సిబిఐకి రాజకీయాలు ఎందుకు?

నర్సాపురం, 27 మే 2013:

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగానే కాకుండా రాష్ట్ర ప్రజలకు కన్న తండ్రిలా నిలిచారని ఆయన తనయ, శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. ప్రతి వర్గం గురించి ఆయన ఆలోచన చేశారన్నారు. ఎన్నో పథకాలను అమలు చేసిన రాజశేఖరరెడ్డి ఒక్క రూపాయి కూడా చార్జీలు, ధరలు పెంచకుండానే, కొత్త పన్నులు వేయకుండానే పరిపాలన చేశారన్నారు. ప్రజలను మనస్ఫూర్తిగా ప్రేమించినందువల్లే అంత అద్భుతమైన పథకాలకు రూపకల్పన చేయగలిగారని చెప్పారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని ఆదర్శంగా ఉండి నిరూపించి చూపించారన్నారు. ఆ ఒక్క మనిషి వెళ్ళిపోయాక రాష్ట్రం అతలాకుతలం అయిపోయిందని ఆవేదన వ్యక్త చేశారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా 161వ రోజు సోమవారం శ్రీమతి షర్మిల పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా నర్సాపురం పట్టణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

ప్రతి తెలుగువాడు సంతోషంగా ఉండాలని మహానేత వైయస్ తపించార‌ని శ్రీమతి షర్మిల తెలిపారు. మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, కళకళలాడాలని ఎన్నో కలలు కన్నారన్నారు. ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చేందుకు గొప్ప గొప్ప ప్రాజెక్టులు తలపెట్టి మన రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌ చేయాలనుకున్నారని చెప్పారు. రైతులకు ఏడు గంటల విద్యుత్‌, ఉచిత విద్యుత్‌, మద్దతు ధర ఇచ్చారన్నారు. విద్యుత్‌ బకాయిలు మాఫీ చేశారని, రుణాల మీద ఉన్న వడ్డీని మాఫీ చేశారని గుర్తుచేశారు. మరోసారి రూ. 12 వేల కోట్లతో లక్షలాది మంది రైతులను రుణ విముక్తులను కూడా చేశారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. డాక్టర్‌ వైయస్‌ఆర్‌ సిఎం అయ్యాక రైతులు, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు అందించారన్నారు. ఆయన చేయూత కారణంగా అంతవరకూ ఏనాడూ బ్యాంకు ముఖం కూడా చూసి ఎరుగని మహిళలు రుణాలు తీసుకుని ఆర్థికంగా బలపడ్డారని గుర్తుచేశారు.

విద్యార్థుల గురించి నిజంగా వైయస్‌ తండ్రి స్థానంలో నిలిచి ఆలోచించారని శ్రీమతి షర్మిల పేర్కొన్నారు. విద్యార్థులు ఏది కావాలంటే అది చదువుకోమని, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుందని ఆయన భరోసా కల్పించారన్నారు. అందువల్లే లక్షలాది మంది విద్యార్థుల గొప్ప గొప్ప చదువులు చదివి మంచి స్థానాల్లో స్థిరపడ్డారన్నారు. పేదలకు కూడా కార్పొరేట్‌ వైద్యాన్ని ఉచితంగా అందించాలనే ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చారన్నారు. ఫోన్ చేసిన 20 నిమిషాలకే 108 వాహనం వచ్చేదన్నారు. మహానేత వైయస్‌ సిఎంగా ఉన్న ఐదేళ్ళలో దేశం మొత్తంలో 50 లక్షల పక్కా ఇళ్ళు కడితే ఒక్క మన రాష్ట్రంలోనే దాదాపు 50 లక్షల ఇళ్ళు కట్టించి చూపించారన్నారు.

చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు 16 లక్షల మందికి ఇస్తే.. వైయస్‌ఆర్‌ 71 లక్షల మందికి అందజేశారని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. అభియహస్తం, ఉపాధి హామీ ఇలా ఎన్నో పథకాలను ఆయన అద్భుతంగా చేసి చూపిచారన్నారు. ఇన్ని పథకాలు అమలు చేసి కూడా ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ళలో ఏ ఒక్క చార్జీని, ధరలను, పన్నులను పెంచలేదని చెప్పారు. రాష్ట్ర ప్రజలను మహానేత రాజశేఖరరెడ్డి మనస్ఫూర్తిగా ప్రేమించినందువల్లే అంత గొప్ప గొప్ప పథకాలు ఆయన గుండెల్లో నుంచి రూపుదిద్దుకున్నాయన్నారు. సిఎం అంటే ఇలా ఉండాలి, ప్రజలకు ఇలాంటి పనులు చేయాలని ఆయన మార్గదర్శిగా, ఆదర్శంగా నిలిచారన్నారు.

అందుకే ఆ ఒక్క మనిషి రాజన్న వెళ్ళిపోతే అంతవరకూ సుభిక్షంగా ఉన్న మన రాష్ట్రం ఒక్కసారిగా అతలాకుతలం అయిపోయిందని శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. రాజశేఖరరెడ్డి వెళ్ళిపోతే రాష్ట్రమంతా రోదించిందన్నారు. ఆయన మరణంతో వందలాది మంది గుండెలు పగిలి చనిపోయారంటే.. మన రాష్ట్ర ప్రజల గుండెల్లో ఆయన ఎంతగా స్థానం సంపాదించుకున్నారో లోకం అంతా చూసిందన్నారు. మహానేత వైయస్‌ వెళ్ళిపోతే అనాథ అయింది తమ కుటుంబం ఒక్కటే కాదని, రాష్ట్ర ప్రజలంతా అనాథలైపోయారని జగనన్న అర్థం చేసుకున్నారన్నారు. అందుకే జగమంత కుటుంబాన్ని నాన్న తనకు ఇచ్చారంటూ, రాష్ట్ర ప్రజలంతా తన కుటుంబమే అని భావించారన్నారు. మహానేత కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు తన జీవితాన్ని సమర్పిస్తానని జగనన్న తనకు తానే వాగ్దానం చేసుకున్నారని చెప్పారు. మహానేత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల కుటుంబాలకు అండగా నిలవాని జగనన్న అనుకున్నారన్నారు.

ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర చేపట్టారన్నారు. జగనన్న వస్తుంటే తన కుటుంబంలోని వ్యక్తి వస్తున్నట్లే రాష్ట్రం భావించింది. జగనన్నకు వస్తున్న జనాదరణ చూసి కాంగ్రెస్‌ అధిష్టానం సహించలేకపోయిందన్నారు. ఓదార్పు యాత్ర వద్దు అని ఆదేశించారన్నారు. మాట ఇచ్చాం ఇచ్చిన మాటను తప్పలేము అని ఎంతగా ప్రాధేయపడినా కాంగ్రెస్‌ అధిష్టానం అర్థం చేసుకోలేదన్నారు. ఓదార్పు యాత్రను ఆపడానికి ప్రతి ప్రయత్నమూ చేశారన్నారు. వైయస్‌ కుటుంబాన్ని వెలివేసినట్లు ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు. వైయస్‌ కుటుంబాన్ని అవమానించారన్నారు. పొగ పెట్టి కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటికి పంపారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నుంచి ఒకే ఒక్కడిగా వచ్చిన జగనన్నకు అశేష జనవాహిని అండగా నిలిచిన వైనాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు.

