సీబీఐకి ఎందుకీ వివక్ష: షర్మిల

కొత్తగూడెం, 06 మే 2013:

సీబీఐ కేసుల విషయంలో ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయాన్ని పాటిస్తున్నారని శ్రీమతి షర్మిల మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆదివారం రాత్రి ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. కేంద్రంలో 2జీ స్పెక్ట్రమ్ కేసులో రాజా అనే కేంద్ర మంత్రి పేరు చార్జిషీటులో ఉంటే తప్పంతా ఆయనదే అన్నారు. ఆ కుంభకోణంలో ప్రధానమంత్రికి ఏ సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకున్నారన్నారు. మన రాష్ట్రంలో మాత్రం చార్జిషీట్‌లో ఉన్న మంత్రుల తప్పు లేదట. తప్పంతా అప్పటి ముఖ్యమంత్రిదే అని బుకాయిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలోనేమో.. చార్జిషీట్‌లో ఉన్న మంత్రిదే తప్పు.. ప్రధానమంత్రి తప్పులేదంటున్నారు. రాష్ట్రంలోనేమో.. చార్జిషీట్‌లో ఉన్న మంత్రులది తప్పులేదు.. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ఆర్‌దే తప్పంటున్నారు. కేంద్రంలో చార్జిషీట్‌లో ఉన్న మంత్రికి ఒక న్యాయం, రాష్ట్రంలో చార్జిషీట్‌లో ఉన్న మంత్రులకు ఇంకో న్యాయం. కేంద్రంలో ప్రధానికి ఒక న్యాయం, రాష్ట్రంలో సీఎంగా పనిచేసిన మహానేత డాక్టర్ వైయస్ఆర్‌కు ఇంకో న్యాయం. ఒక్కో చోట ఒక్కో న్యాయం.. ఒక్కొక్కరికీ ఒక్కొక్క న్యాయం. ఇదేనా ప్రజాస్వామ్యం..? అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. ఇలాంటి ద్వంద్వ వైఖరి అవలంబించడం ఎన్నో ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి పరాకాష్టన్నారు.

మహానేత మరణానంతరం ఆరోపణలు గుప్పిస్తున్నారు..

ప్రధానమంత్రి బొగ్గు శాఖ నిర్వహించినప్పుడు గనులను వేలం వేయకుండా ప్రైవేటు సంస్థలకు నేరుగా కట్టబెట్టడం  వల్ల ఖజానాకు రూ.2 లక్షల కోట్ల నష్టం వచ్చిందని కాగ్ చెప్పిన విషయాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు.  ప్రధాని నిర్దోషని కాంగ్రెస్ పార్టీ ఆయన్ను వెనుకేసుకొస్తోందన్నారు. రాష్ట్రంలో మాత్రం దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్  బతికి ఉన్నప్పుడు ఆరోపణలు చేయకుండా, ఆయన కన్నుమూసిన తర్వాత చేస్తున్నారన ఆవేదన వ్యక్తంచేశారు.  కనీసం సమాధానం చెప్పుకోవడానికి కూడా ఆయన రాలేరనే ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారన్నారు.  ప్రధాని వాళ్ల మనిషి కాబట్టి వెనుకేసుకొస్తున్నారని చెప్పారు.

రాజీవ్‌గాంధీగారు బతికున్నప్పుడు బోఫోర్సు కేసులో ఆయన పేరుంటే... ఆయన చనిపోయిన తర్వాత ఆ కేసు నుంచి ఆయన పేరును తొలగించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ఉదహరించారు.  కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటే ఒక న్యాయం.. వ్యతిరేకిస్తే ఇంకో న్యాయంలా ఉందని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేతుల్లో సీబీఐ, ఈడీ సంస్థలు కీలు బొమ్మలుగా మారిపోయాయన్నారు.

హిట్లర్ సిద్ధాంతమే బాబుది!

ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే నిజమైపోతుందన్నది హిట్లర్ సిద్ధాంతమనీ, అబద్ధాలను ప్రచారం చేయడానికి ఆయన గోబెల్సు అనే ఒక మంత్రిని ప్రత్యేకంగా పెట్టుకున్నాట్లుగానే చంద్రబాబు కూడా అదే పద్ధతి అనుసరిస్తారని శ్రీమతి షర్మిల తెలిపారు. ముందుగా చంద్రబాబు డెరైక్షన్‌లో టీడీపీ నాయకులు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ మీద, జగనన్న మీద ఆరోపణలు చేస్తారనీ, మరుసటి రోజున అదే ఆరోపణలను చంద్రబాబు అనుకూల ఎల్లో మీడియా ఈనాడు, దాని తోక పత్రిక కలిసి పతాక శీర్షికన ప్రచురిస్తాయనీ చెప్పారు. వీటినే కాంగ్రెస్ నాయకులు అందుకుంటారని పేర్కొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న సీబీఐ.. అదే పేపర్‌ను పట్టుకొని, అవే ఆరోపణతో చార్జిషీట్ వేస్తుందనీ, అవే ఆరోపణలను సీబీఐ, ఈడీ లాయర్లు పట్టుకొని వాదించి అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తారనీ వివరించారు. అందరూ కలిసి ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి అదే నిజమని నిరూపించే ప్రయత్నం చేస్తారన్నారు. ఈనాడుకు చెందిన రూ.100 షేర్‌ను రూ.5 లక్షలకు అమ్ముకుంటే సీబీఐకి ఏ అభ్యంతరం లేదు కానీ సాక్షికి చెందిన రూ.10 షేర్‌ను రూ.350 అమ్మితే దాన్ని ఈ సీబీఐ క్విడ్‌ప్రోకో అంటోందని ఎద్దేవా చేశారు. ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయకుండానే 11 నెలలుగా జగనన్నను జైల్లో పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

కావాలనే సీబీఐ జాప్యం చేస్తోంది..

అన్ని అభియోగాలు కలిపి ఆరు నెలల లోపు ఒకే చార్జిషీట్ వేయాలని సుప్రీంకోర్టు సీబీఐకి స్పష్టంగా చెప్పిన విషయాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. కోర్టు చెప్పిన ఆరు నెలల గడువు పూర్తయినా ఇంతవరకు అన్ని అభియోగాలు కలిపి ఒక చార్జిషీటుగా వేయలేదన్నారు. సీబీఐ కావాలనే జాప్యం చేస్తోందని ఆరోపించారు. జగనన్నను దోషని జైల్లో పెట్టలేదనీ, ఆయన మీద ఏ అభియోగం రుజువు కాలేదనీ కేవలం రిమాండ్ మీదనే జైల్లో పెట్టారనీ చెప్పారు. ఆయన బయటే ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారనే ఒకే కారణంతో 11 నెలలుగా జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న బయట ఉన్నప్పుడు ఒక్క సాక్షినైనా ప్రభావితం చేశారా? ఆ ప్రయత్నమైనా చేశారా? దీనిని మీరు నిరూపించగలరా అంటే సీబీఐ సమాధానం చెప్పలేదన్నారు. ఇదే సీబీఐ.. చార్జిషీట్‌లో ఉన్న మంత్రులను మాత్రం అరెస్టు చేయలేదన్నారు. సాక్షులను ప్రభావితం చేసే అధికారం, అవకాశం అధికారంలో ఉన్న మంత్రులకు ఉంటుందా? లేకుంటే సాధారణ ఎంపీగా ఉన్న జగనన్నకు ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం సీబీఐకి లేదని స్పష్టంచేశారు.

Back to Top