'సమైక్య' సభకు ప్రభుత్వోద్యోగుల మద్దతు

హైదరాబాద్, 23 అక్టోబర్ 2013:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరగనున్న సమైక్య శంఖారావం బహిరంగకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం బుధవారంనాడు మద్దతు ప్రకటించింది. సమైక్య రాష్ట్ర సాధనలో సమైక్య శంఖారావం తొలి అడుగు అని ఉద్యోగుల సంఘం అభివర్ణించింది. సమైక్యతను కోరుకునే ప్రతి ఒక్కరూ సమైక్య శంఖారావం సభకు హాజరు కావాలని ఉద్యోగుల సంఘం నాయకులు  కోరారు.

మరోవైపున సమైక్య శంఖారావం సభకు ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక బుధవారం సమావేశమై శ్రీ జగన్మోహన్‌రెడ్డి సభకు మద్దతు ప్రకటించింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న దృఢ సంకల్పంతో శ్రీ జగన్ నిర్వహిస్తున్న శంఖారావం సభ‌ను రాజకీయ దృష్టిలో కొందరు నాయకులు చూడటంపై విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

కాగా, ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఎల్‌బి స్టేడియంలో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. సభ నిర్వహణ కోసం జరుగుతున్న ఏర్పాట్లను వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకులు బుధవారం పర్యవేక్షించారు. సభా వేదిక నిర్మించే ప్రాంతాన్ని నాయకులు, పోలీసులు పరిశీలించారు. హైదరాబా‌ద్‌లో గతంలో ఎన్నడూ జరగని రీతిలో సమైక్య శంఖారావం సభను నిర్వహిస్తున్నట్టు పార్టీ కార్యక్రమాల కో ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌, సీఈసీ సభ్యుడు శివకుమార్ ‌తెలిపారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన సమైక్య శంఖారావానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.

Back to Top