దొంగ పార్టీలకు బుద్ధి చెప్పండి

కొత్తకోట (విశాఖ జిల్లా),

27 జూన్‌ 2013: దొంగ టిడిపి, దొంగ కాంగ్రెస్‌ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రజలకు శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. ఆ రెండు పార్టీలకూ ప్రజలంతా బుద్ధి చెప్పిన రోజున, జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం వస్తుందని శ్రీమతి షర్మిల అన్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా టిడిపి, కాంగ్రెస్‌లకు గుణపాఠం చెప్పి, జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తిచేశారు. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం కొత్తకోటలో గురువారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

'కొత్తకోట గ్రామ ప్రజలకు, తన సభకు చేరవచ్చిన ప్రతి ఒక్కరికీ మీ రాజన్న కూతురు, మీ జగనన్న చెల్లెలు మనస్ఫూర్తిగా నమస్కరిస్తోంది' అంటూ శ్రీమతి షర్మిల కొత్తకోట సభలో ప్రసంగం ప్రారంభించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలూ మన రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉందో మనందరికీ తెలుసు అన్నారు. రైతుకు ప్రతి విషయంలోనూ రాజశేఖరరెడ్డి అండగా నిలబడ్డారన్నారు. వ్యవసాయానికి నీళ్ళిచ్చారు.. ఉచితంగా ఏడు గంటల విద్యుత్‌ ఇచ్చారన్నారు. మద్దతు ధర, అవసరమైనప్పుడు ఇన్‌పుట్ సబ్సిడీ,  పంటలు పోయినప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చారన్నారు. ప్రతి ఎకరాకూ సాగునీళ్ళివ్వడానికి ఎన్నో ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. వ్యవసాయాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. విశాఖ జిల్లాలోని సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతంలోని ఎన్నో లక్షల ఎకరాలకు నీళ్ళివ్వాలనుకున్నారని చెప్పారు. ఆయన అకాల మరణంతో ఈ ప్రాజెక్టు పనులు కూడా అటకెక్కాయని ఆమె విచారం వ్యక్తంచేశారు.

వైయస్‌ కన్నా ముందు సిఎంగా ఉన్న చంద్రబాబు మహిళలు, రైతులకు రూపాయి వడ్డీకి రుణాలిచ్చేవారని, మహానేత ముఖ్యమంత్రి అయిన తరువాత పావలా వడ్డీకే రుణాలు అందజేశారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ముందెన్నడూ బ్యాంకు ముఖం కూడా చూసి ఎరుగని మహిళలు పావలా వడ్డీ రుణాలు తీసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించారని చెప్పారు.

పేదరికం అనే ఊబి నుంచి బయటపడాలంటే ప్రతి కుటుంబమూ ఉన్నత విద్య చదవడం ఒక్కటే మార్గమని రాజశేఖరరెడ్డి భావించారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలోనూ పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేసే బిడ్డలు ఉండాలని ఫీజు రీయింబర్సుమెంటు పథకం తెచ్చారని చెప్పారు. ఆ పథకం వల్ల లక్షలాది మంది ఉన్నత విద్యను ఉచితంగా చదువుకుని ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. పేదలకు కూడా కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించేందుకు ఆరోగ్యశ్రీ తీసుకువచ్చారు. లక్షల విలువైన వైద్య సేవలను మన రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుపేదలు కూడా ఉచితంగా పొందారన్నారు. ఆపదలో ఉన్న వారు ఫోన్‌ చేసిన 20 నిమిషాలకే వచ్చి వాలిపోయే 108 వాహనాలను వైయస్‌ఆర్ ప్రవేశపెట్టారన్నారు.‌ 104, అభయ హస్తం, ఉపాధి హామీ లాంటి పథకాలను ఆయన అద్భుతంగా అమలుచేసి చూపించారన్నారు. చంద్రబాబు హయాంలో 16 లక్షల పింఛన్లు ఇస్తే.. వైయస్ 71‌ లక్షల మందికి ఇచ్చిన పెద్ద మనసున్న మనిషి వైయస్‌ అన్నారు.

ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూడా రాజశేఖరరెడ్డి ఒక్క రూపాయి కూడా చార్జీలు, ధరలు పెంచాలనుకోలేదు, పెంచలేదని శ్రీమతి షర్మిల అన్నారు. రాజశేఖరరెడ్డి ఒక్క రూపాయి కరెంటు చార్జీ పెంచారని ప్రతిపక్షాలు కూడా చెప్పే సాహసం చేయలేదన్నారు. గ్యాస్‌, విత్తనాలు, ఎరువుల ధరలు పెంచలేదన్నారు. ఆర్టీసీ చార్జీలు, మున్సిపల్‌ పన్నులు పెరగలేదని గుర్తుచేశారు. ఏ చార్జీలూ పెంచకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అని శ్రీమతి షర్మిల అభివర్ణించారు.

