కర్నూలు: "రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఒక భారీ ఆర్థిక విధ్వంసానికి తెరలేపారని, ఇది కేవలం కొందరు కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే తప్ప సామాన్య ప్రజల ప్రయోజనం కోసం కాదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. మంగళవారం కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైయస్.జగన్ సూచించిన ఆచరణాత్మక 'మావిగన్' (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) ప్రతిపాదనపై ప్రభుత్వం నిర్మాణాత్మక చర్చ చేయాల్సింది పోయి, దిగజారుడు భాషలో వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో చదరపు అడుగుకు రూ. 5 వేలకే అద్భుతమైన భవనాలు నిర్మిస్తుంటే, అమరావతిలో రూ.14,800 నిర్మాణ వ్యయం చూపడం అంతులేని అవినీతికి నిదర్శనమని బుగ్గన రాజేంధ్రనాధ్ ఆరోపించారు. కిలోమీటరుకు రూ. 53 కోట్ల చొప్పున రోడ్లు వేస్తూ, పనులు మొదలవ్వకముందే రూ.5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పేరుతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని విమర్శించారు. శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరికలను తుంగలో తొక్కి, రాయలసీమ, ఉత్తరాంధ్రా అభివృద్ధిని విస్మరించి కేవలం ఒకే చోట సంపదను కేంద్రీకరించడం రాజ్యాంగ విరుద్ధమని.. భ్రమల కోసం లక్షల కోట్ల అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేసే ప్రమాదంలోకి చంద్రబాబు నెడుతున్నారని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... - అమరావతిలో అంతులేని అవినీతి – అంకెల గారడీ గడిచిన కొద్ది రోజులగా రాష్ట్రంతో పాటు అంతర్జాతీయంగా తెలుగు ప్రజలు మావిగన్ పై విస్తృతంగా చర్చిస్తున్నారు. దీనిపై కొంతమంది బాగుందని మాట్లాడుతుంటే.. మరికొంతమంది ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. చాలా తక్కువ శాతం మంది మాత్రం మావిగన్ పై చాలా ఎక్కువగా ఆందోళన, ఆక్రోశం, కోపంతో రగిలిపోతున్నారు. మావిగన్ పై ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో వారి ముందు కొన్ని వాస్తవాలను ఉంచాలనుకుంటున్నాం. మేం చెప్పే ప్రతి డాక్యుమెంటు అక్షరసత్యం. వాస్తవానికి సీఆర్డీయే పై అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ... దానిపై మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్ తాను గమనించిన విషయాలను, తన అభిప్రాయాలను చెబుతూ కొన్ని సలహాలు, సూచనలు చేశారు. మాజీ సీఎంగా దేశంలోనే బలమైన నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా తన సలహాలు, సూచనలు చేశారు. - రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసే ప్రమాదం... ఈ నేపధ్యంలో అధికార పార్టీ నేతలు ప్రవర్తిస్తున్న తీరును ప్రజలందరూ గమనించాలి. వాస్తవానికి వైయస్.జగన్ మాట్లాడుతూ... ప్రభుత్వం అమరావితిలో అమాయక రైతుల నుంచి 50 వేల ఎకరాలు సేకరించారు. మరో 50 వేల ఎకరాల భూమి సేకరించడానికి సిద్ధంగా ఉంది. రైతులకు ఇప్పటికీ పెద్ద మేలు జరగలేదు. అమరావతి పనుల్ల అంతులేని అవినీతి జరుగుతోంది. దీంతోఅక్కడి రైతుల్లో తీవ్ర అసంతృప్తి మొదలైంది. దాన్నుంచి రైతులను డైవర్షన్ చేయడానికే ఈ అసెంబ్లీ సెషన్ ను ఏర్పాటు చేశారని వైయస్.జగన్ ఆరోపించారు. అమరావతి నిర్మాణంలో అంతులేని అవినీతి. 2018 నాటికే దాదాపు 5 శాతం ఎస్టిమేట్ రేట్ల కంటే అధిక రేట్లతో టెండర్లు వేశారు. ఇవాళ లెక్కిస్తే రూ.11 నుంచి రూ.14 వేల వరకు చదరపు అడుగు నిర్మాణ వ్యయంతో కడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం? కేవలం ప్లాన్ కోసమే రూ.400 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎంత వరకు భావ్యం? సెల్ఫ్ ఫైనాన్స్ అని రూ.47 వేల కోట్లు అప్పు చేశారు. చూస్తే ప్రజలకు మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నారు. అలాంటప్పుడు ఎక్కడైనా అప్పు చేయకుండా నిర్మిస్తున్నారా? గ్యారంటీ లేకుండా అప్పు