రాయితీలు ఇవ్వనిది రైతు ప్రభుత్వమా!

హైదరాబాద్, 25 మార్చి 2013:

విద్యుత్తు కోతలతో ఎకరం కూడా ఎండిపోలేదని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించడం దారుణమని వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు. సీఎం సొంత నియోజకర్గంలోనే ఎండిపోయిన పంటలు చూపడానికి సిద్ధంగా ఉన్నామనీ, దీనిని ఆయన అంగీకరిస్తారా అని సవాలు చేశారు. ఇది గుడ్డి ప్రభుత్వమని ప్రజలందరికి తెలిసిందన్నారు. విద్యుత్తు రంగానికి తగ్గిపోతున్న రాయితీలను వారు గణాంక సహితంగా ప్రదర్శించారు. విద్యుత్తు రాయితీలు ఇవ్వకుండా చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. 2009-2010 సంవత్సరంలో నూరు శాతం విద్యుత్తు రాయితీలను ఇచ్చారని తెలిపారు. తరువాతి సంవత్సరం అంటే 2010-11లో రాయితీలు డెబ్బై శాతానికి దిగజారాయన్నారు. 2011-12లో 85శాతానికి తెచ్చారనీ, 2012-13లో అది 56శాతానికి దిగజారిందనీ, 2013-14లో 32.62 శాతం మాత్రమే రాయితీలు ఇచ్చారని వివరించారు. ఈ గణాంకాలను చూసిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని రైతుల ప్రభుత్వమనాలో వారే సమాధానం చెప్పుకోవాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.

Back to Top