'తెలంగాణ ప్రజలే కేసీఆర్‌ను తరిమికొడతారు'

హైదరాబాద్, 11 డిసెంబర్‌ 2012: టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసిఆర్‌ త్వరలో తెలంగాణ ప్రజలే తరిమికొడతారని వైయస్‌ఆర్‌సిపి సిఇసి సభ్యుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి, పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు డి.రవీంద్ర నాయక్ హెచ్చరించారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్న తీరులో ఆయన తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టారని వారు ఆరోపించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే కేసిఆర్‌ నోట్లోనే మట్టి పడుతుందని వారు వ్యాఖ్యానించారు. శ్రీ 'జగన్‌ సిఎం అయితే, తెలంగాణ నోట్లో మట్టే' అంటూ కేసిఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రతాపరెడ్ది, రవీంద్రనాయక్‌ తీవ్రస్థాయిలో స్పందించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో వారిద్దరూ కేసిఆర్‌పై నిప్పులు చెరిగారు.

తెలంగాణ రాష్ట్రం రావడం కేసిఆర్‌కే ఇష్టం లేదని కొమ్మూరి ఆరోపించారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లు ఇంత కాలంగా తెలంగాణ ప్రజలను కేసిఆర్‌ మోసగిస్తున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతం అయిన ప్రతిసారీ దాన్ని కేసిఆర్‌ నిర్వీర్యం చేసిన వైనాన్ని వారు వివరించారు. సకల జనుల సమ్మెను, తెలంగాణ మార్చిని కూడా ఆయనే మండిపడ్డారు. కేసిఆర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు కేవలం ఓట్లు, సీట్లు, పదవులు, డబ్బుల సంపాదనే ప్రధానం అని ఎద్దేవా చేశారు. ఎంతసేపూ తన కుటుంబం బాగుండాలి, తనకు మంత్రి పదవి రావాలనే కేసిఆర్‌ స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కూడా కాని అల్లుడికి మంత్రి పదవి ఇప్పించుకున్న కేసిఆర్‌ తీరును దుయ్యబట్టారు. ఉద్యమం అంటే త్యాగాలు ఉండాలి కాని కేసిఆర్‌ వల్ల డబ్బులు, పదవులు అనే కొత్త ట్రెండ్‌ వచ్చిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం బతికి బట్టకట్టడానికి విద్యార్థులు, ఉద్యమకారులు, జెఎసియే కారణమన్నారు.

సకల జనుల సమ్మెను నిర్వీర్యం చేసిన కేసిఆర్‌ను, ఆయన కుమార్తెను తెలంగాణ వాదులు ట్యాంక్‌బండ్‌ తరిమి తరిమి కొట్టిన వైనాన్ని కొమ్మూరి గుర్తుచేశారు. తెలంగాణ కోసం కేసిఆర్‌ మనస్ఫూర్తిగా కృషి చేస్తుంటే మొన్నటి ఉద్యమాన్ని ముందుండి నడిపించకుండా ఢిల్లీలోనే ఎందుకు దాక్కున్నారని నిలదీశారు. ఢిల్లీకి రమ్మని ఏ నాయకుడు కేసిఆర్‌ను ఆహ్వానించారో వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఇస్తామని ఏనాడూ చెప్పలేదని, తమతో పొత్తు పెట్టుకుంటానని, మంత్రిపదవులు ఇమ్మని కేసిఆర్‌ అడిగారని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోందన్నారు. దీనికి కేసిఆర్‌ సమాధానం ఏమిటని ప్రశ్నించారు.

కేసిఆర్‌ రెచ్చగొట్టడం వల్లే ఉద్యమంలో దిగిన విద్యార్థులు ఇప్పుడు ఉద్యోగాలు, ఉపాధి లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పడంలో గిన్నిస్‌ రికార్డు ఉంటే మొదటి స్థానంలో కేసిఆర్‌ ఉంటారని ఎద్దేవా చేశారు. సమైక్యాంధ్రకే మద్దతుగా ఉన్న సిపిఎంతో కూడా పొత్తుపెట్టుకున్న కేసిఆర్‌ తీరును కొమ్మూరి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిని టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంలోనే తెలంగాణ పట్ల కేసిఆర్‌కు ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లం అవుతోందన్నారు. తెలంగాణ ప్రాంతంలో బలీయంగా ఉన్న తన లాంటి నాయకులను కేసిఆర్‌ అణగదొక్కిన వైనాన్ని ఆయన వివరించారు.

రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలన్న సదుద్దేశంతోనే శ్రీ జగన్మోహన్‌రెడ్డి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఏర్పాటు చేశారని కొమ్మూరి స్పష్టం చేశారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అమలు చేసిన పథకాలన్నింటినీ కొనసాగించాలన్నదే శ్రీ జగన్‌ ఆశయం అన్నారు. ఆస్తులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం శ్రీ జగన్మోహన్‌రెడ్డికి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే రెండు చోట్లా వైయస్‌ఆర్‌సిపి ఉంటుందన్నారు.

తాను ఎమ్మెల్యేగా పనిచేసిన వరంగల్‌ జిల్లా చేర్యాల నియోజకవర్గంలో సాగునీరు లేక అల్లాడుతుంటే దివంగత వైయస్‌ రూ. 1000 కోట్లు ఖర్చు చేసి గోదావరి నుంచి నీటిని తరలించే కార్యక్రమం చేపట్టారన్నారు. నీటి వనరులు తక్కువగా ఉన్న తెలంగాణలోనే విద్యుత్‌ మోటార్లు ఎక్కువని, మహానేత వైయస్‌ ప్రారంభించిన ఉచిత విద్యుత్‌ పథకం వల్ల అత్యధికంగా లాభపడింది తెలంగాణ ప్రజలే అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు హెక్టారుకు రూ. 10 వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ ప్రకటించిందని, అయితే, వైయస్‌ ఉంటే ఎకరానికి రూ. 10 వేలు ఇచ్చి ఉండేవారన్నారు.

సోనియా ఏజెంట్ కేసిఆర్‌ : రవీంద్రనాయక్:
కేసిఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ కోసం కృషి చేస్తున్న ఏ పార్టీలోని తెలంగాణ బిడ్డలనైనా విమర్శించకూడదని డి.రవీంద్ర నాయక్‌ సూచించారు.‌ తెలంగాణ బిడ్డలను కలుపుకుని ఉద్యమం చేస్తే మేలని సలహా ఇచ్చారు. సోనియా ఏజెంటు కేసిఆర్‌ అని ఆయన ఆరోపించారు. స్వార్థపరుడైన కేసిఆర్‌ ట్రాప్‌లో పడిపోవద్దని జెఎసి నాయకులను రవీంద్రనాయక్‌ హెచ్చరించారు.‌ తెలంగాణపై వైయస్‌ఆర్‌సిపి ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి చేసిన మాటకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు.
Back to Top