'రైతు సేవలో ముందుంటేనే పార్టీ మద్దతు'

ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా) : రైతు సేవలో ముందుండేవారికే సహకార సంఘాల ఎన్నికల్లో  వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మద్దతు ఇస్తుందని పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ‌స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి శనివారం తన నివాసంలో ఆళ్లగడ్డ, ఓబుళంపల్లె, చాగలమర్రి, శిరివెళ్ల, బోయలకుంట్ల సోసైటీల పరిధిలోని నాయకులతో చర్చించారు. ఒక్కొక్క సంఘంలోని 13 డెరైక్టర్ పదవులకు పోటీ చేస్తున్న వారిలో రైతులకు నిత్యం అందుబాటులో ఉన్నవారిని ఎంపిక చేసి వారి విజయానికి పార్టీ తరఫున సహకరిస్తామని‌ ఈ సందర్భంగా శోభానాగిరెడ్డి తెలిపారు.

ప్రస్తుతం వ్యవసాయానికి సంబంధించి సొసైటీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని, ఈ కారణంగా రైతులకు వీటి అవసరం ఎంతైనా ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సొసైటీ డెరైక్టర్‌లుగా బరిలో నిలిచే వ్యక్తులు రైతులకు సేవ చేసేవారై ఉండాలన్నారు. ఆయా సంఘాల పరిధిలో అలాంటి వ్యక్తులను ఎంపిక చేసి బరిలో నిలపాలని నాయకులకు సూచించారు. డెరైక్టర్లుగా అన్ని సంఘాల్లో మెజార్టీ సంఖ్యలో పార్టీ మద్దతుదారులు గెలిస్తే నియోజవర్గంలోని 14 సంఘాలకు చైర్మన్‌లుగా సమర్థులైన వారిని ఎన్నుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. తర్వాత కెడిసిసి చైర్మన్ ఎన్నికలో కూడా త‌గిన ప్రాతినిధ్యం కలుగుతుందని, ఆ దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Back to Top