అధికారంలోకి వస్తే 'పెన్‌గంగ' పూర్తిచేస్తాం

ఆదిలాబాద్, 20 జూలై 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పెన్‌గంగ ప్రాజెక్టును పూర్తిచేస్తామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ హామీ ఇచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లాలో వరద ముంపునకు పంటలు పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వరద బాధితులకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా వచ్చిన వరదతో ముంపునకు గురైన ప్రాంతాలలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ శనివారం పర్యటించారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి ఆమె నేరుగా ఆదిలాబాద్‌ జిల్లాకు చేరుకున్నారు. జైనథ్‌ మండలంలో మారుమూల గ్రామమైన పెండల్‌వాడలో వరద బాధితులను శ్రీమతి విజయమ్మ పరామర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలోనే కాకుండా ఎగువన మహారాష్ట్రలో కూడా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ప్రాణహిత, పెన్‌గంగ నదులు పొంగి ప్రవహించడంతో సుమారు 40 వేల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. పంటలు నీటమునిగి కుళ్ళిపోయాయి. జిల్లాలోని జైనథ్‌ మండలం పెండల్‌వాడలో పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. దీంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. దీనితో శ్రీమతి విజయమ్మ వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా రైతులు శ్రీమతి విజయమ్మకు తమ కష్టాలు చెప్పుకుని ఆవేద వ్యక్తంచేశారు. వర్షాల కారణంగా కుళ్ళిపోయిన పత్తి పంటను ఆమెకు చూపించి విలపించారు. తమను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని వారు వాపోయారు. శ్రీమతి విజయమ్మతో పాటు పార్టీ నాయకులు కొండా సురేఖ, బి. జనక్‌ ప్రసాద్‌, కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ ఎం.పి. అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, కొండా ఉన్నారు.

అంతకు ముందు జిల్లా పర్యటనకు వచ్చిన శ్రీమతి విజయమ్మకు సోన్‌ వద్ద వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

తాజా వీడియోలు

Back to Top