లాదేశ్‌, శ్రీలంక, పాకిస్థాన్ జ‌లాల్లోకి ప్ర‌వేశించి జైలుపాల‌వుతున్న సంద‌ర్భాలు నిత్యం జ‌రుగుతున్నాయి. ఇంత అన్యాయం జ‌రుగుతున్నా ఒక్క హార్బ‌ర్ క‌ట్టే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు చేయ‌లేదు. 

- మొద‌టి ద‌శ‌లో నాలుగు హార్బ‌ర్ల నిర్మాణం

మ‌త్స్య‌కారుల స‌మ‌స్య‌ల‌ను త‌న పాద‌యాత్ర‌లో చూసిన వైయ‌స్ జ‌గ‌న్ గారు ప్ర‌తి జిల్లాలో కూడా ఫిషింగ్ హార్బ‌ర్‌లు క‌డ‌తామ‌ని హామీ ఇచ్చి అమ‌లు చేశారు. అందులో భాగంగానే మొద‌టి ద‌శ‌లో నాలుగు హార్బ‌ర్లు నెల్లూరు జిల్లాలో జువ్వ‌ల‌దిన్నె, బాప‌ట్ల జిల్లాలో నిజాంప‌ట్నం, కృష్ణా జిల్లాలో మ‌చిలీప‌ట్నం, కాకినాడ జిల్లా ఉప్పాడ‌లో ఫిషింగ్ హార్బ‌ర్‌లు మంజూరు చేయ‌డం జ‌రిగింది. ఇవ‌న్నీ వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంద దిగిపోయే నాటికి పూర్త‌య్యే ద‌శ‌కు చేరుకున్నాయి. రెండో ద‌శ‌లో శ్రీకాకుళం జిల్లా బుడ‌గ‌ట్ల‌పాలెం వ‌ద్ద‌, అన‌కాపల్లి జిల్లాలో పూడిమ‌డ‌క వ‌ద్ద‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో బియ్య‌పు తిప్ప‌, ప్ర‌కాశం జిల్లాలో ఓడ‌రేపు, కొత్త‌ప‌ట్నం ప‌నులు ప్రారంభించ‌డం జ‌రిగింది. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో రూ.288.8 కోట్ల వ్యయంతో హార్బర్‌ నిర్మాణ పనులను 2021, మార్చి 19న ప్రారంభించడం జరిగింది. 76.89 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ హార్బర్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర పాలఘర్‌ నుంచి 2024, మార్చి 12న వర్చువల్‌గా ప్రారంభించారు. అప్పటివరకూ పొట్టకూటి కోసం కూలీలుగా పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు ఇప్పుడు ఇక్కడే అధునాతన మెకనైజ్డ్‌ బోట్లతో చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. కానీ హార్బ‌ర్‌ను ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లో పెట్ట‌డం కోసం రెండేళ్లుగా ఈ ప్రారంభించిన హార్బ‌ర్‌లోకి మ‌త్స్య‌కారుల‌ను వెళ్ల‌నీయ‌డం లేదు. తొలిద‌శ‌లో పూర్త‌యిన హార్బ‌ర్ల‌ను కూడా రెండేళ్లుగా పూర్తిగా ప‌క్క‌న‌పెట్టేశాడు.  

- మ‌త్స్య‌కారులు చంద్ర‌బాబుని అసహ్యించుకుంటున్నారు

మ‌త్స్య‌కారుల జీవితాల‌ను చంద్ర‌బాబు ప్రైవేట్ వ్య‌క్తుల కాళ్ల ద‌గ్గ‌ర పెడుతున్నాడు. మ‌త్స్య‌కారుల జీవ‌న ప్ర‌మాణాలు పెర‌గాల‌ని, వల‌స‌లు ఆగాల‌ని, జీవితాల్లో వెలుగులు నిండాల‌ని, మ‌న రాష్ట్ర మ‌త్స్య‌కారులు మ‌న రాష్ట్రంలోనే ఫిషింగ్ చేసుకునేలా వైయ‌స్ జ‌గ‌న్ గారు ఆలోచించి హార్బ‌ర్‌ల నిర్మాణం చేశారు. అంత గొప్ప‌గా మ‌త్స్య‌కారుల గురించి ఆలోచన చేసిన వైయ‌స్ జ‌గ‌న్ గారి ప‌క్షాన ఉండాలా?  హార్బ‌ర్‌ల‌ను ప్రైవేటుప‌రం చేస్తున్న చంద్ర‌బాబు ప‌క్షాన ఉండాలో మ‌త్స్య‌కారులు నిర్ణ‌యించుకోవాలి. ఇప్ప‌టికే మ‌త్స్య‌కారుల ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చింది. చంద్ర‌బాబుని తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు. మ‌త్స్య‌కారుల జీవితాల‌ను చంద్ర‌బాబు ప్రైవేటు వ్య‌క్తుల కాళ్ల‌ద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టేశాడు. మ‌త్స్య‌కారులు ఉద్య‌మించక‌పోతే ఈ ప్రైవేటీక‌ర‌ణ‌కు మ‌న ఆమోదం ఉంద‌ని ప్ర‌చారం చేస్తారు. కాబ‌ట్టి మ‌త్స్య‌కారులంతా ప్ర‌భుత్వ విధానంపై గ‌ళ‌మెత్తాలి. జువ్వ‌ల‌దిన్నె ఫిషింగ్ హార్బ‌ర్‌లో కొంత భాగాన్ని సాగ‌ర్ డిఫెన్స్ సిస్టంకి ప్ర‌భుత్వం కేటాయిస్తుంది. రాబోయే రోజుల్లో మొత్తం ఆక్ర‌మించేస్తారు.  ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా జువ్వ‌ల‌దిన్నె సంద‌ర్శ‌న‌కు వ‌స్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌కి రాష్ట్ర వ్యాప్తంగా మత్స్య‌కార సోద‌రులు పాల్గొని మ‌ద్ద‌తు తెల‌పాలి. ప్రైవేటీక‌ర‌ణ వ‌ద్ద‌ని నిన‌దించాలి. ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా మ‌త్స్య‌కారులు ఉద్య‌మించ‌క‌పోతే రాష్ట్రంలో చంద్ర‌బాబు మ‌న‌కి ఏమీ మిగ‌ల్చ‌డు.

Back to Top