ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించండి!

హైదరాబాద్ 21 నవంబర్ 2012 : ఎక్కడా తెలుగుదనం లేకుండా, కేవలం కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలాగా నిర్వహించదలచిన ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపు ఇచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన తెలుగు మహాసభల సన్నాహాల తీరు పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలను కాంగ్రెస్ ప్లీనరీగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
" భాషను పరిరక్షించవలసిన బాధ్యత నుండి ప్రభుత్వమే వైదొలగింది. ఇదంతా చూస్తుంటే తండ్రిని చంపి తద్దినం పెట్టినట్లుంది. రాష్ట్రంలో లక్షలాది మంది భాషాభిమా నులు పడుతున్నఆవేదన ఇది. ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న వ్యక్తికే తెలుగు సరిగా రాదు. పరిపాలనా వ్యవహారాలన్నీ ఇంగ్లీషులోనే సాగుతున్నాయి. చివరకు కమిటీలు వేసిన జీఓలు కూడా ఆంగ్లమాధ్యమంలోనే వెలువడ్డాయి" అని భూమన మండిపడ్డారు.
"ఎక్కడా తెలుగుదనం లేకుండా ప్రపంచ తెలుగు మహాసభలు జరపడం అత్యంత విచారకరం. ఏ ఒక్క కవినిగాని, రచయితనుగాని, భాష కోసం కృషి చేస్తున్నవారినిగాని పిలువకుండా ఈ సభలు జరపడమంటే ఇది కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలాగా సభలను నిర్వహించే ఉద్దేశ్యమే తప్ప మరొకటి కాదు. ఒక పక్క తెలుగుకు ద్రోహం చేస్తూ, మరో పక్క తెలుగును ఉద్ధరిస్తున్నట్లు కనిపించి తెలుగు భాషాభిమానుల మద్దతు పొందేందుకు కుట్ర చేస్తున్నారు. ఈ కుట్రకు ఎవరూ మోసపోవద్దు. 1975లో మహాకవి శ్రీశ్రీ పిలుపు స్ఫూర్తితో ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించండి! నిరసన కార్యక్రమాలు చేయాల్సిన అవసరమూ ఉంది." అని భూమన పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

Back to Top