హైదరాబాద్, 21 డిసెంబర్ 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారంనాడు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కూడా శ్రీ జగన్ జన్మదినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పేదలకు దుప్పట్లు, వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. బాణాసంచా కాల్చి తమ హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఆస్పత్రులలోని రోగులకు పండ్లు పంచిపెట్టారు.
శ్రీ జగన్మోహన్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది. పార్టీ నాయకులు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ ఐటీ విభాగానికి చెందిన ఉద్యోగులు 20 మంది నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం చెక్కులను పార్టీ సీజీసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. పార్టీ కార్యాలయాన్ని పువ్వులతో సుందరంగా తీర్చిదిద్దారు. పార్టీ నాయకులు బి. జనక్ ప్రసాద్, వాసిరెడ్డి పద్మ, నల్లా సూర్యప్రకాశ్, మధుసూదన్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, ఐటీ విభాగం సభ్యులు పలువురు కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలకు పునరంకితం అవుతామని వారంతా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి, బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గట్టు రామచంద్రరావు మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేయడమే శ్రీ జగన్‌కు ఇచ్చే పుట్టినరోజు కానుకగా ప్రతి కార్యకర్తా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగుజాతి బలహీనం కాకూడదనే లక్ష్యంతో పోరాడుతున్న ఏకైక నాయకుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి అని ఆయన అభివర్ణించారు. శ్రీ వైయస్ జగన్ లేవనెత్తిన ప్రతి అంశమూ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న వైనాన్ని ఈ సందర్భంగా గట్టు గుర్తుచేశారు.
ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కూడా శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి యువతకు ప్రతీకగా నిలుస్తారని ఈ సందర్భంగా చందా లింగయ్యదొర అభివర్ణించారు. శ్రీ జగన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే వారికి భవిష్యత్తు శూన్యం అవడం ఖాయమన్నారు.
అనంతపురం జిల్లా కదిరిలోని పూల వ్యాపారులు వేమారెడ్డి సర్కిల్ వద్ద శ్రీ జగన్మోహన్‌రెడ్డి జగన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. విశాఖపట్నంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. పేదలు, వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు.
వైయస్ఆర్ జిల్లా కడపలో పలు చోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ పులివెందుల సమన్వయకర్త వైయస్ అవినాశ్‌రెడ్డి ఉదయం పార్టీ కార్యాలయంలో కేక్ కట్‌చేశారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌లో వికలాంగులకు ఉపకరణాలు అందజేశారు.