శ్రీకాకుళం: చంద్రబాబు 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు సరికదా, కనీసం రాష్ట్రానికి ఒక్క మెడికల్ సీటు కూడా తేలేదని.. అస్సలు మెడికల్ కాలేజీలతో చంద్రబాబుకి సంబంధమే లేదని వైయస్ఆర్‌సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో కట్టించిన మెడికల్ కాలేజీలను తనవిగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు, దమ్ముంటే ఆయన సీఎంగా కట్టించిన కాలేజీల పేర్లు చెప్పాలని సవాల్ విసిరారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేయడం తప్ప, చంద్రబాబుకి సంపద సృష్టించడం చేతకాదని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబుకి అవకాశం దొరికితే మంగళగిరి ఎయిమ్స్‌ను కూడా అమ్మకానికి పెడతాడని చెప్పారు. విశాఖలో యోగా డే పేరుతో వృథాగా ఖర్చు చేసిన రూ.400 కోట్లతో ఒక మెడికల్ కాలేజీ పూర్తయ్యేదన్నారు. అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలతో వేల కోట్లు ఖర్చు చేసే బదులు రూ.4500 కోట్లతో మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయలేరా అని ప్రశ్నించారు. ప్రత్యేక విమానాలు, హెలిక్యాప్టర్లలో తిరుగుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు చేసే ఖర్చుతో మెడికల్ కాలేజీలు పూర్వయ్యేవి కావా అని నిలదీశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.... విద్య, వైద్యంపై ఏనాడు దృష్టి పెట్టలేదు రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థుల పట్ల చంద్రబాబుకి నిజంగా ప్రేమనేది ఉంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తామని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు తన పదిహేనేళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదంటే ప్రజావైద్యంపై ఆయనకున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమైపోతుంది. కానీ వైయస్ జగన్ కట్టించిన పాడేరు మెడికల్ కాలేజీకి 50 సీట్లు తానే తెప్పించానని చెప్పుకుంటున్నాడు. 2014 లో చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆరు రోజుల తర్వాత నెల్లూరు ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజీ జూన్ 15, 2014లో ఆపరేషన్‌లోకి వచ్చింది. ఆరు రోజుల్లోనే మెడికల్ కాలేజీ కట్టేసి ప్రారంభించినట్టు చంద్రబాబు తన ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారు. వాస్తవానికి దీన్ని నాటి దివంగత సీఎం వైయస్సార్ అనుమతులు తీసుకొచ్చి పనులు ప్రారంభించారు. దీంతోపాటు తిరుపతి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజీ 2014 ఆగస్టు 8లో ఆపరేషన్‌లోకి వస్తే దాన్ని కూడా చంద్రబాబే కట్టినట్టు టీడీపీ ప్రచారం చేసుకోవడం విడ్డూరం. చంద్రబాబుకి దమ్ముంటే పలానా డిస్ట్రిక్ట్ ఆస్పత్రిని మెడికల్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేశానని, ఫలానా కాలేజీకి అనుమతులు తీసుకొచ్చానని చెప్పగలరా? విశాఖలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ 1923లో, 1946లో గుంటూరు మెడికల్ కాలేజీ, 1958లో రంగరాయ మెడికల్ కాలేజీ-కాకినాడ, 1960లో శ్రీవేంకటేశ్వర మెడికల్ కాలేజీ-తిరుపతి, 1980లో విజయవాడ సిద్ధార్ధ మెడికల్ కాలేజీ, శ్రీకాకుళం, ఒంగోలు, కడప రిమ్స్ మెడికల్ కాలేజీలన దివంగత వైయస్సార్ ప్రారంభించారు. యోగా డే ఖర్చుతో ఒక మెడికల్ కాలేజీ పూర్తయ్యేది రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క మెడికల్ కాలేజీ నిర్మాణంతో కానీ, మెడికల్ సీట్లతో కానీ చంద్రబాబుకి సంబంధమే లేదు. వైయస్ జగన్ సీఎం అయ్యాక రూ. 8450 కోట్లతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే కాకుండా 2024 దిగిపోయేనాటికి ఐదు కాలేజీలను పూర్తి చేసి క్లాసులు ప్రారంభించారు. మిగిలిన కాలేజీల పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం వద్ద రూ. 4500 కోట్లు లేవన్న కారణంతో ప్రైవేటుపరం చేస్తున్నామని మంత్రులు చెప్పడం వారి చేతకానితనానికి నిదర్శనం. 15 నెలల్లో రూ. 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి రూ. 4500 కోట్లు ఖర్చు చేయలేరా? విశాఖలో యోగా డే పేరుతో చేసిన పబ్లిసిటీకి వెచ్చించిన రూ.400 కోట్లతో ఒక మెడికల్ కాలేజీ పూర్తయ్యేది. అమరావతిలో కేవలం వరద నివారణ కోసమే రూ. 