రాష్ట్ర విభజనను అడ్డుకోండి: జగన్

హైదరాబాద్ :

సహేతుకమైన ప్రాతిపది‌క ఏదీ లేకుండా ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ త‌న సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని అడ్డగోలుగా ముక్కలు చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విభజన ప్రక్రియను తక్షణం నిలిపేయాలని విన్నవించారు. హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతిని శ్రీ జగన్‌ నేతృత్వంలో వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధి బృందం సోమవారం రాత్రి కలిసింది. ఈ సందర్భంగా నాయకులు రాష్ట్రపతికి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువా కప్పారు. అడ్డగోలుగా చేస్తున్న రాష్ట్ర విభజనను అడ్డుకోవాలంటూ ఆయనకు వినతిపత్రం అందజేశారు.

దేశవ్యాప్తంగా రాష్ట్రాల విభజనపై ఇప్పటివరకు అనుసరించిన సంప్రదాయాలు, రాజ్యాంగపరమైన విధివిధానాలు, పద్ధతులను ఆ వినతిపత్రంలో రాష్ట్రపతికి సోదాహరణగా శ్రీ జగన్ వివరించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే విషయంలో ఎలాంటి ప్రాతిపది‌కా లేకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విభజన ప్రక్రియను తక్షణం అడ్డుకుని, నిలిపివేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతికి అందజేసిన నివేదికలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పలు అంశాలను ప్రస్తావించింది.

