వైయస్ఆర్‌ కాంగ్రెస్‌లోకి తాడిపత్రి టీడీపీ నేత

పులివెందుల (వైయస్ఆర్‌ జిల్లా) :

అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం టీడీపీ సీనియర్ ‌నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ పేరం నాగిరెడ్డి బుధవారంనాడు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ సభ్యత్వం తీసుకున్నారు. నాగిరెడ్డికి పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. నాగిరెడ్డి పెద్ద సంఖ్యలో‌ పులివెందుల తరలివచ్చి శ్రీ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలిసి వైయస్‌ఆర్ కాంగ్రెస్‌లో చేరారు. పులివెందులలోని శ్రీ‌ వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంలో నాగిరెడ్డి, ఆయన కుమారుడు గోకు‌ల్‌రెడ్డి, పలువురు అనుచరులు పార్టీలో చేరారు.

తాడిపత్రి నియోజకవర్గం ఎన్నికల బరిలో జేసీ దివాకరరెడ్డి సోదరులపై నాగిరెడ్డి పలుమార్లు తలపడ్డారు. జేసీ సోదరులు టీడీపీలో చేరుతున్నారంటూ వస్తున్న ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు ఖండించకపోవడం, టీడీపీ నేతలే జేసీ సోదరులతో సంప్రదింపులు జరుపుతున్నారన్న సమాచారం వస్తున్న నేపథ్యంలో నాగిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.

చంద్రబాబు తీరు బాధాకరం : నాగిరెడ్డి
జేసీ సోదరుల విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని చంద్రబాబు ఖండించకపోవడంతో తనను తీవ్రంగా కలచివేసిందని నాగిరెడ్డి ఈ సందర్భంగా అన్నారు. గడచిన 25 సంవత్సరాలుగా జేసీ సోదరులపై పోటీచేస్తూ.. ఎన్నో సవాళ్ల మధ్య టీడీపీ అభివృద్ధికి తాను కృషిచేశానని చెప్పారు.

‌మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలు నెరవేరాలంటే‌ ఆయన తనయుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగాచేసుకోవాలని రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నాని పేరం నాగిరెడ్డి అన్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందని నాగిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌, టీడీపీల నుంచి త్వరలోనే మరింత మంది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

రెండు కళ్ల సిద్ధాంతం వల్లెవేస్తూ.. రెండు ప్రాంతాల్లోనూ గెలవాలన్న వ్యూహంతో రాష్ట్ర విభజనకు చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చారన్నారు. ఆ లేఖ వల్లే విభజనకు కాంగ్రెస్‌ పార్టీ ధైర్యం చేసిందన్నారు. ఒక ప్రాంతంలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సమైక్యాంధ్ర కోసం ధైర్యంగా పోరాడుతున్న ఒకే ఒక నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అని ఆయన గర్వంగా చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top