తెచ్చారా? ఇవన్నీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు. మరోవైపు రూ.13 వేల కోట్లు పనులు చేయగా.. అందులో రూ.5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టకుండానే తీసుకున్నారు. ఈ సొమ్మంతా ఎక్కడికి పోయిందన్నది ప్రభుత్వ పెద్దలకు, కాంట్రాక్టర్లకు కూడా తెలుసు. మా హయాంలో ఎప్పుడూ మొబిలైజేషన్ అడ్వాన్స్ అనే సంస్కృతి లేదు. పని చేసిన తర్వాతే బిల్లులు చెల్లించేవారం. మరోవైపు 2018లో మీరు చెప్పిన అంచనాల ప్రకారమే రాజధానిలో మౌలిక వసతుల కల్పనకే ఎకరాకు రూ.2 కోట్లు ఖర్చు చొప్పున లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారు? ఈ లెక్కన రాజధాని కట్టాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుంది? మీరు చేసిన ఈ ఆలోచన వల్ల చివరికి అసలు రాష్ట్రానికి రాజధానే లేకుండా పోయే ప్రమాదం ఉంది. - ప్లాన్ బీ మావిగన్ పై మేధావులు సైతం హర్షం... ఇన్ని అసాధారణమైన పరిస్థితుల నేపధ్యంలో.. మా ప్రభుత్వ హయాంలో వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో అడ్మినిస్ట్రేటివే క్యాపిటల్, గుంటూరు ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్ (హైకోర్టు) అని చెప్పాం. మీరు దాన్ని ఆ రోజు అంగీకరించకుండా రద్దు చేశారు. లక్ష ఎకరాలు, రూ.2లక్షల కోట్లు, అమరావతి రైతులు, కాంట్రాక్టర్లు కమిషన్లు గోలను పక్కనపెట్టి ప్లాన్ బి లో భాగంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలు పక్కపక్కనే ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే దాదాపు 40 లక్షల జనాభా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో పోర్టు, ఎయిర్ పోర్టు, జాతీయ రహదారి ఉంది. ఇక్కడ రాజధాని కట్టాలని చెబితే అందులో ఏమైనా పొరపాటు ఉందా? తటస్థులు, మేధావులు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. - వైఫల్యాలు ప్రశ్నిస్తే- వ్యక్తిత్వ హననమా? కానీ కూటమి పార్టీల నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఎక్కడికెక్కడికో పోతున్నారు. తల్లి, చెల్లి పెళ్లి అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్ల సంస్కృతి ఏమిటో అర్ధం కావడం లేదు. వాళ్లు చెప్పిన లెక్క ప్రకారం ఎకరాకు రూ.2 కోట్లు చొప్పున లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు అవసరం అవుతుంది. అయితే ఏడేళ్ల అధికారంలో ఉన్నచంద్రబాబు 2014-19 వరకు కేవలం రూ.5335 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఆ రోజు మీరు చెప్పిన లెక్క అంచనా ప్రకారం రూ.1లక్ష కోట్లు కావాలి. మరలా 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటివరకూ రూ.47 వేల కోట్లు అప్పులకు సిద్ధం అయ్యారు. రూ.13 వేల కోట్లు అప్పు చేశారు. రూ.5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకున్నారు. ఇంతవరకు ఈ రెండేళ్లలో రూ.2500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అందులో కూడా రూ.965 కోట్లు వేరే పనులకు వాడుకున్నారు. మీరు ఏం చేస్తున్నట్టు? - పూర్తిగా అటకెక్కిన సంక్షేమం, అభివృద్ధి.. ఈ రకమైన పాలసీ, పరిపాలన వల్ల సామాన్య మానవుని జీవితం ఎటు పోతుంది? సంక్షేమం ఎక్కడుంది? పరిపాలన ఎక్కడుంది? నాడు నేడు పనులు నిల్చిపోయాయి. స్కూల్లు, ఆసుపత్రులను నిల్చిపోయాయి. పట్టించుకునే నాధుడే లేదు. వసతి, దీవెన, విద్యాదీవెన లేదు. పిల్లల స్కాలర్ షిప్పులు మాత్రమే రూ.10వేల కోట్లు బకాయిలున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలే రూ.2,600 కోట్లు ఉన్నాయి. ఈ లెక్కలన్నీ వాస్తవం కాదా? ఏంది ఈ పరిపాలన? దానికి సమాధానం చెప్పకుండా, తల్లి, చెల్లి అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది. ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. ఆర్బీకేలు ఆగిపోయాయి. ఉచిత పంటల బీమా తీసివేశారు. ఇ-క్రాప్ బుకింగ్ జరగడం లేదు. వ్యవసాయం, రైతుల పరిస్థితి పూర్తిగా అధోగతి పాలైంది. ఇక మెడికల్ కాలేజీలకు సంబంధించి మొత్తం 17 కాలేజీలు పూర్తి చేయాలంటే కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే కావాలి. వైయస్సార్సీపీ హాయంలో పూర్తైన 7 మెడికల్ కాలేజీలు కాకుంటే నిర్మాణంలో వివిధ ధశల్లో ఉన్న మిగిలిన కాలేజీలు పూర్తి చేస్తే సరిపోతుంది. అది కూడా లేదు. రూ.1000 కోట్లు ఏడాదికి పెట్టినా సరిపోతుంది. మంజూరైన మెడికల్ సీట్లను కూడా వద్దని చెప్పారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు అన్నీ పూర్తిగా అటెకెక్కించారు. ఉద్యోగులు చంద్రబాబుని నమ్మి మోసపోవడం ఇది నాలుగోసారి. మూడుసార్లు మోసపోయారు కదా మరలా ఎలా చంద్రబాబును నమ్మారని ఉద్యోగులుని అడిగితే.. మధ్యలో మోసపోవడానికి మరలా గ్యాప్ వచ్చింది కదా అందుకే నమ్మాం అని చెబుతున్నారు. ఇదీ ఉద్యోగుల పరిస్థితి. - అమరావతిలో అడుగడుగునా అవినీతి.. అమరావతిలో వివిధ టవర్లు దాదాపు 52 లక్షల చదరపు అడుగుల్లో కడుతున్నారు. దానికి ఏకంగా చదరపు అడుగుకి రూ.14,800 నిర్మాణ ఖర్చు అని చెబుతున్నారు. హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో చదరపు అడుగు రూ.4 నుంచి రూ.5 వేలకు అద్బుతమైన అపార్టమెంట్లు నిర్మాణం చేస్తున్నారు. ఇసుక, కరెంటుతో పాటు అన్ని రకాల రాయితీలు ఇస్తున్నా ఎందుకు ఇంత ఖర్చవుతుంది. ఒకవైపు దేవతల రాజధాని అని చెబుతూ మీరు పెడుతున్న ఖర్చు చూస్తే దేవుళ్లు కూడా భయపడతారు.ఇదే అంశాన్ని వైయస్.జగన్ ప్రశ్నిస్తే... కోపం, ఆక్రోషంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అదీ కూడా హైదరాబాద్ నుంచి కొట్లాడుతున్నారు. తెలంగాణాలో టీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో 10 లక్షల చదరపు అడుగుల్లో రూ.615 కోట్లతో సచివాలయ నిర్మాణం చేపట్టారు. ఢిల్లీలో పార్లమెంటు భవనం కూడా నిర్మాణ వ్యయం ఎక్కువుగా ఉన్నచోట రూ.970 కోట్లతో నిర్మిస్తే... ఇక్కడ అమరావతిలో మాత్రం సచివాలయం రూ.1450 కోట్లతో కడతారు. కేవలం డిజైన్లకే రూ400 కోట్లు. రోడ్లు, ఫ్లై ఓవర్లు చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి. రోడ్లు మరీ దారుణం. 6 లైన్ల జాతీయ రహదారులనే కిలోమీటరుకు రూ.20 కోట్ల చొప్పున నిర్మిస్తుంటే... మీరు అవే 6 లైన్ల రహదారుల పేరుతో కిలోమీటరకు రూ.53 కోట్లు తో నిర్మిస్తున్నారు. ఇవే అంశాలను అడిగితే మీకు కోపం వస్తుంది. - మావిగన్ తక్కువ ఖర్చుతో రాజధాని... ప్రతిపాదిత మావిగన్ లో మచిలీపట్నంలో పోర్టు ఉంది. జాతీయ రహదారులు ఉన్నాయి. రైల్వే కనెక్టివిటీ ఉంది. విజయవాడలో దాదాపు 20 లక్షల మంది, గుంటూరులో 10 లక్షల మంది, మచిలీపట్నంలో 3-4 లక్షల మంది జనాభా కలుపుకుంటే మొత్తం 35-40 లక్షల మంద జనాభా ఉన్నారు. ఇక్కడ రాజధాని కడితే రూ.10-20 కోట్ల మధ్య రాజధాని నిర్మాణం పెద్ద భారం లేకుండా పూర్తవుతుంది చెబితే మీకు ఎందుకు కోపం వస్తుందో ఎవరికీ అర్ధం కావడం లేదు? ప్రతిపక్ష నేత, మాజీ సీఎం సలహా ఇస్తే దాన్ని పరిశీలించకుండా దిగజారుడు భాష మాట్లాడుతున్నారు. - ప్రతిసారీ మరింత దిగజారుడు రాతలు... ఇంతకంటే నువ్వు దిగజారవు అని నేను అనుకున్న ప్రతిసారీ నేను రాంగ్ ప్రూవ్ చేస్తూ ఉంటావు. ప్రతివారం ఒక దిగజారుడు మాట..ఇంత కంటే దిగజారవు అనుకునే లోపే.. మరో వారం మరో దిగజారుడు మాట. మీరు ఒక అద్భుతమైన ఫాంటసీ పెట్టుకుని దాన్ని నిజం చేసుకునే క్రమంలో రాష్ట్రం ఆర్ధిక ప్రగతి, పేదవాడి పరిస్థితిని కనీసం ఆలోచన చేయడం లేదు. ఒకవైపు ఎవరూ అప్పు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. మరోవైపు లక్షలాది కోట్లు అప్పులు చేస్తున్నారు. ఇన్ని అప్పులు చేసిన తర్వాత దానికి అంతం లేదు. రూ.20 లక్షలు ఖరీదు చేసే ఇంటిని కొనాలంటే మనం ముందుగా మన చేతిలో రూ.5-10 లక్షలు పెట్టుకుంటాం. మిగిలిన డబ్బులు అప్పు చేస్తాం. కానీ మొత్తం అప్పుచేసి కడతామా? ఇళ్లే కట్టడానికి సాహసించనప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్టు భారీ అప్పు చేస్తారా? ఉత్తరాంధ్రా, రాయలసీమ ప్రాంత పరిస్థితి ఏంటో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఉత్తరాంధ్రా వివిధ కారణాల వల్ల వెనుకబడితే, ప్రకృతి వల్ల రాయలసీమ వెనుకబడింది. మన ఇంట్లో కూడా విధివశాత్తూ వైకల్యంతో ఒక పిల్లవాడు ఉంటే వారిని ప్రత్యేకంగా చూస్తామా లేదా? అలా చూడాల్సిన బాధ్యత మన మీద లేదా? అదే నేపధ్యంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం వికేంద్రీకరణ అంటే మీకు ఎక్కడలేని కోపం వస్తుంది. అదే విధంగా వైయస్.