రావికంపాడులో మిన్నంటిన జగన్నినాదాలు

రావికంపాడు, 17 మే 2013:

ఎటు చూసినా జనం.. మిన్నంటిన ‘జై జగన్.. జైజై జగన్’ నినాదాలతో శ్రీమతి షర్మిల 150వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో సాగింది. అన్నివర్గాల ప్రజలు కదం తొక్కుతూ.. పదం పాడుతూ పాదయాత్రలో పోటెత్తారు. రైతుల వెన్నువిరిచి.. పన్నులతో సామాన్యుల జీవితాల్ని అతలాకుతలం చేస్తున్న సర్కారు తీరును నిరసిస్తూ శ్రీమతి షర్మిల పాదయాత్రకు మద్దతు పలికారు. పేదల నుంచి వినతిపత్రాలు స్వీకరిస్తూ.. రైతుల సమస్యలు ఓపిగ్గా వింటూ.. వారికి ధైర్యం చెబుతూ.. పార్టీ నేతల్ని కలుస్తూ శ్రీమతి షర్మిల ముందుకుసాగారు. గురువారం టి.నర్సాపురం మండలం మధ్యాహ్నపువారిగూడెంలో ఉదయం 9 గంటలకు పాదయాత్ర మొదలైంది.

శ్రీమతి షర్మిల బొర్రంపాలెం చేరుకునే సమయానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడకు చేరుకున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ బొర్రంపాలెంలోని బస ప్రాంతానికి వచ్చారు. శ్రీమతి షర్మిల సాయంత్రం వరకు అక్కడ విరామం తీసుకుని 4.30 గంటల ప్రాంతంలో తిరిగి పాదయాత్ర కొనసాగించారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోని వల్లంపట్ల, మల్లుకుంట, మహాలక్ష్మిపురం గ్రామాల్లో జనం పోటెత్తారు. ట్రాక్టర్లు, ఆర్టీసీ బస్సులు, ఆటోల్లో వెళుతున్న ప్రయాణికులు సైతం వాహనాలను నిలుపుదల చేయించి శ్రీమతి షర్మిలతో కరచాలనానికి పోటీపడ్డారు. మల్లుకుంటలో మహానేత వైయస్ విగ్రహానికి శ్రీమతి షర్మిల పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ పొగాకు రైతు పులగం వసంతరెడ్డి తదితరులు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని శ్రీమతి షర్మిలకు వివరించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిట్టుబాటు ధర బాగుందని, ఇప్పుడు తమ కష్టాల్ని పట్టించుకునే నాథుడే లేడని వాపోయాడు. పొగాకు రైతులకు ఆమె ధైర్యం చెబుతూ.. జగనన్న సారధ్యంలో రాజన్న రాజ్యం వస్తుందని, రైతులకు కష్టాలు తొలగిపోతాయని భరోసా ఇచ్చి ముందుకు సాగారు.

అనంతరం పాదయాత్ర చింతల పూడి నియోజకవర్గ పరిధిలోని కామవరపుకోట మండలం రావికంపాడు అడ్డరోడ్డుకు చేరుకునే సరికి ఏలూరు-జంగారెడ్డిగూడెం రహదారి జనంతో కిక్కిరిసింది. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. 150వ రోజున మొత్తం 11.5 కిలోమీటర్ల మేర సాగిన మేర పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. పాదయాత్రను పూర్తిచేసి రాత్రి 7 గంటల సమయంలో శ్రీమతి వైయస్ విజయమ్మ, శ్రీమతి షర్మిల రావికంపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. శ్రీమతి షర్మిల పినతండ్రి వైయస్ వివేకానందరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త మొవ్వ ఆనంద శ్రీనివాస్, ముఖ్య నాయకులు ఆర్కే, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, మేకతోటి సుచరిత, కూన శ్రీశైలం గౌడ్, గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, ఆదిరెడ్డి అప్పారావు, దేశాయి తిప్పారెడ్డి, జిల్లా నాయకులు కొయ్యే మోషేన్‌రాజు, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, గ్రంధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Back to Top