'సహకార ఎన్నికల్లో వైయస్ రుణం తీర్చుకోవాలి'

పీలేరు (చిత్తూరు జిల్లా):

సహకార సంఘాలకు జరిగే ఎన్నికల్లో రైతులందరూ  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని ఆ పార్టీ యువనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎవరి ఒత్తిళ్లకూ భయపడకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో భాగస్వాములు కావాలని కోరారు. మహానేత తన హయాంలో రైతుల ఇబ్బందులను గుర్తించి రుణమాఫీ, ఏడు గంటల ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాల వంటి పలు పథకాలు ప్రవేశపెట్టి రైతులకు ఎంతో మేలు చేశారన్నారు. ఏదో ఒక రూపంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం లబ్ధి పొందిందన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి సహకార ఎన్నికల్లో రైతులందరూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహనరెడ్డి పక్షాన నిలబడి అందరినీ గెలిపించాలని కోరారు. జిల్లాలోని రైతులందరి సహకారంతో అన్ని మండలాల్లో సహకార పోరులో ఘనవిజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.

Back to Top