రాజన్నహామీలను జగనన్న నెరవేరుస్తారు

కర్నూలు:

ప్రజలు కష్టపడాల్సిన దుస్థితికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మహానేత తనయ,  వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.యస్. జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ధ్వజమెత్తారు. తాగు, సాగు నీరు లేని దయనీయ స్థితిని ప్రజలు ఎదుర్కొంటున్నారన్నారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా ఆస్పరి మండలం చిరుమాను దొడ్డి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో తనను కలిసేందుకు వచ్చిన రైతులు, కూలీలు, విద్యార్థులతో మాట్లాడుతూ వారి కష్టాలు తెలుసుకుంటూ 13.6 కిలోమీటర్లు నడిచారు. చిరుమాను దొడ్డి నుంచి హలిగేర, బెణిగేరి, నాగరూర్ క్రాస్ నుంచి ఆదోని నియోజకవర్గంలోని విరుపాపురంలోకి ప్రవేశించి అక్కడి నుంచి సాదాపురం క్రాస్, దిబ్బనకల్లు క్రాస్ మీదుగా ఆదోనికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో రాత్రి బసచేశారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రధాన ప్రతిపక్షాల వైఖరిని ఎండగట్టారు. జిల్లాలో తాను పాదయాత్ర ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎక్కడికెళ్లినా తాగు, సాగునీరు, కరెంటు బిల్లులు, గ్యాస్, పింఛన్ల గురించి ప్రజలు బాధపడుతున్నారన్నారు.

హంద్రీ నీవాను పూర్తి చేయలేని ప్రభుత్వమిది..

     ఆదోని, ఆస్పరి మండలాల్లోని 15 గ్రామాలకు తాగునీరు అందించేందుకు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి రూ. 11 కోట్లు మంజూరు చేసి ఎల్ అండ్ టీ కంపెనీతో పైపులైన్లు వేయిస్తే ఈ ప్రభుత్వం ఎల్‌ఎల్‌సీ నుంచి నీటిని కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, కరెంటు కోసం రాజన్న హయాంలో ఏనాడూ ప్రజలు ఆందోళన చెందలేదని ఆమె అన్నారు. రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా మొదలైన హంద్రీనీవా ప్రాజెక్టును సైతం పూర్తిచేయలేని అధ్వాన్న ప్రభుత్వం ఇదని ధ్వజమెత్తారు.

     చంద్రబాబు నాయుడి పాలనలో మాదిరిగానే ఇప్పుడు ప్రజలు అన్ని కష్టాలనూ కిరణ్‌కుమార్ రెడ్డి పాలనలో  ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజలు అధైర్య పడొద్దని, భవిష్యత్తులో రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని హామీ ఇచ్చారు. జగనన్న సీఎం అయితే ప్రజల కష్టాలన్నీ తీరుతాయని భరోసా ఇచ్చారు. పాదయాత్రలో షర్మిలతో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని, మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్‌వీ మోహన్ రెడ్డి, పార్టీ నేతలు తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, జిల్లా నేతలు ఏవీ సుబ్బారెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, గుమ్మనూరి జయరాం, తెర్నెకల్లు సురేందర్ రెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, డాక్టర్ మధుసూదన్, రమాదేవి,కడపకు చెందిన అల్లె ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top