జగన్ మావిగన్ పై ప్రతిపాదన చేశారు. మీకు నచ్చితే తీసుకొండి. లేకపోతే లేదు. అంతే తప్ప దానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం సరికాదు. 2019లో వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వికేంద్రీకరణ నిర్ణయం తీసుకుంటే.. అప్పుడు ఉమ్మడి 13 జిల్లాల్లో అన్నింటి కంటే తలసరి ఆదాయంలో ఆఖరి స్ధానంలో శ్రీకాకుళం ఉంటే.. కర్నూలు 12వ స్ధానంలో, 11 వస్ధానంలో విజయనగరం, 10వ స్ధానం అనంతపురం, 9 ప్రకాశం, 8వ స్ధానంలో కడప జిల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు వెనుకబడ్డాయి.. ఈ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి ఫలాలు అందాలంటే వికేంద్రీకరణ చేయాలని అంటే... దానికి అడ్డుపడ్డారు. మీకు వైజాగ్ , వికేంద్రీకరణ నచ్చలేదు అని విడిచిపెట్టాం. అన్నీ ఒకేచోట పెట్టుకుంటామని చెప్పారు. ఇవాళ వైస్.జగన్ ప్లాన్ బి ప్రకారం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిస్తే పెద్ద నగరం అవుతుంది. తగిన జనాభా ఉంటుంది. తక్కువ ఖర్చుతో మంచి రాజధాని వస్తుందని చెబితే.. ఇది పూర్తిగా తప్పన్నట్టు ఎదురు దాడి చేస్తున్నారు. మరి అది తప్పైనప్పుడు టీడీపీ కార్యాలయం, జనసేన కార్యాలయం విజయవాడ, గుంటూరు జాతీయ రహదారిపైనే కట్టారు. అది కూడా 2014లో అమరావతిని ప్రకటిస్తే.. మీరు ఇటీవల రెండు, మూడేళ్ల కాలంలో మీ పార్టీ కేంద్ర కార్యాలయాలు నిర్మించారు. మరి అమరావతిలో ఎందుకు మీ పార్టీ కార్యాలయాలు నిర్మించలేదు? ప్రజలకు అనుకూలంగా ఉంటుంది, విజయవాడ, గుంటూరు మధ్యలో జాతీయ రహదారి, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టు అనుకూలంగా ఉంటాదని కట్టుకున్నారు. మరి ప్రజలకు అదే సౌలభ్యం అక్కరలేదా? మీరు ప్రజలుండే చోట రాజధాని కడతారా? లేదా పచ్చటి పొలాల్లో కడతారా? గ్రామాల్లో పంచాయతీ కార్యాలయం ఊరు మధ్యలో కడతామా? ఊరు బయట కడతామా? - అసలు చరిత్ర తెలుసా? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ పుట్టింది? శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన విషయం గుర్తుందా? 1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఅవతరణ గుర్తుందా? 1956లో విశాలాంధ్రా, తెలంగాణా కలయిక గుర్తు ఉందా? పెద్ద మనుషుల ఒప్పందం, తెలంగాణా పోరాటం, 8 పాయింట్ ఫార్ములా, జై ఆంధ్రా ఉద్యమం, 6 పాయింట్ ఫార్ములా, శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణ కమిటీ రిపోర్టు గుర్తు ఉన్నాయా? ఉంటే ఏం నేర్చుకున్నారు? వాళ్లు చెప్పిన దాని ప్రకారం ఒక్కటైనా ఇక్కడి ఉందా? రాజ్యాంగం ప్రకారం వుయ్ ది పీపుల్ ఆఫ్ ఇండియా అని చెబుతూ.. ఆర్దిక, సామాజిక, రాజకీయ పరమైన న్యాయం చేకూర్చాలని చెబుతుంది. ఇది మీకు గుర్తుందా? ఆదేశిక సూత్రాల గురించి స్టడీ చేస్తే.. మీరు కేంద్రీకరణ అభివృద్ధి ఎలా చేస్తారు? ప్రభుత్వాలు ఆర్దిక, సామాజిక, రాజకీయ, సాంఘిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి. ఆర్టికల్ 38- 1 ప్రకారం సమూహాలలో ఆదా, సౌకర్యాలు, హోదాల్లో అసమానతలను తగ్గించడానికి కృషి చేయాలి. 