6 వేల కోట్లతో ప్రణాళిక రూపొందించారు. కానీ మెడికల్ కాలేజీలు పూర్తిచేయాలని చంద్రబాబుకి అనిపించడం లేదు. అమరావతిలో వరద నీటిని తోడటానికి రూ.400 కోట్లు, తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు కోసం వేల కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు మళ్లీ శాశ్వత హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ పేరుతో పనులు మొదలు పెడుతున్నారు. తాత్కాలిక నిర్మాణాల కోసం అన్ని వేల కోట్లు తగలెయ్యగా లేనిది మెడికల్ కాలేజీకి కేవలం రూ.4500 కోట్లు వెచ్చించి ప్రజారోగ్యం కాపాడటానికి చంద్రబాబుకి మనసు రావడం లేదు. సీఎం చంద్రబాబు, మంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు ప్రత్యేక హెలికాఫ్టర్లు వాడుతున్నారు. జల్సాల కోసం వారు చేస్తున్న ఖర్చును కొంచెం తగ్గించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టలేరా? ప్రైవేటీకరణ మీద చంద్రబాబుకి ఎందుకింత మోజు? అవకాశం దొరికితే మంగళగిరి ఎయిమ్స్‌ను కూడా అమ్మేయగలడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడేమంటారు? వైయస్ఆర్‌సీపీ హయాంలో మెడికల్ కాలేజీలకు నిధుల కొరత ఉండకూదన్న ఉద్దేశంతో 50 శాతం సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద భర్తీ చేయాలని నిర్ణయిస్తే ఇదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు అంతెత్తున లేచారు. వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు జగన్ అంటూ ఈనాడులో భారీ వార్తలు రాశారు. ఈరోజు ఏకంగా 10 మెడికల్ కాలేజీలతోపాటు ఆరోగ్యశ్రీని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతుంటే ఈనాడుకి చంద్రబాబు నయా పెత్తందారుగా కనిపించడం లేదా? ప్రజల సొమ్మును చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు దారబోస్తుంటే ఆయన్ను విజనరీగా కీర్తిస్తారా? వైద్యాన్ని ప్రైవేటుపరం చేస్తే పేదలకు ఉచిత వైద్యం అందే పరిస్థితి ఉంటుందా? డాక్టర్ కావాలన్న పేద విద్యార్థుల కలలను చిదిమేయడం కాదా? ప్రైవేటీకరణ నిర్ణయాన్ని దేశమంతా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తుంటే ఇవన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతికి అద్భుతమైన నిర్ణయాలుగా కనిపిస్తున్నాయా? ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థులు ఎంత ఫీజు కట్టాల్సి ఉంటుందో చంద్రబాబుకి తెలియదా? గవర్నమెంట్ నిర్దేశించిన ఫీజు కాకుండా ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ల్యాబ్ ఫీజు, లైబర్రీ ఫీజు, యూనిఫాం, స్పెషల్ ఫీజు, కాషన్ డిపాజిట్, ఇంటర్నషిప్ ఫీజు, స్పోర్ట్స్ ఫండ్, కల్చరల్ ఫండ్, అదర్ మెయింటినెన్స్, హాస్టల్ కాషన్ డిపాజిట్ తదితర ఫీజుల పేరిట కోటి రూపాయలపైనే దోపిడీ చేస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదు? ఇదంతా చూశాక కూడా పీపీపీ మోడల్ వల్ల పేద విద్యార్థులకు నష్టం జరగదని చంద్రబాబు, ఆయన మంత్రులు చెప్పగలరా? ప్రైవేటీకరణపై పవన్ కళ్యాణ్ తన వైఖరిని ప్రకటించాలి మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే మంత్రులు అనిత, సవిత రాష్ట్ర ప్రజలను తప్పదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు. వైయస్ జగన్ 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించింది అబద్ధమే అయితే ఎన్ఓసీల కోసం నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ప్రభుత్వానికి లేఖలు రాయడం కూడా అబద్ధమేనా? పదే పదే ఎన్ఎంసీ లేఖలు రాస్తూ చంద్రబాబు వెంటపడినా ఆయన పట్టించుకోలేదు. వైయస్ జగన్ మీద కక్షతో పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తయినా సీట్లు వద్దని ఎన్ఎంసీకి లేఖ రాసిన దుర్మార్గుడు చంద్రబాబు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పవన్ కళ్యాన్ తన నిర్ణయాన్ని ప్రకటించాలి. చంద్రబాబు దారుణాలను దగ్గరుండి చూస్తున్న పవన్ కళ్యాన్, ఎన్నికలకు ముందు అన్నేసి గొప్పలు చెప్పి ఇప్పుడు మూగబోవడాన్ని రాష్ట్ర యవత సహించడం లేదు. చంద్రబాబు వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులతో వైయస్ఆర్‌సీపీ గొంతునొక్కాలని చూస్తున్నారు. ఇలాంటి నియంతృత్వ పోకడలతో ఎంతోమంది హేమాహేమీలు కాలగర్భంలో చరిత్రహీనులుగా మిగిలిపోయారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసే నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోదు. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతాం.