అగమ్యగోచరంగా '108' ఉద్యోగులు

హైదరాబాద్  21 జూన్  2013:

108 సర్వీసుతో అత్యవసర సమయాలలో ప్రాణాలు కాపాడడానికి కృషి చేస్తున్న ఉద్యోగుల భవితవ్యం ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆందోళన వ్యక్తంచేశారు. వారు సమస్యల చట్రంలో ఇరుక్కున్నారని ఆమె పేర్కొన్నారు. అనేక పర్యాయాలను తమ సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయిందనీ, పైగా అక్రమ కేసులు బనాయించడం, సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం, విధులను నిలిపేయడం, తదితర వేధింపులు కూడా వారు ఎదుర్కొంటున్నారని తన దృష్టికి వచ్చినట్లు విజయమ్మ పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, వారి జీతభత్యాలు ఏమాత్రం పెరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. 2011లో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరుతో కుదిరిన ఒప్పందం అమలుకు నోచలేదనీ, ఇప్పటికైనా వారి వేతనాలను హేతుబద్ధంగా పెంచాలని కోరుతూ శ్రీమతి విజయమ్మ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. వారిపై వేధింపులను నిలిపివేసి, సస్పెన్షన్లను ఎత్తేయాలనీ, విధుల్లోకి తీసుకోవాలనీ ఆమె విజ్ఞప్తిచేశారు.

Back to Top