పాలకుల నిలువెత్తు అవినీతి

–టీడీపీ అరాచకాలకు ఆ భగవంతుడు శిక్షవేయటం ఖాయం
–ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల్లో భారీ అవినీతి
–సిమెంటు రోడ్డు, డ్రయిన్లు నిర్మించిన రోజుల వ్యవధిలోనే గుంతలా..?
–టీడీపీ అవినీతిపై చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు
–వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ మంత్రి మోపిదేవి హెచ్చరిక

రేపల్లెః నిలువెత్తు అవినీతికి పాల్పడుతూ టీడీపీ పాలకులు చేస్తున్న అరాచకాలకు ఆ భగవంతుడు శిక్షవేయటం ఖాయమని వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. పట్టణంలో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో నిర్మితమైన పలు రోడ్లు, డ్రయిన్‌లను ఆయన గురువారం పరిశీలించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. పట్టణ నడిబొడ్డున ఉన్న మసీదు బజారులో నిర్మించిన సిమెంటు రోడ్డు వేసిన కొన్ని రోజుల్లోనే గోతులు పడి టీడీపీ పాలకుల అవినీతిని ఎత్తిచూపుతున్నాయన్నారు. సుమారు రూ.20 కోట్లు ఎస్సీ సబ్‌ప్లాన్‌నిధులను వెచ్చించి పట్టణంలో నిర్మిస్తున్న రోడ్లు, డ్రయిన్ల నిర్మాణం పూర్తి కాకుండానే గోతులు పడిపోవటం టీడీపీ అవినీతికి పరాకాష్ట అన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌నిధుల వినియోగంలో తీవ్ర స్థాయిలో అవినీతి జరిగిందని ధ్వజమెత్తారు. ఒక పక్క ఎస్సీ ప్రాంతాల్లో రోడ్డు, డ్రయిన్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పలు చోట్ల రోడ్లు బాగున్నా రోడ్లపై రోడ్లు వేసి అవినీతికి తెరతీశారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతూ ప్రజాధనాన్ని టీడీపీ నాయకులు జేబులు నింపుకుంటుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. అవినీతి పనుల్లో భాగస్వాములుగా మారుతున్న అధికారుల తీరు మార్చుకోకపోతే నష్టపోయేది అధికారులేనని హెచ్చరించారు. ఈసందర్భంగా మసీదు సెంటర్‌లో వేసిన సిమెంటు రోడ్డును పరిశీలించి అనంతరం మసీదు వద్ద ముస్లిం  పెద్దలను పలకరించగా రోడ్డు నిర్మించి రోజులు గడవకముందే రోడ్డుగోతులు పడటం తాము మునుపెన్నడూ చూడలేదని, గతంలో మీరు మంత్రిగా ఉన్న సమయంలో వేసిన రోడ్డు చెక్కు చెదరలేదని, దానిపై వేసిన రోడ్డు రోజులు గడవక ముందే గోతులు పడటం విడ్డూరంగా ఆవేదన వ్యక్తం చేశారు.

రేపు పట్టణంలో ధర్నాః మోపిదేవి
పట్టణంలో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో నిర్మించిన రోడ్లు, డ్రయిన్లలో అవినీతిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 22వ తేది శనివారం ఉదయం 10 గంటలకు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనునన్నట్లు మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు. కార్యక్రమానికి వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్‌గడ్డం రాధాకృష్ణమూర్తి, మున్సిపల్‌ ఫ్లోర్ లీడర్‌ కొమ్మూరి వీరబ్రహ్మేంద్రస్వామి, కౌన్సిలర్లు జూలకంటి బుజ్జిబాబు, చెన్ను లక్ష్మణరావు, నాయకులు కరేటి రామ్మోహనరావు, గుజ్జర్లమూడి ప్రశాంత్‌కుమార్, జడల వాసు, కొలుసు బాలకృష్ణ, సుభానీ, అల్లంశెట్టి శ్రీనివాసరావు, ఐనాల సాంబశివరావు, చిమటా బాలాజీ, చిత్రాల ఒబేదు తదితరులు పాల్గొన్నారు.



Back to Top