షర్మిల వెంట ప్రభంజనంలా జనం

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ప్రభంజనంలా ప్రజలు కదులుతున్నారు. ఊళ్లకు ఊళ్లే కదులుతున్నాయంటే అతిశయోక్తి కాదు. చిన్నా... పెద్దా, ఆడా... మగా, పడుచు... ముసలి తేడా లేకుండా పరుగు పరుగున పనులు వదలి కలసి వస్తున్నారు. శ్రీమతి షర్మిలను అనుసరిస్తున్నారు.  మహానేత పథకాలతో లబ్ధిపొంది, ఆయన ఆశీస్సులతో ఉన్నత శిఖరాలకు చేరుకున్నవారు... ఇప్పుడు ఆయన కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. కొంతయినా ఆ రుణం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

గుంటూరు:

‘కన్నది నేనే అయినా ప్రాణం పోసింది మీరేనమ్మా’ ఇది ఓ తల్లి గుండెలోతుల్లోంచి వెలువడిన కృతజ్ఞత. ‘తండ్రి, భర్త లేకపోతే ఒక ఇల్లు ఎలా దిక్కులేనిదవుతుందో మహానేత డాక్టర్ వైయస్ మరణించాక  రాష్ట్రం అలా తయారైందమ్మా!’ ఇది మరో తల్లి ఆవేదన. ‘మహానేత వైయస్ ఉన్నప్పుడు రోజూ కూలికి వెళ్లి హాయిగా బతికాం. ఇప్పుడు పనులు లేవు. వెళ్లినా వంద రూపాయలకు మించి కూలీ లేదు.’ మరో వ్యవసాయకూలి కష్టం. ఏ గ్రామంలో చూసినా ఈ తరహా కథనాలే... రాజన్న ముద్దుబిడ్డ, శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిర్వహిస్తున్న మరో ప్రజాప్రస్థానంలో ఎదురైన సంఘటనలివి. యడ్లపాడు మండలంలో మంగళవారం ఆమె నిర్వహించిన కార్యక్రమాలకు ఊళ్లకు ఊళ్లే కదలి వచ్చాయి.

ఆమె రాకకోసం రహదారికి దూరంగా ఉన్న గ్రామస్థులంతా ఇళ్లకు తాళాలు వేసి వచ్చి ఆమెకు స్వాగతం పలికారు. రచ్చబండలో తాము పడుతున్న బాధలను షర్మిలకు వివరించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్  రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వ పథకాల ద్వారా పొందిన లబ్ధిని పేర్కొన్నారు. కదిలించిన బాధితుల కష్టాలు.. నరసరావుపేట రెడ్డి కాలనీకి చెందిన నారాయణమ్మ షర్మిల పాదయాత్ర వివరాలు తెలుసుకుని చిరుమామిళ్ల గ్రామానికి చేరుకుంది. మహానేత వైయస్ అమలుచేసిన ఆరోగ్యశ్రీ పథకం వలన తన కుమారుడు బతికాడని, ఆ కృతజ్ఞత తెలుపుకునేందుకు ఇక్కడికి వచ్చినట్టు ఆమె పేర్కొంటూ రెండు నిమిషాలపాటు చేసిన ప్రసంగం అందరినీ కన్నీళ్లు పెట్టించింది. కన్నది తానే అయినప్పటికీ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణం పోసింది మీరేకదమ్మా అంటూ ఆమె చేసిన ప్రసంగానికి షర్మిల కూడా భావోద్వేగానికి లోనయ్యారు. చిరుమామిళ్ల గ్రామంలో దివంగత వైయస్ విగ్రహాన్ని ఆవిష్కరించి షర్మిల ప్రసంగించారు.

పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మహానేత డాక్టర్ వైయస్ మృతి తరువాత  సంఘటనలను ప్రస్తావించారు. శ్రీ జగన్మోహన్‌ రెడ్డి పార్టీని స్థాపించడానికి గల కారణాలు, ఆశయాలను తెలిపారు. టూర్ షెడ్యూల్‌లో లేని ఆ గ్రామాన్ని రెండు రోజుల క్రితం శ్రీమతి షర్మిల పర్యటించలేకపోయారు. ఆ గ్రామస్థుల కోరిక మేరకు పర్యటించిన శ్రీమతి షర్మిలకు వారంతా బ్రహ్మరథం పట్టారు. సమీప గ్రామాల ప్రజలు కూడా అక్కడికి చేరుకుని షర్మిలను ఆత్మీయ అతిథిగా భావించారు. ఇంటి ఆడపడుచు మాదిరిగా నూతన వస్త్రాలను బహూకరించారు.

కిరణ్ సర్కారుపై మహిళల మండిపాటు..
మధ్యాహ్నం భోజన విరామం తరువాత సొలస గ్రామంలో జరిగిన రచ్చబండలో వివిధ వర్గాలు హాజరై తమ బాధలను షర్మిలకు వివరించారు. కరెంటు, తాగునీరు లేదని ఎవరికీ చెప్పినా ఫలితం ఉండటం లేదని పేర్కొన్నారు. ఇది రాక్షస రాజ్యం. ఈ ప్రభుత్వం పోవాలని వందకోట్ల దేవుళ్లను వేడుకుంటున్నామని మహిళలు వివరించారు. ఈ సందర్భంగా షర్మిల ప్రసంగిస్తూ వైఎస్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టడం లేదన్నారు. అంతకు ముందు దివంగత మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ గ్రామం దారి పొడువునా ప్రజలు శ్రీమతి షర్మిలకు బ్రహ్మరథం పట్టారు.

వ్యవసాయకూలీలు పనులు మానుకుని శ్రీమతి షర్మిలను చూసేందుకు, రచ్చబండలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా తరలివచ్చారు. దారి పొడవునా పూలతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఎస్సీ కాలనీలోని మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలకు అభివాదం తెలిపారు. అక్కడి నుంచి చెంఘీజ్‌ఖాన్‌పేట, కోట గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగింది. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న కోట గ్రాామంలో షర్మిలను చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

14.3 కిలోమీటర్లు సాగిన ఆమె పర్యటనలో ప్రారంభం నుంచి యాత్ర ముగిసే వరకు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రామాల్లోని పరిస్థితులు, వారి సమస్యలను షర్మిల తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, జిల్లా పార్టీ కన్వీనర్ మర్రి రాజశేఖర్, కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తేళ్ల సుబ్బారావు, ఎస్సీ, బీసీ విభాగాల కన్వీనర్లు బండారు సాయిబాబు, దేవెళ్ల రేవతి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కానూరు నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Back to Top