సిబిఐ ఓ బ్లాక్‌మెయిల్‌ సంస్థ

సత్తుపల్లి (ఖమ్మం జిల్లా), 11 మే 2013: కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ స్వతంత్రంగా దర్యాప్తు చేసే సంస్థ కానే కాదని, ఒక బ్లాక్‌మెయిల్ సంస్థ అని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పెరట్లో పెంచుకునే పెంపుడు కుక్కలాంటిదని ఆమె నిప్పులు చెరిగారు. కేంద్రం ఎవరిని కరవమంటే వారిని కరిచి వస్తుందని విరుచుకుపడ్డారు. ఎవరిపై మొరగమంటే వారి మీద మొరుగుతుందన్నారు. మొరుగుతుండగానే ఇక చాలు ఆపు అంటే వెంటనే వెనక్కి వచ్చేస్తుందని ఎద్దేవా చేశారు. అలాంటి సిబిఐని దర్యాప్తు సంస్థ అనాలా? లేక కేంద్రప్రభుత్వం ఏది పలకమంటే అది పలికే చిలక అనాలా? లేకపోతే కేంద్రప్రభుత్వం ఉసిగొల్పే కుక్క అనాలా? అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 145వ రోజు పాదయాత్రను ఆమె శనివారంనాడు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చేశారు. ఈ సందర్భంగా సత్తుపల్లి బస్‌స్టాండ్‌ సెంటర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె సిబిఐ, చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరును తూర్పారపట్టారు. శ్రీమతి షర్మిల సభకు తరలి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో సత్తుపల్లి జనసంద్రంలా మారిపోయింది.

చంద్రబాబు నాయుడి కారణంగానే ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇన్ని కష్టాలు పడడానికి కారణం అని శ్రీమతి షర్మిల విమర్శించారు. ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిరంతరం దుమ్మెత్తిపోస్తున్న చంద్రబాబు అవకాశం వచ్చినప్పుడు దాన్ని అధికారం నుంచి దించేయకుండా వెన్నుదన్నుగా నిలవడం వల్లే అన్ని చార్జీలు పెరిగిపోయాయన్నారు. చంద్రబాబు మద్దతు కారణంగానే సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి రెచ్చిపోయి కరెంటు చార్జీలు పెంచేశారన్నారు. రాష్ట్ర ప్రజలపై వేల కోట్ల ఆర్థిక భారం వేసిన పాపంలో చంద్రబాబుకూ వాటా ఉందన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ సమయంలో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ప్రజల కష్టాలకు చంద్రబాబు పరోక్షంగా కారణమయ్యారని దుయ్యబట్టారు.‌ కాంగ్రెస్‌కు రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబును నాయకుడనాలా? ప్రతినాయకుడనాలా? అని శ్రీమతి షర్మిల నిలదీశారు. చిరంజీవి తన పార్టీని బహిరంగంగా కాంగ్రెస్‌కు అమ్మేస్తే చంద్రబాబు నాయుడు టిడిపిని తెరవెనుక అమ్మేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న చంద్రబాబు నాయుడిని నాయకుడనాలా? ఊసరవెల్లి అనాలా? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చిలెక్కలు చెప్పారని దుయ్యబట్టారు. ఉచిత పథకాలు ఇస్తే ప్రజలు సోమరిపోతులవుతారని చంద్రబాబు ఏ విధంగా ప్రజానాయకుడవుతారన్నారు. స్కాలర్‌షిప్‌లు అడిగిన పాపానికి విద్యార్థులను లాఠీలతో కొట్టించడమే కాక వారికి కనీసం మెస్‌ చార్జీలు కూడా పెంచని కఠినాత్ముడని అభివర్ణించారు. ఎనిమిదేళ్ళలో ఎనిమిది సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచేసి, వాటిని కట్టలేకపోయిన రైతులను తీవ్రంగా వేధించారని, చివరికి రైతు మహిళలను కూడా తీవ్రంగా వేధించిన వైనాన్ని శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. రైతుల తరఫున మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విద్యుత్‌ దీక్ష చేశారని, దీక్ష చివరి రోజున ఉద్యమించిన రైతులపై బషీర్‌బాగ్‌లో పోలీసు కాల్పులు జరిపించి ముగ్గురిని చంపించారని విమర్శించారు. ఆ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మహానేత వైయస్‌ నష్టపరిహారం అందించారని చెప్పారు.

రెండెకరాల చంద్రబాబుకు దేశం మొత్తంలో హెరిటేజ్‌ సంస్థలు ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. సింగపూర్, మలేసియాల్లో చంద్రబాబుకు ఆస్తులున్నాయని అన్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డున కోట్లాది విలువైన భూములను తన బినామీలకు కారుచౌకగా కట్టబెట్టేశారని నిప్పులు చెరిగారు. వేల కోట్ల విలువైన పరిశ్రమలను ముక్కలు చేసేసి తన తాబేదార్లకు అప్పగించారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీతో కలిసిపోయారని ఆరోపించారు.