దాన్ని కూడా కాంగ్రెస్‌ పార్టీ ఓర్చుకోలేకపోయిందని శ్రీమతి షర్మిల విమర్శించారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ వారసుడిగా జగనన్న ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకుంటున్నారని చెప్పారు. రాజన్న రాజ్యం జగనన్నతో సాధ్యం అన్న నమ్మకం ప్రజల్లో కలిగిందన్నారు. దీనితో ఒక్కసారిగా చంద్రబాబు, కాంగ్రెస్‌ పార్టీ ఉలిక్కిపడ్డారని చెప్పారు. జగనన్న ఇలాగే కొనసాగితే కాంగ్రెస్‌, టిడిపిలు దుకాణాలు మూసేసుకోవాలని కుట్రలు పన్ని, అబద్ధపు కేసులు పెట్టి, సిబిఐని ప్రయోగించాయని ఆరోపించారు. జగనన్నను రాజకీయంగా, ఆర్థికంగా అణచివేయాలనుకున్నారని ఆరోపించారు. ఈ రోజు వరకూ జగనన్నను వేధిస్తూనే ఉన్నారన్నారు. కాంగ్రెస్‌, టిడిపిలు పెట్టించిన కేసుల్లో ఏమాత్రం నిజం ఉన్నా మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి బ్రతికి ఉన్నప్పుడే పెట్టేవారన్నారు. ఆ కేసుల్లో నిజం లేదు కనుకే జగనన్నను ఎలాగైనా అణచివేయాలనే దురుద్దేశంతోనే ఇప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.

గత ఏడాది మే నెల చివరి వారంలో ఉప ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనను ప్రజల నుంచి ఎలాగైనా దూరం చేయాలన్న ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్‌, టిడిపిలు కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టాయని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. అయితే, ఈ విషయాన్ని జగనన్న ముందుగానే పసిగట్టి తనను ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని ప్రజల మధ్యలోనే చెప్పిన వైనాన్ని గుర్తుచేశారు. సమన్లు ఇచ్చి అరెస్టు చేయకూడదని కోర్టు చెప్పినా సిబిఐ బేఖాతర్‌ చేసి జగనన్నను అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. జనం మధ్యన జగనన్న ఉండకూడదన్న ఏకైక లక్ష్యంతో సిబిఐ పనిచేస్తోందని ఆరోపించారు. చట్టాన్ని, న్యాయాన్ని అనుసరించి సిబిఐ పనిచేయడంలేదని శ్రీమతి షర్మిల ఆరోపించారు. అసలు సిబిఐకి రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. కుట్రలు చేసి, కేసులు పెట్టి జగనన్నను జనం మధ్య నుంచి తీసుకుపోయి సంవత్సరం పూర్తయిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఏ జనానికి తన జీవితాన్ని జగనన్న అంకితం చేశాడో ఆ జనం నుంచి దూరం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధర్మాన్ని, న్యాయాన్ని ఈ దుర్మార్గులు కాలరాశారన్నారు. వాళ్ళ కుట్రలు, అరాచకాలను దేవుడు చూస్తూనే ఉన్నాడని, వారి పని పట్టే రోజు త్వరలోనే వస్తుందన్న ధీమా వ్యక్తంచేశారు.

ఒక మాట ఇస్తే.. ఊపిరి ఉన్నంత వరకూ వెనుదిరగకూడదన్న లక్ష్యంతో జగనన్న ముందడుగు వేశారన్నారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత రైతులు పండించే పంటలకు ధరల స్థిరీకరణ కోసం రూ. 3 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తారన్నారు. రాజన్న రాజ్యంలో రాష్ట్రంలో ఏ ఒక్కరూ గుడిసెల్లో ఉండే అవకాశమే ఉండదన్నారు. ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యతను జగనన్న తీసుకుంటారని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. విద్యార్థులను బడికి పంపించే తల్లులకు వారి ఖాతాలోనే డబ్బులు నెలనెలా జమచేస్తారని చెప్పారు. వృద్ధులు, వితంతువులకు రూ. 700, వికలాంగులకు వెయ్యి రూపాయలు పింఛన్‌ అందిస్తారన్నారు. అంతవరకూ జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలపరచాలని శ్రీమతి షర్మిల విజ్ఞప్తి చేశారు.

శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిని సంవత్సర కాలంగా అక్రమంగా నిర్బంధించినందుకు సభ అనంతరం శ్రీమతి షర్మిలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సభకు హారజైన వారంతా కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top