కానీ ఆ కాలం చెల్లిపోయిందని, ఇప్పుడున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం అని, కిరణ్‌రెడ్డి పాలనలో రైతులంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. కిరణ్‌ పాలనలో రైతులకు భరోసా లేదని, వ్యవసాయానికి నీళ్ళు లేవని, ఏడు గంటల ఉచిత విద్యుత్‌, మద్దతు ధర లేదని విచారం వ్యక్తంచేశారు. రైతులను ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి బతకడం కష్టంగా ఉందని మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని చెప్పారు. కరెంటు బిల్లులు చూస్తే షాక్‌ కొడుతున్నాయన్నారు. ఎరువుల ధరలు పెరిగిపోయాయని విచారం వ్యక్తంచేశారు.

కిరణ్‌ ప్రభుత్వం అంటే రైతులు, మహిళలు, విద్యార్థులకు భరోసా లేదు. కేవలం చంద్రబాబుకు మాత్రమే భరోసా ఉందని ఎద్దేవా చేశారు. అందుకే అవిశ్వాస తీర్మానం సమయంలో టిడిపి సభ్యులకు విప్‌ జారీ చేసి మరీ ఈ ప్రజా కంటక ప్రభుత్వాన్ని రక్షించారని దుయ్యబట్టారు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు. అయితే.. తన బాధ్యతను నిర్వర్తించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వానికే రక్షణ కవచంలా నిలబడ్డారని నిప్పులు చెరిగారు. అది ఇంకా అదికారంలో ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడే అన్నారు. ఈ ప్రభుత్వం పడిపోకుండా చంద్రబాబు కాపాడినందువల్లే ఇప్పుడు మనందరి మీద వేలాది కోట్ల రూపాయల భారాన్ని కిరణ్‌  ప్రభుత్వం వేసిందన్నారు.

రైతులు, పేదలను చంద్రబాబు పురుగుల్లా చూశారని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. వ్యవసాయం దండగ అన్నారని, ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలు వేసి చూపించారని శ్రీమతి షర్మిల విమర్శించారు. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వకూడదన్నారని, విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇవ్వకపోగా లాఠీలతో కొట్టించారని గుర్తుచేశారు. గ్యాస్‌ ధరను పెంచేశారన్నారు. రూ.50 ఉన్న విద్యుత్‌ హార్సుపవర్‌ ధరను రూ. 625 చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరి నడ్డీ ఆయన విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇంతగా హింసించిన చంద్రబాబు మళ్ళీ తనకు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్నే కాదు దేశాన్నే గాడిలో పెడతానని చెబుతూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పేనుకు పెత్తనం ఇస్తే.. అంతా గొరిగేసిందన్న సామెత చంద్రబాబుకు సరిపోతుందన్నారు. ఆయనకు అధికారం ఇస్తే ఇక మన రాష్ట్రం పరిస్థితి అధోగతే అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు కుమ్మక్కై, జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టి, సిబిఐని ఉసిగొల్పి జైలులో పెట్టించారని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. దేవుడు మంచివాళ్ళ పక్షాన నిలబడతాడని జగనన్నను త్వరలోనే బయటికి తీసుకువస్తాడని శ్రీమతి షర్మిల ఆశాభావం వ్యక్తంచేశారు. జైలులో ఉన్నా జగనన్న ధైర్యంగా ఉన్నారు. బోనులో ఉన్నా సింహం సింహమే. జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యం వచ్చాక రాజశేఖరరెడ్డి కన్న ప్రతి కలనూ నెరవేరుస్తారని చెప్పారు. జగనన్న సిఎం అయ్యాక రైతులు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారన్నారు. ఇద్దరు పిల్లలను చదివించేందుకు నెల నెలా తల్లి ఖాతాలో డబ్బులు జమచేస్తారన్నారు. ప్రతి తల్లీ తమ బిడ్డలను తామే చదివించుకుంటున్నామని గర్వంగా చెప్పుకుంటారన్నారు. ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు ఉండాలన్న రాజన్న ఆశయాన్ని జగనన్న పూర్తిచేస్తారని హామీ ఇచ్చారు. పంటలకు రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారన్నారు.

అనంతరం ఇదే వేదిక మీద పలువురు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారందరికీ శ్రీమతి షర్మిల పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Back to Top