38-2 ప్రకారం ప్రజలందరూ సమిష్ట మేలు అత్యుత్తమంగా పొందడానికి సమాజంలో భౌతిక వనరులపై యాజమాన్య నియంత్రణను విభజించడం, ఉత్పత్తి పరికరాలు, సంపద కేంద్రీకృతం కాకుండా చూడడం ఇవన్నీ మీకు గుర్తున్నాయా? మీ కంటే ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులే బాగా స్టడీ చేశారు. - రాజ్యాంగ స్ఫూర్తి సైతం దెబ్బతీస్తున్న కూటమి ప్రభుత్వం... భారత రాజ్యాంగం మీద స్టడీ చేసిన విదేశీయుడు గ్రాండ్ విల్ ఆస్టిన్ అనే వ్యక్తి.. రాజ్యాంగం మీద రెండు పుస్తకాలు రాశాడు. రాజ్యాంగం అనేది కేవలం పొలిటికల్ స్టేట్ మెంట్ కాదు అది ఒక సామాజిక స్టేట్ మెంట్ అని చెప్పాడు. శ్రీశ్రీ మహాప్రస్థానంలో జగన్నాధ రధ చక్రాలు అన్న దాని అర్దం ప్రాధమిక హక్కులు ఒక చక్రం అయితే.. ఆదేశిక సూత్రాలు మరో చక్రం. ఒక వైపు ప్రాధమిక హక్కులైతే మరోవైపు సూచనలు. ఈ రెండూ కలిస్తేనే ప్రజలకు సామాజికంగా, ఆర్ధికంగా న్యాయం చేయడం సాధ్యం అవుతుంది. వీటన్నింటి నేపధ్యంలోనే వైయస్.జగన్ ప్లాన్ ఏ లో భాగంగా పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పారు. దాన్ని మూడు ముక్కలాట అని రకరకాలుగా మాట్లాడారు. - శివరామకృష్ణన్ కమిటీ - వాస్తవాలు... ఈ నేపధ్యంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కేంద్రం పునర్ వ్యవస్ధీకరణ చట్టంలో భాగంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాన్ని 2014 ఏప్రిల్ 25 అంటే అప్పటి కొత్త ప్రభుత్వ ఏర్పాటు కంటే ముందే ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ద్వారా రాజధాని కట్టేదానికి ఏపీలో మంచి ప్రాంతాన్ని ఎంపిక చేయాలని నిర్ణయించి.. సీనియర్ ఐఏఎస్ అధికారి కే సీ శివరామకృష్ణన్ ని ఎంపిక చేశారు. పట్టణాభివృద్ధిలో ఈయన నిపుణుడు. మరో వ్యక్తి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ, ఢిల్లీలో లో డైరెక్టర్ డాక్టర్ నితిన్ రాయ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్, బెంగుళూరు, డైరెక్టర్ అరోమా రవి, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్భన్ ఎఫైర్స్ న్యూడిల్లీలో డైరెక్టర్ ప్రొఫెసర్ జగన్ షా, ఫార్మర్ డీన్ ప్రొఫెసర్ కే టీ రవీంద్రన్ లను నియమించి ఏ ప్రాంతం రాజధానికి అనుకూలమో స్టడీ చేయమని ఇచ్చారు. ఎలా చేయాలన్నదానిపై మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. ప్రొఫెసర్ శివరామకృష్ణన్ తన రిపోర్టు సమర్పించిన తర్వాత 2015 మే నెలలో చనిపోయారు. ఈ కమిటీలో ఉన్న వాళ్లంతా వివిధ రంగాలలో కీలకమైన వ్యక్తులు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కీలకమైన ప్రాజెక్టులలో పనిచేశారు. కేంద్రం ఇలాంటి సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి .. అందరికీ అనుకూలమైన ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే ప్రాంతాన్ని రాజధాని ఏర్పాటుకు సూచించమని చెప్పింది. అందుకు కొన్ని నియమనిబంధనలను కూడా ఫ్రేమ్ చేసింది. అందులో కీలకమైనది వ్యవసాయాన్ని దాదాపు కదలించకుండా చూడాలని ఉంది. ఈ నేపధ్యంలో శివరామకృష్ణన్ గారు 400 పేజీలకు పైగా రిపోర్టు రూపొందించారు. అందులో ఆయన ఏపీలో రీజనల్ అండ్ సబ్ రీజనల్ యాస్పిరేషన్స్... ఉన్నాయని చెప్పారు. ఒకే ఊరిలో కొత్త రాజధాని కట్టొద్దని చెప్పారు. వివిధ ప్రాంతాలలో 8 పేర్లు ఇచ్చారు. అప్పట్లో ఏపీ గవర్నమెంటు ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల పేర్లు కూడా రాజధాని కోసం కమిటీకి ఇవ్వలేదు. కృష్ణా నది ఒడ్డున మంచి భూములు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్టడీ చేశారు. నది కింద మరలా నదీ ప్రవాహం ఉంది. భవిష్యత్తులో భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతంలో రాజధాని వద్దు అని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లాన్ వాళ్లను అడిగితే వాళ్లు 8 ప్రాంతాలు చెప్పారు. ముసునూరు, పులిచింతల, అమరావతి, మాచర్ల, మార్టూరు, వినుకొండ, బోల్లపల్లి, దొనకొండ పేర్లు చెప్పి అన్నీ చూడమంటారా అంటే అవసరం లేదని చెప్పారు. రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలను పరిశీలించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది. - అమరావతి సాయిల్ బేరింగ్ కెపాసిటీ 9 టన్నులు డిపార్టుమెంట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వారిని అడిగితే 8 ప్రాంతాలు చెప్పారు. అన్నీ చూడమంటారా అని అడిగితే వద్దని చెప్పినట్టు రిపోర్టులో రాశారు. రాయలసీమ, ఉత్తర