తెలంగాణ జనం రుణం తీర్చుకుంటాం

సంగారెడ్డి:

తెలంగాణ ప్రజలు‌ మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డికి తమ గుండెల్లో చోటిచ్చారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. అందుకు వైయస్ కుటుంబం ‌ తెలంగాణ ప్రజలకు రుణపడి ఉందన్నారు. ఆ రుణం తీర్చుకోవడానికే మీ ముందుకు వస్తున్నామన్నారు. ఎంత కష్టం.. నష్టం వచ్చినా.. పోరాడుతోంది మీ రుణం తీర్చుకోవడానికే అని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. మీ రుణం తీర్చుకునే అవకాశం తమకు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లాలో‌ ఆమె సోమవారం విస్తృతంగా పర్యటించారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి మొదలైన యాత్ర పటా‌న్‌చెరు నియోజకవర్గం వరకు కొనసాగింది. నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్‌చెరు నియోజకవర్గ కేంద్రాల్లో భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

‘తెలంగాణ ప్రజల గుండెల్లో వైయస్ఆర్ చెరగని ముద్ర వేశారు. ఆ మహానేత మరణించినపుడు‌ ఆ బాధ తట్టుకోలేక తెలంగాణలోనే ఎక్కువ మంది గుండెలు ఆగిపోయాయి. తెలంగాణ బిడ్డలకు, వైయస్ఆర్‌కు చెరగని అనుబంధానికి ఇది గుర్తు. ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు అని ఇటీవల హెడ్‌లైన్సు టుడే నిర్వహించిన సర్వేలో తెలంగాణలోని 60 శాతం మంది వైయస్ఆర్ పేరే చెప్పారు. అంతలా వై‌యస్ఆర్ పేరును గుండెల్లో పెట్టుకున్నారు. మీ రుణం తీర్చుకునే అవకాశం మాకు ఇవ్వండి. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ఓటు వేసే ముందు మీ గుండెల్లో ఉన్న రాజన్నను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వై‌యస్ఆర్‌సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి. మీకు సేవ చేసే భాగ్యం ఇవ్వండి. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి’ అని‌ శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు.

పేదలకు 13 లక్షల ఎకరాలు పంచిపెట్టిన వైయస్ఆర్ :
పేదలకు 13 లక్షల ఎకరాల భూములను మహానేత వైయస్ఆర్ పంపిణీ చేశారని‌ శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకుని పరిపాలించిన నేత వైయస్ఆర్ అ‌న్నారు. తెలంగాణను, సీమాంధ్రను ఆయన వేరుచేసి ఎనాడూ చూడలేదని శ్రీమతి షర్మిల చెప్పారు. మహానేత వైయస్ఆర్ సీఎంగా ఉన్న ఐదేళ్లలో రైతులకు రుణ‌ మాఫీ, ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిల మాఫీ విషయంలో తెలంగాణకే పెద్దపీట వేశారన్నారు. వై‌యస్ఆర్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పాదయాత్ర మొదలుపెట్టింది తెలంగాణలోనే అన్నారు. 108, ఆరోగ్యశ్రీ, 104, ఫీజు రీయింబర్సుమెంట్.. ఇలా ఎన్నో పథకాలను తెలంగాణలోనే ప్రారంభించి తెలంగాణ ప్రాంతం పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారని శ్రీమతి షర్మిల చెప్పారు.

జ‌నం కోసం ఒక్క రోజైనా పోరాడావా బాబూ ?:
‘ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఏనాడూ ప్రజల సమస్యలపై పోరాడలేదు. రైతులు, చేనేత, విద్యార్థులు, కార్మికుల పక్షాన నిలవలేదు. ఒక్క వైయస్ఆర్‌సీపీ మాత్రమే ప్రజల పక్షాన నిలిచింది. రాత్రనక, పగలనక జగనన్న మాత్రమే పేద విద్యార్థుల ఫీజుల కోసం వారం రోజుల పాటు మెతుకు ముట్టకుండా దీక్ష చేశారు. ప్రజల కోసం పదవిని వదులుకుని విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడ్డారు. చేయని నేరానికి జైలుకు వెళ్లారు. బోనులో ఉన్నా.. సింహం సింహమే అని నిరూపించుకున్నారు’ అని శ్రీమతి షర్మిల అన్నారు. మహానేత రాజన్న ఆశయం కోసం పుట్టిన వైయస్ఆర్‌సీపీతోనే పేదలకు అభివృద్ధి పథకాల అమలు సాధ్యం అవుతుందని శ్రీమతి షర్మిల స్పష్టం చేశారు.

‌ఈ పర్యటనలో శ్రీమతి షర్మిల వెంట వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మెదక్ లో‌క్‌సభ అభ్యర్థి ప్రభుగౌడ్, జహీరాబాద్ లో‌క్‌సభ అభ్యర్థి మహమ్మద్ మొహియొద్దీన్, పార్టీ జహీరాబా‌ద్ పార్లమెంటు ఎన్నికల పరిశీలకుడు జన‌క్ ప్రసాద్, వైయస్ఆర్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థులు అప్పారావు షెట్కార్, నల్లా సూర్యప్రకాశ్, గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సంజీవరావు, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top