టీడీపీకి గుడ్ బై..వైయస్సార్సీపీలో చేరిక

తూర్పుగోదావరిః హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఇలాకాలో తెలుగు దేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ నేతల వ్యవహార శైలి నచ్చక బయటకు వచ్చేస్తున్న నేతలపై పోలీసు కేసులతో వేధింపులకు గురిచేస్తూ కుట్రలు పన్నుతున్నా వలసలను మాత్రం నిరోధించలేక చేతులెత్తేస్తున్నారు. బలవంతంగానైనా ఆపాలని తెలుగు తమ్ముళ్లు వేసిన ఎత్తులు, కుట్రలు, కిడ్నాప్‌ యత్నాలు బెడిసికొడుతున్నాయి. చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలపై విసుగెత్తిపోయిన పలువురు తెలుగు తమ్ముల్లు ఒకరొకరుగా ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.

ఇటీవల ఆ పార్టీ నమ్మినబంటు టీడీపీ పెద్దాపురం పట్టణ కార్యదర్శిగా పనిచేసిన తాళాబత్తుల సాయి పార్టీ నుంచి బయటకురాగా తాజాగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు అరుణా శ్రీనివాస్‌ యాదవ్‌ టీడీపీని వీడి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్‌ యాదవ్‌కు ఆ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. హోం మంత్రి చినరాజప్ప ప్రాతినిధ్యంవహిస్తున్న నియోజకవర్గంలో అతని నాయకత్వాన్ని ఎదిరించి ఆ పార్టీని వీడటంతో టీడీపీలో మసలం ప్రారంభమయింది. అందునా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సొంత సామాజికవర్గానికి చెందిన శ్రీనివాస్‌ యాదవ్‌ అఖిలభారత యాదవ మహాసభలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న క్రమంలో టీడీపీకి తీరని నష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కిడ్నాప్‌నకు యత్నం...
శ్రీనివాస్‌ యాదవ్‌ బయటకు పోకుండా అడ్డుకోవాలని తెలుగు తమ్ముళ్లు చివరకు కిడ్నాప్‌ చేసేందుకు సైతం వెనుకాడ లేదు. వైయస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌ తోట సుబ్బారావునాయుడు తన అనుచరులు హుటాహుటిన శ్రీనివాస్‌ యాదవ్‌ను వేరే గ్రామానికి తరలించారు. పెద్దాపురం మట్టే వారి కల్యాణ మండపంలో శ్రీనివాస్‌ యాదవ్‌తోపాటు మరో 500 మంది వైయస్సార్సీపీలో చేరారు. 
Back to Top