సుప్రీం కోర్టు జడ్జితో దర్యాప్తు చేయించుకోండి

హైదరాబాద్:

దివంగత మహానేత, ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి పాలనపై అనుమానాలుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయించుకోవాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకురాలు శ్రీమతి వైయస్  విజయమ్మ ప్రభుత్వాన్ని సవాలు చేశారు.  జీవించిలేని మహానేతపై  అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం మనసుకు చాలా బాధ కలిగిస్తోందన్నారు. ఎస్సీ,  ఎస్టీ ఉప ప్రణాళికపై  అసెంబ్లీలో ఆదివారం నాడు ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చిన తర్వాత శ్రీమతి విజయమ్మ మాట్లాడారు.  మెస్‌ఛార్జీలు పెంచుతూ నిర్ణయించడాన్ని ఆమె అభినందించారు. కాస్మొటిక్ ఛార్జీలను కూడా  పెంచాలని కోరారు. దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఎస్సీ, ఎస్టీలకు నిధులు సంతృప్తికరంగా మంజూరయ్యేవన్నారు. ఇళ్ల మంజూరులో మళ్లీ కోటా పద్ధతి వచ్చిందని శ్రీమతి విజయమ్మ చెప్పారు.
కేంద్రం నుంచి వచ్చే నిధులు ఖర్చులో  చట్టబద్ధత ఉండాలని స్పష్టంచేశారు. 'రాజశేఖర్‌రెడ్డి గారు సభలో లేరు కాబట్టి అందరూ తలోరకంగా మాట్లాడుతున్నారు.  రేవంత్‌రెడ్డి గారు బయ్యారం గనులను అల్లుడికి రాసిచ్చారని, జగన్‌కు ఇంకా ఏదో రాసిచ్చారని మాట్లాడుతున్నారు. రాజశేఖర్‌రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా పన్ను పెంచకుండా పథకాలు అమలు చేశారు. ఈ ముఖ్యమంత్రి గారేమో సొంత ఖజానాకు పెంచుకోలేదు.. ప్రభుత్వ ఖజానాకు పెంచుకున్నానంటూ మాట్లాడుతున్నారు. అంటే అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టు? ఆయన మీద మాట్లాడాల్సిన తీరు ఇదేనా? 26 జీవోల విషయంలో సుప్రీంకోర్టు అడిగినప్పుడు ప్రభుత్వం ఎందుకు కౌంటర్ ఇవ్వలేదు. మనసుకు చాలా కష్టంగా ఉంద'ని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన జవాబు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటే నిమిష నిమిషానికి సభలో ఇటువైపు నుంచి, అటువైపు నుంచి మాట్లాడుతున్నారని విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. తర్వాత రేవంత్‌రెడ్డికి స్పీకర్ అవకాశం ఇవ్వడంతో మళ్లీ విజయమ్మను బాధపెట్టేలా మాట్లాడారు. ఈ పరిణామంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పో డియం వద్దకు వెళ్ళి నిరసన తెలిపారు.  చర్చలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు కె. శ్రీనివాసులు, బాలరాజు, గొల్ల బాబూరావులతోపాటు మోత్కుపల్లి (టీడీపీ), చంద్రావతి(సీపీఐ), నాగం జనార్దన్‌రెడ్డి(టీఎన్‌ఎస్), ఈటెల రాజేందర్ (టీఆర్‌ఎస్), రేగ కాంతారావు(కాంగ్రెస్), సండ్ర వెంకటవీరయ్య (టీడీపీ), సీతక్క(టీడీపీ), జేపీ (లోక్‌సత్తా) తదితరులు మాట్లాడారు.

Back to Top