తెనాలి ఘటనలపై సీఎం స్పందించాలి: ఉమ్మారెడ్డి

 గుంటూరు: 11 ఏప్రిల్ 2013:  తెనాలి ఘటనలపై ముఖ్యమంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు స్పందించకపోవడం బాధాకరమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. హత్యకు గురైన సునీల కుటుంబాన్ని ఆదుకునేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సాయంత్రంలోగా స్పందించాలని ఆయన గురువారం డిమాండ్ చేశారు. తెనాలిలో మంగళవారం సునీల తన కుమార్తెతో కలసి రోడ్డుపై నడిచి వెళ్తున్న సమయంలో కొందరు ఈవ్ టీజింగ్ కు పాల్పడి ఆమె కుమార్తెను వేధించారు. ఆ ఆకృత్యాన్ని అడ్డుకున్న సునీలను దుండగులు ఎదురుగా వస్తున్న లారీ కిందకు తోసి వేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దారుణ సంఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి. బుధవారం సునీల అంత్యక్రియల సమయంలో ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాల ఆందోళనలతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలపై సీఎం ఇంతవరకూ స్పందించకపోవడాన్ని వైయస్ఆర్ సీపీ తీవ్రంగా నిరసించింది.

Back to Top