కోస్తాలో ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా సూచించలేదని చెప్పారు. అమరావతి ప్రాంతం రాజధానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా పేజీ నెంబర్ 14లో చెప్పింది. రాయలసీమ ప్రాంతాన్ని మద్రాస్ నుంచి తీసుకొచ్చి ఆంధ్రాలో కలపడానికి ఎన్నో వాగ్ధానాలు చేయాల్సి వచ్చిందని పుస్తకంలో చెప్పారు. అందుకే రాష్ట్రంలోని ప్రాంతీయ వాదం, ఉప ప్రాంతీయ వాదం అంశాన్ని సీరియస్‌గా తీసుకుని అన్ని ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించాలని శివరామకృష్ణన్ గారు స్పష్టంగా పేర్కొన్నారు. ఏపీని సింగపూర్, కొరియాలతో పోల్చుకోవడం చాలా ప్రమాదకరం అనే విషయాన్ని కూడా చెప్పారు. సాయిల్ బేరింగ్ కెపాసిటీ (భూమి పటుత్వం) చాలా తక్కువని చెప్పారు. హైదరాబాద్‌లో సాయిల్ బేరింగ్ కెపాసిటీ చదరపు మీటర్‌కి 30 టన్నులు, చెన్నైలో 12-15 టన్నులు, బెంగళూర్‌లో 25-30, అమరావతిలో కేవలం 9 టన్నులు మాత్రమే. ఈ విషయం గురించి ఐఐటీ చెన్నై వారితో అధ్యయనం చేయిస్తే రాజధాని కట్టే ప్రాంతం ఫ్లడ్ ప్లేన్. ఈ విషయం చంద్రబాబుకి తెలిసే కొండవీటి వాగుతో నీటిని బయటకు పంపింగ్ చేయడానికి ఒక కమిటీ కూడా వేశారు. - శివరామకృష్ణన్ కమిటీతో నారాయణ కమిటీకి పోలికా?.. శివరామకృష్ణన్ కమిటీ పూర్తి సమాచారంతో కూడిన రిపోర్టు సమర్పిస్తే నాటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని కనీసం పరిశీలించలేదు. ఆ కమిటీ కాదని వ్యాపారావేత్తలతో కూడిన నారాయణ కమిటీ వేశారు. ఈ కమిటీలో నారాయణ, వైఎస్ చౌదరి, గల్లా జయదేవ్, బీదా మస్తాన్‌రావు, జీవీకే గ్రూప్‌నకు చెందిన జీవీ సంజయ్‌రెడ్డి, బొమ్మిడాల శ్రీనివాస్ జీవీకే గ్రూప్, నూజివీడు సీడ్స్ అధినేత ప్రభాకర్ రావు, చింతలపాటి శ్రీనివాసరాజు తదితర వ్యాపార వేత్తలు ఉన్నారు. శివరామకృష్ణన్ కమిటీలో రకరకాల విభాగాలకు చెందిన నిపుణులుంటే, నారాయణ కమిటీలో అందరూ వ్యాపారవేత్తలే ఉన్నారు. శివరామకృష్ణన్ కమిటీ చెప్పేది కరక్టా, నారాయణ కమిటీ చెప్పేది కరెక్టా? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి. నగరాన్ని కట్టే బాధ్యత వ్యాపారవేత్తలకు అప్పగించడం కరెక్టేనా? ఈ కమిటీ ఎక్కడైనా ఒక్క రిపోర్టు ఇచ్చిన దాఖలాలున్నాయి. శివరామకృష్ణన్ కమిటీ 30 మీటింగ్‌లు పెట్టింది. 13 జిల్లాలను కమిటీ సందర్శిస్తే, 9 జిల్లాలను శివరామకృష్ణన్ నేరుగా వెళ్లి సందర్శించారు. శివరామకృష్ణన్ నిబద్ధత ఎలాంటిదంటే, ఆయన కేన్సర్‌తో బాధపడుతూ కూడా 9 జిల్లాలను స్వయంగా సందర్శించి వాస్తవ పరిస్థితులపై చర్చించారు. కానీ నారాయణ కమిటీ రాష్ట్రంలో ఎక్కడా తిరగకుండా టోక్యో, సింగపూర్, సౌత్ కొరియా, మలేసియా, షాంఘై తిరిగొచ్చారు. వ్యాపారా వేత్తలుగా వారి వారి రంగాల్లో వారు స్పెషలిస్టులైతే కావొచ్చు, కానీ రాజధాని నిర్మాణంలో వారికున్న అనుభవం ఏంటని చంద్రబాబు ఎందుకు ఆలోచించలేదు? నాలుగు మీటింగ్‌లు పెడితే ఎక్కడా సెక్రటేరియట్, గవర్నమెంట్ కాంప్లెక్సుల గురించి చర్చించనేలేదు. ఫ్లడ్ ప్లేన్, సాయిల్ బేరింగ్ కెపాసిటీని దృష్టిలో పెట్టుకుని అమరావతిలో ఉన్న వాస్తవ పరిస్థితుల గురించి నారాయణ కమిటీ ఎక్కడా చర్చించలేదు. - అమరావతి పై జగన్ హయాంలో అధ్యయనం.. ఈ పరిస్థితుల్లో అమరావతి రాజధాని నిర్మాణం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి 2019లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ డాక్టర్ మహవీర్, డీన్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్.., అంజలి మోహన్, అర్బన్ అండ్ సిటీ ప్లానర్.., శివానందస్వామి, సీఈపీటీ (సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ప్లానర్ అండ్ టెక్నాలజీ)హెడ్, అహ్మదాబాద్.., శివరామకృష్ణన్ కమిటీలో పనిచేసిన కేటీ రవీంద్రన్, అరుణాచలం, రిటైర్డ్ చీఫ్ అర్బన్ ప్లానర్ చెన్నై.., లతో కూడిన కమిటీ వేశారు. వైయస్.