తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన ‘మావిగన్’ క్యాపిటల్ కారిడర్‌పై స్పష్టమైన సమాధానం ఇవ్వలేక చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు దిగుతున్నారని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. మావిగన్ కంటే అమరావతి ఏ విధంగా బెటర్?” అన్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని మీడియా సమావేశంలో కొరముట్ల శ్రీనివాసులు సవాల్ విసిరారు. ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ‘మావిగన్’ పై చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ తన గూటి చిలుకలతో వైయస్ జగన్‌పై వ్యక్తిత్వ హనానికి పాల్పడుతున్నారని ఆక్షేపించారు. ప్రెస్‌మీట్‌లో కొరముట్ల శ్రీనివాసులు ఏమన్నారంటే.. ‘మావిగన్’ అంటే చంద్రబాబుకు వణుకు రాష్ట్ర రాజధాని అంశంలో ప్లాన్ –బి కింద మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు మధ్య నున్న 110 కి.మీ. ప్రాంతాన్ని క్యాపిటల్ గ్రోత్ కారిడర్ కింద పెట్టమని వైయస్ జగన్ ప్రతిపాదించారు. జనాభా లేని, వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలులేని అమరావతి ప్రాంతంలో వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి, పోసే బదులు, కేవలం నీళ్లు, డ్రైనేజీ, కరెంటు, రోడ్లు లాంటి కనీస సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు పెట్టేబదులు, అందులో కేవలం పదో వంతు రూ.20 వేల కోట్లు పెడితే, డే వన్ నుంచే రాజధాని అందుబాటులోకి వస్తుంది. జగన్‌గారు సూచించిన మావిగన్ కన్నా, చంద్రబాబు అమరావతి ఏ రకంగా బెస్ట్ ఆప్షన్ అవుతుందో చంద్రబాబు చెప్పగలరా? ‘మావిగన్’ అనే పేరు వింటేనే సీఎం చంద్రబాబు ఎందుకు ఇంత ఉలిక్కిపడుతున్నారో ప్రజలకు బాగా అర్థమవుతోంది. ● ఈ ప్రశ్నలకు బదులిస్తారా బాబూ? - అమరావతి రాజధాని ప్రాంతంలోని లక్ష ఎకరాల్లో కేవలం రోడ్లు, డ్రైనేజీ, కరెంటు, నీళ్లు లాంటి కనీస సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చవుతాయని మేము చెబుతున్నాం. దీనికి మీరు కడుతున్న బిల్డింగుల ఖర్చు అదనం. ఇది వాస్తవమా కాదా? . ఏడేళ్లలో కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసినప్పుడు, ఈ రెండు లక్షల కోట్లు పెట్టడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? - జీతాలు ఇవ్వడానికే అప్పులు చేయాల్సిన పరిస్థితిలో, ఇంత భారీ మొత్తాన్ని ఎక్కడి నుంచి తెస్తారు? ఎలా తెస్తారు? అసలు అంత అప్పులు సాధ్యమేనా? రాజధాని ఎప్పటికి పూర్తవుతుంది? - ఒకవైపు అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నారు… మరోవైపు ప్రభుత్వ గ్యారంటీతో అప్పులు తీసుకుంటున్నారు. బడ్జెట్ నుంచి కేటాయింపులు చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? ప్రభుత్వం చేతిలో 5 వేల ఎకరాలే ఉన్నాయని చెబుతూ, మరోవైపు భూముల ధరల విషయంలో విభిన్నంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎకరా రూ.10 కోట్లకు భూములు ఎలా అమ్మగలుగుతారు? నిజంగా కొనేవాళ్లు ఎవరున్నారు? చివరికి ఆర్థిక భారం మొత్తం రాష్ట్రంపైనే పడదా? - తాడేపల్లి, బెంగుళూరు, హైదరాబాద్‌ల్లో చదరపు అడుగు రూ.4,500–5,000 మధ్యే ఇళ్లు లభిస్తున్నాయి. కానీ అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాల కోసం చదరపు అడుగు రూ.14 వేల చొప్పున కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు? మంత్రి స్వయంగా అది ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి రేట్లకు ప్రభుత్వ భవనాలు కట్టించారా? చూపించగలరా? - 2018లో ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేసిన తర్వాత, అదే కాంట్రాక్టర్లకు మళ్లీ పనులు ఎలా వచ్చాయి? పైగా అధిక రేట్లకు ఎలా ఇచ్చారు? టెండర్ డాక్యుమెంట్లు ఎందుకు వెబ్‌సైట్ నుంచి తొలగించారు? ఆర్టీఐకి ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు? - ల్యాండు ఫ్రీ, శాండు ఫ్రీ, జీఎస్టీ రాయితీలు ఇస్తూ కూడా ఇంత భారీ రేట్లకు కాంట్రాక్టులు ఇవ్వడం వెనుక మతలబు ఏంటి? రేట్లు పెంచినప్పుడు ఇతర కంపెనీలు ఎందుకు రాలేదు? ఎందుకు కొద్దిమందికే అవకాశాలు ఇచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ చంద్రబాబు సమాధానం చెప్పాలి. వీటన్నింటికీ సమాధానం చెప్పే ధైర్యం లేక, నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తూ, జగన్‌గారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు గతి తప్పిన, నీతి మాలిన రాజకీయం ఇది. బాబుగారూ ఇకనైనా.. ఇలాంటి వాటికి స్వస్తి చెప్పండి అంటూ కొరముట్ల శ్రీనివాసులు హితవు పలికారు.