జగనన్న బయట ఉంటే తమ దుకాణాలు మూసేసుకోవాలనే భయంతోనే కాంగ్రెస్, టిడిపి నాయకులు కుమ్మక్కై, కుట్రలు చేసి, సిబిఐని వాడుకుని, అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టించారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. వేయి చేతులున్న కాంగ్రెస్‌ను ఢీకొనడం తేలిక కాదని, సిబిఐని ఉసిగొల్పి అష్టకష్టాలూ పెడుతుందని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. కేంద్రంలో మద్దతు ఉపసంహరించుకున్న మరుక్షణం డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ ఇళ్ళు సంస్థలపైన సిబిఐని ఉసిగొల్పి దాడులు చేయించిన వైనాన్ని ఆమె ప్రస్తావించారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై ఇన్ని కేసులు ఎందుకు ఉన్నాయి? జగనన్నను ఎందుకు అరెస్టు చేశారన్న ప్రశ్నలకు గులాం నబీ ఆజాద్‌ సమాధానం చెప్పారన్నారు. కాంగ్రెస్‌ను వదిలిపెట్టిన కారణంగానే జగనన్న కష్టాలు పడుతున్నాడని, లేదంటే ఏ మంత్రో, ముఖ్యమంత్రో అయి ఉండేవారన్న గులాం నబీ ఆజాద్‌ వ్యాఖ్యలతోనే కాంగ్రెస్‌ తన ప్రత్యర్థులను ఎంతగా వేధిస్తుందో అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్‌ను జగనన్న వదిలేశారు కనుకే సిబిఐని, ఈడీని ఉసిగొల్పి అబద్ధపు కేసులు పెట్టారని విమర్శించారు.

మహానేత డాక్టర్‌ వైయస్‌ బ్రతికి ఉన్నప్పుడు ఏ కేసులూ లేవని, జగనన్న కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటికి వచ్చి, కాంగ్రెస్‌ను వదిలేసిన తరువాత.. అప్పటి వరకూ మంచి మనిషిగా ఉన్న మహానేత పేరును ఎఫ్‌ఐఆర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం నమోదు చేయించిందని శ్రీమతి షర్మిల ఆరోపించారు. ఆ తరువాతే శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీద కేసులు పెట్టారని తెలిపారు. సోనియా ఆదేశాల మేరకు శంకర్రావు అనే వ్యక్తి ఫిర్యాతు చేశారని, దానితో జగనన్నపై కేసులు పెట్టారని, అందుకు ప్రతిఫలంగా శంకర్రావుకు మంత్రి పదవి కూడా దక్కిందన్నారు. ఈ క్విడ్‌ ప్రో కో గురించి ఎవ్వరూ ఎందుకు మాట్లాడడంలేదని శ్రీమతి షర్మిల నిలదీశారు. జగనన్నకు సుప్రీంకోర్టు బెయిల్‌ నిరాకరించడం చాలా దురదృష్టకరం అన్నారు. ఇంకా ఎంతకాలం జగనన్నను జైలులోనే ఉంచుతారని ఆమె ప్రశ్నించారు.

నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయమని సుప్రీంకోర్టు చెబితే మరో ఐదు నిమిషాలకే సిబిఐ న్యాయవాది బయటికి వచ్చి అలాంటి గడువేదీ లేదని చెప్పడాన్ని శ్రీమతి షర్మిల తప్పుపట్టారు. అన్ని అంశాలకూ సంబంధించి ఒకే చార్జిషీట్‌ వేయమని గతంలో సుప్రీంకోర్టు చెబితే సిబిఐ ఆ విధంగా చేయలేదు. ఇది సుప్రీంకోర్టు ఆదేశాన్ని సిబిఐ ధిక్కరించడం కాదా? అని ఆమె ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఈ అన్ని విషయాలనూ పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు.

సాక్షులను జగనన్న ఏ ఒక్క రోజైనా ప్రభావితం చేయడానికి ప్రయత్నించారా? అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. జగనన్న పేరు ఉన్న చార్జిషీట్‌లోనే మంత్రుల పేర్లూ ఉన్నాయని, వారిని ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. సాధారణ ఎంపి సాక్షులను ప్రభావితం చేస్తారని సిబిఐ చెబుతోందని, అధికారం, అవకాశం ఉన్న మంత్రులు ఆ పని చేయరని సిబిఐ ఎలా నమ్ముతుందన్నారు. ఆ మంత్రులను ఎందుకు అరెస్టు చేయదని ప్రశ్నించారు.

గడచిన 20 రోజులుగా ఖమ్మం జిల్లాలో కొనసాగిన తన పాదయాత్రకు సహకరించిన, తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శ్రీమతి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారని, రాజన్న రాజ్యం దిశగా మనందరినీ నడిపిస్తారని ఆమె తెలిపారు. అంత వరకూ జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలవాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తిచేశారు.
Back to Top