జగన్ వేసిన ఈ కమిటీని నారాయణ కమిటీతో పోల్చిచూస్తే ఎవరి ఉద్దేశం ఏమిటన్నది స్పస్టంగా తెలిసిపోతుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ కన్సల్టెన్సీలలో ఒకటైన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో కూడా వైయస్ జగన్ గారు చర్చించారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో అన్నింటినీ అమరావతిలో నిర్మించడం సరైన నిర్ణయం కాదని వారు నివేదిక ఇచ్చారు. దీనిపైనే ఆయన ముందుకు పోకుండా, మళ్లీ ఎక్సపర్టు కమిటీ వేశారు. ఆ కమిటీలో ఆర్థిక శాఖ మంత్రి, మినిస్టర్ ఫర్ లెజిస్టేటివ్ అఫైర్స్ గా ఉన్న బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి, నాతోపాటు మినిస్టర్ ఫర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, మినిస్టర్ ఫర్ అర్బన్ డెవలప్‌మెంట్, మినిస్టర్ ఫర్ హోం, మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్, మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఫర్ సివిల్ స్లపయిస్, మినిస్టర్ ఫర్ ఎనిమల్ హజ్బెండరీ.. ఇలా సగం మందితో మంత్రుల కమిటీ వేశారు. - అమరావతిలో బుద్ధుడి విగ్రహం పెట్టిందే వైయస్సార్.. తెలంగాణ వేర్పాటువాదం వచ్చిందని దానిపై స్టడీ చేసిన శ్రీకృష్ణ కమిటీ ఏపీలో అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ అని తేల్చింది. ఆ తర్వాత వెనుకబడిన్ ప్రాంతం ఉత్తరాంధ్ర అని చెప్పింది. కేటీ రవీంద్రన్ కమిటీ నాలుగు జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని సూచించింది. అమరావతి మాదిరిగా ప్రపంచ వ్యాప్తంగా 32 నగరాల నిర్మాణం జరిగితే 2 మాత్రమే సక్సెస్ అయ్యాయని, 30 దారుణంగా ఫెయిలయ్యాయని బీసీజీ నివేదిక చెప్పింది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఈ ఆలోచన కరెక్టు కాదని స్పష్టం చేసింది. పచ్చని పొలాల్లో రాజధాని కడుతున్నారని తెలిసి కియా ఇండియా అంబాసిడర్ కూడా షాకయ్యాడు. ఇలా వాస్తవాలను ఆధారాలతో సహా చెబుతుంటే దాన్ని జీర్ణించుకోలేక మాపై బురదజల్లుతున్నారు. వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. అదేమంటే అమరావతి దేవతల రాజధాని అంటారు. అమరలింగేశ్వరస్వామి అని మార్కెటింగ్ చేసుకునే చంద్రబాబు ఆ గుడి డెవలప్‌మెంట్ కోసం కనీసం లక్ష రూపాయలైనా ఖర్చు చేశారా? కనీసం ఆ గుడికి వెళ్లడానికి మంచి రోడ్డయినా ఉందా? అమరావతి అంటేనే బుద్ధుడు అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ బుద్ధుడి విగ్రహం, మ్యూజియం పెట్టించింది కూడా వైయస్ రాజశేఖర్ రెడ్డి గారే. వాస్తవాలు చెబుతుంటే మా ఇళ్లలో అక్కలు, చెల్లెళ్లు, అమ్మలను తిడుతున్నారు. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం సిగ్గుచేటు. ఇది చాలదన్నట్టు మళ్లీ ఇప్పుడు మరో 50 వేల ఎకరాలు కావాలంటున్నారు. - చంద్రబాబుది సీక్రెట్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (సీపీపీ).. సూపర్ సిక్స్ సూపర్ సెవన్ మాదరిగా అమరావతి మీద ప్రజల్లో అంచనాలు పెంచేసి అధికారంలోకి రావడం, వాటిని అందుకోలేక వైయస్సార్సీపీ మీద బురదజల్లడం ఫ్యాషన్ అయిపోయింది. వైయస్ జగన్ వస్తారేమోనని పెట్టుబడులు రావడం లేదని చెబుతున్నారు. వైయస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని వారే చెబుతున్నారు. చంద్రబాబు ఎంచుకున్నది పీపీపీ మోడల్ కాదు.. సీక్రెట్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (సీపీపీ). ప్రాంతపరంగా అమరావతికి వైయస్సార్సీపీ వ్యతిరేకం కాదని వైయస్ జగన్ ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పారు. కానీ అమరావతి పేరుతో జరుగుతున్న భారీ దోపిడీకి మాత్రమే మేం వ్యతిరేకం. లక్ష ఎకరాలు ఏంటి? 