షర్మిల బక్రీద్ ప్రార్థనలపై విషప్రచారం

అనంతపురం

28 అక్టోబర్ 2012 : నమాజుకీ, దువాకీ తేడా తెలియనివారే షర్మిల బక్రీదు శుభాకాంక్షల విషయంలో అనవసర వివాదం లేవదీస్తున్నారని పలువురు ముస్లిం ప్రముఖులు విమర్శించారు. ఆదివారం బక్రీదు పర్వదినం సందర్భంగా షర్మిల షూస్ వేసుకుని నమాజ్ చేశారంటూ టిడిపి నాయకులు కొందరు విషప్రచారం చేస్తున్నారనీ, ఒక చానెల్‌లో దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని ముస్లిం నాయకుడు సాలార్ బాషా విమర్శించారు నిరసించారు. నిజానికి అక్కడ జరిగింది వేరని ఆయన వివరణ ఇచ్చారు. షర్మిల బక్రీదు సందర్భంగా ముస్లింసోదరులకు శుభాకాంక్షలు మాత్రమే తెలిపారని ఆయన చెప్పారు. అది దువా మాత్రమేనని ఆయన అన్నారు. సాధారణంగా అదా చేశాక, బయటకు వచ్చి శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీ అనీ, అప్పుడు పాదరక్షలు ధరించడంపై ఆంక్షలేవీ ఉండవనీ ఆయన చెప్పారు. వైయస్ఆర్ హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించారనీ, దాని వల్ల తమ పిల్లలు చదువుకుని ఉన్నతస్థానాలలోకి వెళ్లగలిగారనీ, దానికి కృతజ్ఞతగా షర్మిల పాదయాత్ర విజయవంతం కావాలంటూ తాము దువా చేశామనీ సాలార్ బాషా వివరించారు.
వైయస్ కుమారుడు జగన్ ముఖ్యమంత్రి కావాలని తామంతా కోరుకుంటున్నామనీ, అప్పుడు ముస్లిం మైనారిటీలకు మేలు జరుగుతుందంటూ నమ్ముతున్నామనీ ఆయన చెప్పారు. అందుకే ప్రార్థన చేశామనీ, దువా జరిగినప్పుడు షర్మిల కూడా ఆమీన్ అంటూ చేతులెత్తారనీ ఆయన వివరణ ఇచ్చారు.
పార్నపల్లి నుండి పాదయాత్రలో పాల్గొంటున్న తమను షర్మిల బక్రీద్ పర్వదినం సందర్భంగా ఆహ్వానించి, కూర్చోబెట్టి గౌరవించిందని, నిజానికి అక్కడ రచ్చబండలాగా కూర్చున్నామనీ ఆయన తెలిపారు. వాస్తవాలు ఇలా ఉండగా షర్మిల పాదరక్షలతో నమాజు చేసిందనీ, అపచారం జరిగిందనీ టిడిపివాళ్లు తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని సాలార్ బాషా విమర్శించారు. ఇది ముస్లింల మనోభావాలను దెబ్బ తీయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయమ్మ బైబిల్ చేత పట్టుకోవడంపై మొన్నటికి మొన్న వివాదం లేవదీసినవారే షర్మిల బక్రీద్ ప్రార్థనలను కూడా వివాదాస్పదం చేయజూస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇందుకు వాళ్ల దేవుని ఎదుట క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. ఇదివరకు టిడిపిలో ఉన్న ముస్లింలు కొందరు చంద్రబాబుకు ముస్లిం టోపీ పెట్టి సభలోనే ఖురాన్ చేతికి ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. నిజానికి అది అపచారమని సాలార్ బాషా వ్యాఖ్యానించారు.మరికొందరు ముస్లిం ముఖ్యులు కూడా షర్మిల బక్రీదు శుభాకాంక్షల విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

Back to Top