షర్మిలమ్మ కంట కన్నీరు!

సత్తెనపల్లి (గుంటూరు జిల్లా) : బిడ్డ కాలికి ముల్లు గుచ్చుకున్నా అమ్మ గుండె గుభిల్లుమంటుంది. కంట కన్నీళ్లు కారుస్తుంది. ఆనందంతో వారు కేరింతలు కొడితే ఆనందబాష్పాలు రాలుస్తుంది. అమ్మా, నాన్న లేని ఇద్దరు అనాథ బిడ్డల బాధలు వింటూ శ్రీమతి షర్మిల ఓ ‘అమ్మ’గా వెక్కివెక్కి ఏడ్చారు. ఆ పిల్లలను అక్కున చేర్చుకున్నారు.. అనురాగాన్ని పంచారు. ఆదరించి, అండగా నిలబడ్డారు. ఎంతకైనా ఆమె కూడా అమ్మే కదా! అమ్మ.. అమ్మే కదా!

గుంటూరు జిల్లా ధూళిపాళ్లకు సమీపంలోని భాగ్యనగర్ కాలనీలో‌ ఆదివారం శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాజేష్, మహే‌ష్‌ అనే చిన్నారులిద్దరూ మూడవ తరగతి చదువుతున్నారు. అనారోగ్యంతో వారి తల్లి చనిపోయింది. ఆరు నెలల క్రితమే తండ్రి కూడా మరణించాడు. కుటుంబంలో పెద్ద దిక్కు ఎవరూ లేకపోవడంతో వీరిద్దరూ అనాథలయ్యారు. దిక్కు తోచని స్థితిలో అమ్మమ్మ మరియమ్మ ఇంటికి చేరుకున్నారు.

అయితే, మరియమ్మకూ ఒంట్లో సత్తువ లేదు. పోషించే ఆర్థిక స్తోమతా ఆమెకు లేదు. ‘ఈ పిల్లలను సాకలేనమ్మా... సాయం చేయమ్మా..’ అని ఆ పిల్లల అమ్మమ్మ ప్రాధేయపడడంతో శ్రీమతి షర్మిల చలించిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. పిల్లలకు తాను అండగా నిలబడతానని, తన వెంట హైదరాబాద్ పంపిస్తే వాళ్లను చదివించి ప్రయోజకులను చేస్తానని ‌మరియమ్మకు శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు.
Back to Top