'నగరి'లో నేడు జగన్‌ సమైక్య శంఖారావం

హైదరాబాద్:

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సమైక్య శంఖారావం 4వ విడత యాత్ర పునః ప్రారంభం అవుతుంది. సోమవారం ఉదయం శ్రీ వైయ‌స్ జగ‌న్ హైదరాబా‌ద్ నుంచి విమానంలో తిరుపతి చేరుకుంటార‌ని పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. నిజానికి ఈ విడత ఓదార్పు, సమైక్య శంఖారావం యాత్ర  ఈ నెల 17 నుంచే ప్రారంభం కావాల్సి ఉంది. అయితే శ్రీ జగన్మోహన్‌రెడ్డికి తీవ్రమైన మెడనొప్పి రావడంతో వైద్యుల సూచన మేరకు మూడు రోజులు వాయిదా వేసుకున్నారు.

శ్రీ జగన్‌ రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో నగరి నియోజకవర్గంలో సమైక్య శంఖారావం కొనసాగిస్తారని రఘురాం తెలిపారు. కేఎల్‌ఎం సర్కిల్, గాజులమండ్యం, అతూరు, పుడి, కాయంలలో పర్యటిస్తూ బ్రాహ్మణపట్టెడలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. తరువాత పత్తిపుత్తూరులో కూడా వైయస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. అక్కడి నుంచి అప్పలాయగుంట, తిరుమన్యం, గొల్లకండ్రిగ, వడమాలపేట, తడుకులలో సమైక్య శంఖారావం యాత్ర చేస్తారన్నారు. పుత్తూరులో జరిగే బహిరంగసభలో శ్రీ జగన్‌ ప్రసంగిస్తారని రఘురాం వెల్లడించారు.

Back to Top