రైతులను వేధించ వద్దు: కరుణ

మిర్యాలగూడ:

వినియోగ చార్జీల వసూళ్ల పేరుతో రైతులను ట్రాన్స్‌కో అధికారులు వేధించడం మానుకోవాలని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలు పాదూరి కరుణ విజ్ఞప్తిచేశారు. వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన రైతులతో కలిసి మిర్యాలగూడ ట్రాన్స్‌కో డీఈ కార్యాలయం ఎదుట వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పాదూరి కరుణ మాట్లాడుతూ 50 శాతం మంది రైతులు విద్యుత్తు బిల్లులు చెల్లించినా శెట్టిపాలెం ఫీడర్‌కు వ్యవసాయ విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపివేశారన్నారు. ఈ కారణంగా రబీ వరి నారుమళ్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  కేవలం రూ. 10 వేలు చెల్లించాల్సిన రైతులకు కూడా రూ. 40 వేల బిల్లు వేసి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు ఎక్కువగా వచ్చిన రైతులు అధికారులను కలిసి సరిచేసుకోవడానికి సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.  దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ నాడూ రైతులను ఇబ్బంది పెట్టలేదని గుర్తు చేశారు.

తాజా ఫోటోలు

Back to Top