2 లక్షల ఎకరాలేంటి? ప్రజలు రాజధాని బిల్డింగులు కట్టమన్నారే కానీ, నగరం కట్టమని ఎవరడిగారు? - హైదారాబాద్ లో ఉంటూ అమరావతి కోసం పోరాటం.. నేను రాజకీయాల్లో లేను. కానీ, అమరావతి రాజధానిగా ఉండాలి- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రాజధాని, రాజ్యాంగం మార్చడం సరికాదు. - మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ అమరావతి నగరం రైతుల కష్టం, త్యాగంతో నిర్మించారు. - మాజీ సీజేఐ,ఎన్వీరమణ. 12 ఏళ్లయినా రాజధాని ఏర్పాటు చేసుకోలేదు - సీపీఎం రాఘవులు. రాజధాని రైతులకి ఏం న్యాయం చేశారు. - సీపీఐ నారాయణ. పెట్టరా పేరు కమరావతి - రేణుకా చౌదరి అని అమరావతి కోసం పోరాటం చేసే వీళ్లంతా ఉండేది మాత్రం హైదరాబాద్ లోనే. ఈ పెద్ద మనుషులు, మేధావులుగా చలామణీ అవుతున్న వీరంతా ఏనాడైనా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల గురించి ఆలోచించారా? - మేధావులారా నా ప్రశ్నకు బదులివ్వండి... హైదరాబాద్ లో కూర్చుని అమరావతి కోసం పోరాటాలు చేసే వారికి కొన్ని ప్రశ్నలు అడగదల్చుకున్నాను. మొదటి ప్రశ్న శ్రీబాగ్ ఒడంబడికపై మీకు గౌరవం ఉందా?, దానికి కట్టుబడి ఉన్నారా ? రెండో ప్రశ్న రాజధాని భవనాలు ప్రజల మధ్యలో కడతారా లేక పచ్చటి పొలాల మధ్య కడతారా ? మూడు ప్రశ్న శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుకు మీరు కట్టుబడి ఉన్నారా లేక నారాయణ కమిటీ రిపోర్ట్ కు కట్టుబడి ఉన్నారా ? నాలుగో ప్రశ్న ఇప్పటికే ప్రభుత్వం అమరావతి రైతుల నుంచి దాదాపు 50 వేల ఎకరాలు తీసుకుంది. మరో 50 వేల ఎకరాలు తీసుకోవడం కరెక్టేనా ? అమరావతి కోసం దాదాపు 2 లక్షల కోట్లు అప్పులు తీసుకోవడం కరెక్టేనా ? సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటున్న అమరావతికి ప్రభుత్వ గ్యారంటీ లేకుండా ఒక రూపాయి అయినా అప్పు తీసుకురాగలరా ? అప్పు లేకుండా రాజధాని కడుతున్నారా ? మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు ప్రణాళిక మంచిది కాదంటే ఎందుకో చెప్పండి ? రాష్ట్ర ప్రగతిలో రాయలసీమ, ఉత్తరాంధ్రకు భాగస్వామ్యం ఉండాలా వద్దా ? ఉండాలంటే ప్రకాశం, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ఏదైనా ప్రణాళిక ఉందా ? వికేంద్రీకరణకు మీరు అనుకూలమా ? లేక వ్యతిరేకమా? చెప్పాలి. అమరావతి కావాలంటున్నవారు ఇక్కడ ఎందుకు నివసించడం లేదు?. ప్రభుత్వ అసమర్థత వల్లే పెట్టుబడులు రావట్లేదు. కానీ దీనికి మా పార్టీపై నిందలు వేస్తున్నారు. గుంటూరు-విజయవాడలో కమ్మ సామాజిక వర్గం వారే లేఅవుట్ వేసే లోపు భూమి కన్వర్షన్ కావాలంటే, ఇతర పనులు కావాలంటే ఎమ్మెల్యేలకు మామూళ్లు ఇవ్వాల్సిందే అంటున్నారు. అమరావతిలో కిరణా దుకాణాలతో పాటు మద్యం అమ్ముకుంటే కానీ చిన్న షాపులు కూడా నడవట్లేదు. మీరు హెరిటేజ్ కంపెనీ అక్కడ పెడితే మిగతా వాళ్లు పెట్టుబడులు పెట్టేందుకు వస్తారు. మెడికల్ కాలేజీలకు టెండర్లు వేయలేదంటున్న మంత్రి నారాయణ..ఆయన టెండర్ వేస్తే ఇతరులు వస్తాయని గుర్తించాలి. ఎన్నో కరువులతో అల్లాడుతున్న రాయలసీమలో వర్షాల కోసం గాడిదలకు, తాబేళ్లకు పెళ్ళిళ్లు చేసుకోవాల్సిన పరిస్ధితులు ఉన్నాయి. జైసల్మేర్ తర్వాత అత్యంత వెనుకబడిన ప్రాంతం అనంతపురం అన్న విషయం గుర్తించాలి. లక్షల కోట్లు అమరావతికి పెడితే మిగిలిన రాష్ట్రమంతా ఏం కావాలన్నదే వైయస్.జగన్ ప్రశ్న. - ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి... చివరగా, రాష్ట్ర భవిష్యత్తు అనేది కేవలం ఒక వ్యక్తి 'ఫాంటసీ' మీదో లేదా కొందరు వ్యాపారవేత్తల ప్రయోజనాల మీదో ఆధారపడి ఉండకూడదని బుగ్గన రాజేంద్రనాథ్ హెచ్చరించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, చంద్రబాబు తన పంతాలను వీడి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైయస్. జగన్ సూచించిన 'మావిగన్' ప్రతిపాదన ఒక ప్రాంతానికో, పార్టీకో సంబంధించింది కాదని.. అది రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, సామాన్య ప్రజల సంక్షేమానికి రక్షణ కవచం లాంటిదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా బూతులు తిట్టడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం మానుకుని.. ఉత్తరాంధ్రా, రాయలసీమతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, లేనిపక్షంలో చరిత్ర చంద్రబాబును ఒక 'ఆర్థిక విధ్వంసకారుడి'గా గుర్తుంచుకుంటుందని బుగ్గన రాజేంద్రనాథ్ తేల్చి చెప్పారు.