నివేదికలోని ముఖ్యాంశాలు ఇవీ :‌

 • దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని కేంద్ర మంత్రిమండలి అక్టోబర్ 3న నిర్ణయం తీసుకుంది. ఇంతటి కీలక నిర్ణయాన్ని దేని ఆధారంగా తీసుకున్నారో స్పష్టం చేయలేదు. పైగా కమిటీలు, కమిషన్లు ఏర్పాటు చేసి, వాటి సిఫార్సు ఆధారంగానో... అసెంబ్లీ తీర్మానం ద్వారానో విభజించడం ‌లాంటి ముందు కాలపు సంప్రదాయాలు, విధివిధానాలనూ పాటించకుండా ఏకపక్షంగా విభజన నిర్ణయం జరిగింది.
 • రాష్ట్రపతి సూచన మేరకు, రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం కొత్త రాష్ట్రాలను కేంద్రం ఏర్పాటు చేసేలా పార్లమెంటుకు అధికారాలున్నా... మిగతా రాష్ట్రాల విభజనకు పాటించిన తరహాలో ఎలాంటి హేతుబద్ధతా, పారదర్శకతా ఎలా నిర్ణయం తీసుకుంటారు?
 • ఇప్పటిదాకా ఏర్పాటైన కొత్త రాష్ట్రాలన్నీ ఎస్సార్సీ నివేదిక, లేదా జేవీపీ కమిటీ, లేదా దార్ కమిటీ లేదా వాంచూ కమిటీ లేదా సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం తదితరాల ద్వారా ఏర్పాటైనవే.
 • ఆంధ్ర రాష్ట్ర విభజనలో మాత్రం కేంద్రం అలాంటి విధానమేదీ అనుసరించకపోగా, సమైక్యంగా ఉంచడమే అత్యుత్తమం అని చెప్పిన శ్రీకృష్ణ కమిటీ సిఫార్సును సైతం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది.
 • విభజనపై రాష్ట్ర శాసనసభ తీర్మానాన్ని ఎందుకు కోరడం లేదో కూడా కేంద్రం వివరించలేకపోతోంది
 • కొత్త రాష్ట్రం ఏర్పాటు నిర్ణయం విభజనకు గురయ్యే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదంతోనో, కమిషన్ గానీ కమిటీ గానీ వేసి దాని సిఫారసుల ఆధారంగానో జరగాలని సర్కారియా కమిష‌న్ 1988లోనే సిఫార్సు చేసింది
 • విభజన కోరుతూ సంబంధిత రాష్ట్రం నుంచి ప్రతిపాదన వస్తే తప్ప, ఆ రాష్ట్రంలోని ఏవో కొన్ని ప్రాంతీయ సమూహాలు, గ్రూపులు డిమాండ్ చేశాయనే కారణంగా విభజించరాదని పూంచీ కమిష‌న్ 2010లో సిఫార్సు చేసింది
 • విభజన కోరుతూ సంబంధిత రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేస్తేనే దాన్ని పరిశీలించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించిందని 2000 ఆగస్టు ఒకటిన విదర్భ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అప్పటి కేంద్ర హోం మంత్రి ఎ‌ల్‌కే అద్వానీ పార్లమెంట్‌లోనే తెలిపారు
 • 2009 డిసెంబర్ 9 న అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం తెలంగాణ అంశంపై ప్రకటన చేసినప్పుడు కూడా ఆ మేరకు అసెంబ్లీలో అవసరమైన తీర్మానం చేస్తారని స్పష్టంగా చెప్పారు
 • లోక్‌సభ స్పీకర్ మీరాకుమా‌ర్ నేతృత్వంలో 2010 ఫిబ్రవరి 3, 4 తేదీల్లో దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల శాసనసభల ప్రిసైడింగ్ అధికారుల 74వ సమావేశం కూడా చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై ఒక తీర్మానం చేసింది. వాటి ఏర్పాటుకు ఒక కొలబద్ధ, జాతీయ దృక్పథ‌ం ఉండాలని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండవ ఎస్సార్సీ ఏర్పాటు ఆవశ్యకతను పరిశీలించాలని భావించింది.
 • దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా చిన్న రాష్ట్రాల డిమాండ్లు తలెత్తుతున్న నేపథ్యంలో వీటన్నింటికీ అత్యుత్తమ పరిష్కారం రెండవ ఎస్సార్సీ ఏర్పాటే అని 2004 కు ముందు పీసీసీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా పేర్కొంది
 • తెలంగాణ అంశంపై 2009లో కె.రోశయ్య నేతృత్వంలో ఉభయ సభల సభ్యులతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. దాని నివేదిక అందాల్సి ఉందని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రస్తావించింది.
 • ఇప్పటి వరకూ జరిగిన 28 రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియలోనూ కొన్ని సంప్రదాయాలను, ప్రమాణాలను కేంద్రం ప్రాతిపదికగా తీసుకున్నట్టు పై అంశాలన్నీ స్పష్టం చేస్తున్నాయి.
 • 371 (డి) అధికరణం అమల్లో ఉండగా, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా విభజన బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే అది రాజ్యాంగపరంగా సరైన చర్య అసలే కాబోదు. రాష్ట్రాన్ని విభజించాలని భావిస్తే, 32వ సవరణ ద్వారా 1973లో రాజ్యాంగంలో చేర్చిన 371 (డి)ని తొలగించడమో, రెండు రాష్ట్రాలకు వర్తించేలా చేయడమో జరగాలి. ఈ రెంటిలో దేనికైనా 368వ అధికరణం ప్రకారం రాజ్యాంగ సవరణ, అందుకు పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ తప్పనిసరి.
 • విభజనపై కేంద్రం తీసుకున్న ఏకపక్ష, నిరంకుశ వైఖరి ఒక చెడు సంప్రదాయానికి తెర తీస్తోంది. ఇది దేశ సమాఖ్య స్ఫూర్తికే మరణ శాసనం కాగలదు. ఒక పార్టీ తనకు లోక్‌సభలో 272 మంది, రాజ్యసభలో 126 మంది సభ్యుల మద్దతు ఉందంటూ కేంద్రంలో పెత్తనం చెలాయిస్తూ, రాజకీయ స్వ ప్రయోజనాల కోసం అన్ని రాష్ట్రాల సరిహద్దులనూ మార్చాలని చూస్తే అది కచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం!

 
ప్రణబ్ పరిశీలిస్తామన్నారు: మైసూరా‌రెడ్డి
శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసిన వైయస్ఆర్‌ కాంగ్రెస్ ప్రతినిధి బృందంలో ఎంపీలు మేకపాటి రాజమోహ‌న్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మైసూరారెడ్డి, సోమయాజులు, మాజీ ఎంపీ బాలశౌరి, సీఈసీ సభ్యుడు కోన రఘుపతి ఉన్నారు. అనంతరం మైసూరా, సోమయాజులు రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు.

‌విభజన నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకునేలా, తుపాను, భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్న తమ విజ్ఞప్తిని పరిశీలిస్తామని రాష్ట్రపతి చెప్పినట్టు మైసూరారెడ్డి, సోమయాజులు వివరించారు. ‘ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ విభజనకు కూడా ప్రాతిపదిక ఉందని, కానీ అలాంటిదేమీ లేకుండా రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిందని రాష్ట్రపతికి వివరించాం. కనీసం అసెంబ్లీ నుంచి తీర్మానం కూడా తీసుకోలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లాం. మేం చెప్పినవన్నీ ఆయన సావధానంగా విన్నారు. మా వినతిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు’ అని వివరించారు.

Back to Top