<strong>హైదరాబాద్, 8 అక్టోబర్ 2013:</strong> సమైక్యాంధ్ర డిమాండ్‌తో నాలుగు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోగ్యం మంగళవానం రాత్రికి బాగా క్షీణించింది. మంగళవారం రాత్రి శ్రీ జగన్‌కు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పరీక్షలు చేశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారని, బాగా నీరసించిపోయారని, గొంతు కూడా ఏమాత్రం సహకరించటంలేదని ఉస్మానియా ఆస్పత్రి అదనపు మెడికల్ సూపరింటెండెంట్ రంగనాథ్ తెలిపారు.<br/>శ్రీ జగన్మోహన్‌రెడ్డి శరీరంలోని చక్కెర స్థాయిలు క్రమేపీ తగ్గుతున్నాయని వైద్యులు పేర్కొన్నారు. చక్కెర స్థాయిలు 58కి పడిపోయాయి. బీపీ 130/80, పల్సురేట్ 70గా ఉన్నాయి. నెల రోజుల వ్యవధిలో రెండవసారి నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండడంతో శ్రీ జగన్ ఆరోగ్యం త్వరగా క్షీణిస్తున్నదని వైద్యులు విశ్లేషించారు.<br/>శ్రీ జగన్మోహన్‌రెడ్డి మూత్రంలో కీటోన్ బాడీస్ ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని డాక్టర్ రంగనాథ్ వెల్లడించారు. అందువల్ల వెంటనే శ్రీ జగన్‌ను ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయాలని చెప్పారు. శ్రీ జగన్ ఇలాగే దీక్ష కొనసాగిస్తే శరీరంలోని అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని, కిడ్నీలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉందని, అందువల్ల ఆయన వెంటనే ప్లూయిడ్సు తీసుకోవాలని వివరించారు. శ్రీ జగన్ ఆరోగ్య పరిస్థితిపై నివేదికను పోలీసు అధికారులకు డాక్టర్లు అందజేశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి నడుంనొప్పితో కూడా బాధపడుతున్నారు.<br/>మరో వైపున తన ఆరోగ్యం క్షిణిస్తున్నా లెక్కచేయకుండా శ్రీ జగన్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. తనకు సంఘీభావం తెలిపేందుకు రాష్టం నలుమూలల నుంచి వచ్చిన అభిమానులను చిరునవ్వుతో పలకరిస్తున్నారు. జగన్ను కలిసి పలువురు నాయకులు మద్దతు తెలిపారు.