ఉపఎన్నికలకు వెళ్లే దమ్ము టీడీపీకి లేదు

  • స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే టీడీపీకి గెలుస్తామనే నమ్మకం లేదు
  • స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  నామినేషన్లు వేసిన వారిని బెదిరిస్తున్నారు
  • ఇతర పార్టీల నుంచి 21 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు
  • వారికి మంత్రి పదవులు ఇస్తామనడం దారుణం
  • అసెంబ్లీని తెలంగాణలో 75 రోజులు నడుపుతుంటే..ఏపీలో 30 రోజులేనా?
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అధికార పార్టీ అనుసరిస్తున్న విధానాలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఎండగట్టారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము తెలుగు దేశం పార్టీకి లేదని, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే గెలుస్తామనే నమ్మకం లేకే స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో నామినేషన్లు వేసిన వారిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తు చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, సీఎంకు రాజ్యాంగంపైనా, కోర్టులపైనా, ప్రతిపక్షంపైనా సరైన గౌరవం లేదని, నియంతలా పాలిస్తున్నారని ధర్మాన నిప్పులు చెరిగారు. శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్మాన ఏమన్నారంటే.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. రెండున్నర సంవత్సరాలు అవుతున్నా.. రాష్ట్రంలో  ఒక ఎన్నిక కూడా నిర్వహించలేదు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో ఏదైనా ఒక స్థానిక సంస్థకు ఖాళీ ఏర్పడితే ఆరు నెలలల్లో ఎన్నికలు జరపాలని చెప్పుతోంది. దీనికోసం ఒక ఎన్నికల కమిషన్‌ ఉంది. దాన్ని గౌరవించే పరిస్థితి ఏపీలో లేదు. కోర్టు ఆదేశాలు ఎక్కడ అమలు కావడం లేదు.  నీటి యాజమాన్య సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని వరల్డ్‌ బ్యాంకు చెప్పింది. ఎక్క డ కూడా ఎన్నికలు జరగలేదు. రాజకీయ పార్టీల విమర్శలు పట్టించుకోవడం లేదు. ఇదేనా రాజ్యాంగంపై మీకున్న నమ్మకం. రాష్ట్రంలో ప్రతిపక్షం మాకు సహకరించడం లేదని తప్పించుకోవచ్చా? దేశంలోని చట్టాలను గౌరవించాల్సిన పనిలేదా? శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారో చూడాలి. మన నుంచి విడిపోయిన తెలంగాణ 60 నుంచి 70 రోజులు సభను సజావుగా నిర్వహించారు. మీరేందుకు నిర్వహించలేకపోతున్నారు. ప్రజాస్వామ్యానికి అత్యున్నతమైన వేదిక శాసన సభ. అందులో ప్రజల సమస్యలు. ఆవేదనలు చర్చించాల్సి ఉంది. ఏ సంవత్సరం కూడా 30 రోజులకు మించి నడపడం లేదు. ఇదేనా ప్రభుత్వ తీరు అని ధర్మాన మండిపడ్డారు.

 రాజ్యాంగ విరుద్ధమైన, అవినీతిమయమైన, అక్రమ మార్గంలో ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారు. కొత్త అసెంబ్లీ భవనం కట్టడం గొప్పవిషయం అనుకుంటున్నారా? ఆ అసెంబ్లీ భవనంలో ప్రజల సమస్యలపై చర్చిస్తే ప్రజలు హర్షిస్తారు. అంతేకాని అత్యధునికమైన శాసన సభను నిర్మించామని చెప్పుకోవడం గొప్పకాదు. ఇదేమైన మీ కుటుంబ అస్తి అనుకుంటున్నారా? ప్రతిపక్షాన్ని ఆహ్వానించకుండానే నూతన అసెంబ్లీ భవనాలు ప్రారంభించారు. ఇది రాష్ట్ర ప్రజలను అవమానించినట్లు కాదా? ఇదేనా మిగతా రెండేళ్లు మీరు నడిపేది. 21 మంది ఎమ్మెల్యేలను ఇతర రాజకీయ పార్టీ నుంచి చేర్చుకున్నారు. ఇది గౌరవం అనుకుంటున్నారా?వారిని కేబినెట్‌లోకి తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రాష్ట్రంలోని ప్రజలను అవమానించాలనుకుంటున్నారా? ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని మాయం చేసే పద్ధతి, ఎన్నికల వ్యవస్థను అగౌరవపరిచే పద్ధతిని ప్రజలు మెచ్చరు. స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు బెదిరింపులకు పాల్పడుతున్నారు. స్వేచ్చగా ఎన్నికలు జరిగితే మీరు గెలిచే పరిస్థితి లేదు.  ఇది కరెక్ట్‌ కాదు. మున్సిపాలిటీలో తాను నివసిస్తున్న వార్డులో ఓటు కల్పించడం లేదు. మంచి ప్రతినిధిని ఎంపిక చేసుకునే పరిస్థితి లేదు. పూర్తిగా ఒక పక్షాన పనిచేసే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను, మున్సిపాలిటీ అధికారులను ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఒక్క సారి ప్రభుత్వ తీరును గమనించాలని ధర్మాన కోరారు. 
Back to Top